Friday, December 27, 2024

భారతీయ సనాతన ధర్మం గొప్పది: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ సనాతన ధర్మం చాలా గొప్పదని భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం చేవెళ్ళలోని వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ ‘కళాకృతి’ పేరుతో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసత్యం నుంచి సత్యానికి, చీకటి నుంచి వెలుగులోనికి, మృత్యువు నుంచి అమరత్వానికి విడిచి పెట్టమన్న ఈ మాటలు సనాతన ధర్మంలోనివన్నారు. ఈ ఆలోచనలు నాలుగైదు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయన్నారు. వీటికి కుల, మతాలకు సంబంధం లేదన్నారు. ఇంత గొప్ప ఆలోచనలు కేవలం భారతదేశానికి మాత్రమే కలవన్నారు. అణుశక్తిని కనిపెట్టింది యూరప్ కాదని, వేలాది సంవత్సరాల క్రితం భారత్ కనిపెట్టిందన్నారు. ఎన్నో కారణాలతో భారతదేశ గొప్పతనం, సైన్స్ మర్చిపోయామన్నారు. ఆ క్రమంలో స్వాతంత్య్రం కూడా కోల్పోయాయని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత ముందుకు సాగుతున్నామన్నారు.

గత పదేళ్లలో భారతదేశం ఏవిధంగా ఉండేదో గుర్తించారని, భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలని ఆశిస్తున్నారన్నారు. నేషన్స్ ఫస్ట్ దృక్పథంతో ముందుకు సాగుతుండటంతో పదేళ్లలో పది నుంచి ఐదో స్థానానికి వచ్చామన్నారు. ఇంకో రెండేళ్లు ఉంటే మూడో స్థానానికి వచ్చేస్తామన్నారు. 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్ళు అవుతుందని, ఆ సమయానికి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్‌గా ఉండాలన్న ధ్యేయంతో ప్రధానమంత్రి మోడీ అడుగులు వేస్తున్నారన్నారు. మన పిల్లలే మన భవిష్యత్తు దేశం ముందుకు వెళ్లాలంటే, పిల్లల ఆరోగ్యం ముఖ్యమన్నారు. దీంతో పాటు మంచి విద్య అవసరమని, ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల సీఈవోలు, ఎండీలు భారత్‌కు చెందిన వారేనని, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలే ఇందుకు ఉదాహరణ అన్నారు. గతంలో నాలెడ్జ్‌కు ప్రాధాన్యత ఉండేదని, ఇప్పుడు కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యత పెరిగిందన్నారు. అందుకే ఏం మాట్లాడినా కాన్ఫిడెన్స్‌తో మాట్లాడాలని సూచించారు. సీబీఎస్‌ఈ సిలబస్ ఉన్న ఈ స్కూల్ చేవెళ్ళలో ఉండటం సంతోషంగా ఉందని, భాష, సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకూడదన్నారు. మా తండ్రి ఎంత ఎత్తుకు ఎదిగినా గ్రామాన్ని మర్చిపోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ కె. నరేష్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ లావణ్య నరేష్, డైరెక్టర్ హనుమంతరావు, మౌనికా వెంకటరెడ్డి, హరికృష్ణ, ప్రిన్సిపాల్ మానస చౌదరి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News