Wednesday, January 22, 2025

కొత్త ఆలోచనలు అంకురించాలి

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: దేశ రాజకీయాలను ఎవరు అధికారంలోకి వస్తారు, మరెవరు ఓడిపోయి అధోగతి పాలవుతారు అనే దాని మీదనే ఆధారపడి ఆలోచించడం, అంచనా వేయడం అరిగిపోయిన రికార్డు మీద గ్రామ ఫోను ముల్లు తిరిగే విధంగా మారిపోయింది. ఇంతకు మించి కొత్తగా ఆలోచించకపోడం, మీడియా కూడా దీనికే పరిమితం కావడం జరుగుతున్నది. దేశ ప్రజల ఆలోచనా సరళి ఎలా వుంది, వారు ఎటువంటి సామాజిక, ఆర్థిక విలువలను కోరుకొంటున్నారు, ఏ శక్తుల వెంట నడుస్తున్నారు, అది దేశానికి మంచిదా, కాదా, వారిని సరైన దారికి మళ్లించవలసిన అవసరం వుందా లేదా అనే చర్చకు బొత్తిగా చోటు దొరకడం లేదు.

వరుసగా రెండు సార్లు పార్లమెంటు ఎన్నికలను గెలుచుకొని భారతీయ జనతా పార్టీ దేశాధికార పీఠం మీద వున్నది. 2014లో మొదలైన దాని అధికార యాత్ర ఎనిమిదేళ్ళుగా అప్రతిహతంగా సాగుతున్నది. 2024 ప్రథమార్థంలో మళ్ళీ ఎన్నికలు జరగవలసి వుంది. ప్రజలు బిజెపిని అదే పనిగా నెత్తిన మోస్తున్నారంటే దాని మితవాద రాజకీయాల పట్ల పూర్తి అవగాహనతోనే వాటిని కోరుకుంటున్నారని అనుకోవచ్చునా? బిజెపి హిందూత్వ సిద్ధాంతం మెజారిటీ మతస్థులైన హిందువుల దేశాన్ని ఆవిష్కరించి మైనారిటీ మతస్థులను ద్వితీయ శ్రేణికి తొక్కేయాలని చూస్తున్నది. మైనారిటీలను బూచీలుగా చూపించి హిందువులను మతప్రాతిపదికన సంఘటితపరచడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నది.

దేశ రాజధాని ఢిల్లీలోనే ఆ పార్టీ ఎంపి పర్వేశ్ శర్మ వంటి వారు ఫలానా మతస్థులను బహిష్కరించాలంటూ ముస్లింలపై ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఎ నందకిశోర్ గుర్జార్ అయితే మరింత విద్వేషాన్ని విరజిమ్మారు. గో వధకు పాల్పడుతున్నాడనే నెపంతో మతోన్మాదులు హతమార్చిన అఖ్లాక్‌ను దారుణంగా నిందిస్తూ మాట్లాడారు. లౌజిహాద్‌కు పాల్పడే వారికి బుద్ధి చెప్పడానికి హిందువులు వంటింటి కత్తులను సిద్ధంగా వుంచుకోవాలని కర్నాటకకు చెందిన బిజెపి ఎంపి ప్రజ్ఞా సింగ్ ఇటీవలనే వ్యాఖ్యానించారు. బిజెపి అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యానాలు అంతర్జాతీయంగా నిరసనలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రసంగాల హింసోన్మత్త ప్రకటనలు జన జీవనాన్ని ఎంతగా కలుషితం చేస్తాయో తెలిసి కూడా ప్రధాని మోడీ గాని, హోం మంత్రి అమిత్ షా గాని వాటిని ఒక్కసారైనా ఖండించిన పాపాన పోలేదు.

అన్ని మతాల, అన్ని వర్గాల సహజీవన భూమిగా వర్ధిల్లుతున్న భారత దేశ సెక్యులర్ ముఖాన్ని ఛిద్రం చేసి నిరంతర విద్వేష విష కుంభంగా మార్చడమే బిజెపి ఉద్దేశమని ఇంత స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ ప్రజలు గ్రహించలేకపోతున్నారా, గ్రహించి దానినే కోరుకొంటున్నారా! తాజాగా న్యాయ వ్యవస్థ రూపురేఖలను కూడా మార్చివేసి మితవాద న్యాయమూర్తులతో నింపాలనే కుట్ర జరుగుతున్నదనే అనుమానాలు బయలుదేరాయి. కొలీజయంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌కడ్ వంటి వారు ఏ విధంగా విరుచుకుపడుతున్నారో కళ్ళముందున్న కఠోర సత్యమే. ఆర్థికంగా చూసినా బిజెపి హయాంలో ఏమి జరుగుతున్నదో వివరించనక్కర లేదు. బడా కార్పొరేట్ శక్తులకు అండగా నిలిచి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ వాటికి కట్టబెట్టడమే పరమావధిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పావులు కదుపుతున్నది.

అన్నదాతల శ్రమను, వారి భూమిని, పంటను కార్పొరేట్ దుకాణాలకు అర్పించడమే లక్షంగా తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులు ఏడాది పాటు చేసిన విజయవంతమైన పోరాటం గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర లేదు. తాత్కాలికంగా ఆ మూడు చట్టాలను వెనుకకు తీసుకొన్నప్పటికీ మోడీ ప్రభుత్వం రైతులపై నిలువెల్లా కక్షతో ఊగిపోతున్న సంగతి దాచేస్తే దాగని సత్యం. దేశ సంపద పెరుగుతున్నదని, ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ల డాలర్లకు చేరుకోబోతున్నదని గొప్పలు చెప్పుకోడం బిజెపి పాలకులకు అలవాటైపోయింది.

వాస్తవంలో అత్యధిక శాతం మంది నిత్య దారిద్య్రంలో మగ్గుతున్న దేశంగా మన ప్రగతి సూచీలు బాకా ఊదుతున్నాయి. కోట్లాది ఉద్యోగాల హామీగాని, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న వాగ్దానం గాని ఏ గాలికి కొట్టుకుపోయాయో తెలియదు. ఇలా అన్ని రంగాల్లోనూ ప్రజలను కాల్చుకుతినే విధానాలనే అవలంబిస్తున్న బిజెపిని వారు పదే పదే ఎందుకు ఎంచుకొంటున్నారు? సమాధానం కావలసిన ప్రశ్న. ప్రజలను ఈ విషయంలో చైతన్యవంతులను చేయవలసిన అవసరం కూడా వుంది. నేటి నుంచి మొదలవుతున్న నూతన సంవత్సరం (2023)లో 13 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశ ప్రజలను మౌలికమైన సైద్ధాంతిక అంశాలపై చైతన్యవంతులను చేయాలి. అన్ని పార్టీల అంతరంగాలపై మథనం సాగాలి. కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలు వెల్లివిరియాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News