Sunday, December 22, 2024

ద్రౌపదికి నల్లేరుపై నడకే!

- Advertisement -
- Advertisement -

ద్రౌపదికి నల్లేరుపై నడకే!
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థికే స్పష్టమైన గెలుపు అవకాశాలు
ఎన్‌డిఎ, బిజెడి, వైసిసి ఓట్లు కలిపితే 52శాతం ఆమెకే
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ అనివార్యమైనందున ఇప్పుడు అందరి దృష్టి బలాబలాపైనే కేంద్రీకృతమైంది. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం నల్లేరుపై నడకే కానుంది. అధికార ఎన్‌డిఎ ఓట్ల శాతం 50శాతం దాటడమే ఆమె విజయానికి బాటలు వేస్తోంది. తద్వారా భారతదేశానికి గిరిజన మహిళ మొదటిసారి రాష్ట్రపతి కానున్నారు. ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపదికి సొంతరాష్ట్రం ఒడిశాకు చెందిన అధికార బిజూ జనతాదళ్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మొత్తం ఓట్లలో(10,86,431) 52శాతం ఆమెకే (5,67,000) లభించనున్నాయి. బిజెపితో పాటు మిత్రపక్షాలకు చెందిన ఎంపిలు, ఎంఎల్‌ఎల ఓట్ల శాతం (3,08,000) కూడా ఇందులో కలిసివస్తుంది. నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజెడి ఓట్లు 32,000. అంటే మొత్తం ఎలక్టోరల్ ఓట్ల శాతంలో ఆ పార్టీవి 2.9శాతం. ఒడిశాలో అధికార బిజెడికి 114మంది శాసనసభ్యులున్నారు. బిజెపికి 22మంది ఉన్నారు. అదే విధంగా ఇరు పార్టీలకు చెరో 12మంది లోక్‌సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యులున్నారు. మరో రెండు ప్రాంతీయ పార్టీలు వైఎస్‌ఆర్‌సిపి, ఎఐఎడిఎంకె కూడా ఎన్‌డిఎ అభ్యర్థివైపే మొగ్గు చూపుతున్నాయి. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల తర్వాత ఎగువసభ అయిన రాజ్యసభలో బిజెపి సభ్యుల సంఖ్య 92కు చేరింది. ఇక లోక్‌సభలో బిజెపికి సొంతంగా 301 మంది సభ్యుల బలం ఉంది.
ఉత్తరప్రదేశే అతిపెద్ద బలం…
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థికి అత్యంత భరోసానిచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఉత్తరప్రదేశ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి యోగి నాయకత్వంలోని బిజెపి విజయ దుందుభి మోగించింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఈ రాష్ట్రానికి ఎంఎల్‌ఎ ఓటు విలువ అధికం కావడం ఇక్కడ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదికి మరో ప్లస్ పాయింట్. అధికారిక లెక్కల ప్రకారం పార్లమెంట్ ఉభయ సభల్లో ఉన్న మొత్తం 776 సభ్యుల్లో 393మంది బిజెపికి చెందిన వారే. అంటే స్పష్టమైన మెజారిటీ ఇక్కడ ఎన్‌డిఎ అభ్యర్థిదే అని అర్థమవుతోంది. బిజెపికి జెడి(యు)కు చెందిన 21మంది ఎంపిలు, ఆర్‌ఎల్‌జెపి, అప్నాదళ్, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సభ్యులు కూడా మద్దతు పలుకుతున్నారు. ప్రతి పార్లమెంట్ సభ్యుడికి 700 ఓట్లుంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి 4,033 మంది శాసనసభ్యులున్నారు. అధికార ఎన్‌డిఎకు సుమారు 440మంది ఎంపిల మద్దతు ఉంటే విపక్ష యూపీఏకు 180మంది మాత్రమే ఎంపిలున్నారు. 36మంది టిఎంసి సభ్యుల ఓట్లు కూడా విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌కే దక్కుతాయి.
రాష్ట్రాల నుంచి దక్కే ఓట్లు ఎన్ని…
యూపీలో బిజెపికి 273మంది శాసనసభ్యులున్నారు. ఒక్కొక్కరికి 208 ఓట్లుంటాయి. అంటే వారి ఓట్ల విలువ మొత్తం 56,784. ఆ తర్వాత అత్యధిక ఓట్లు బీహార్ నుంచే ఎన్‌డిఎ అభ్యర్థికి దక్కుతాయి. అక్కడ మొత్తం 127మంది ఎంఎల్‌ఎలు ముర్ముకు దన్నుగా నిలిస్తే ఒక్కొక్కరికి 173 ఓట్లుంటాయి. వాటి విలువ 21,971. ఆ తర్వాత మహారాష్ట్రలో 105 మంది బిజెపి ఎంఎల్‌ఎలు ఉంటే ఒక్కో ఓటు విలువ 175. ఇక్కడ 18,375 ఓట్లు లభిస్తాయి. మధ్యప్రదేశ్ నుంచి 131 మంది శాసనసభ్యులున్నాయి. వీరిఓట్లన్నీ కలిపితే 17,161. గుజరాత్ నుంచి 112మంది ఎంఎల్‌ఎల ఓట్ల విలువ 16,464, కర్నాటక నుంచి 122 మంది ఎంఎల్‌ఎల 15,982 ఓట్లు ఎన్‌డిఎ అభ్యర్థి ఖాతాలోనే పడనున్నాయి.
విపక్ష అభ్యర్ధికి ఎన్ని ఓట్లు దక్కేను…
విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌కు యూపీఏకు చెందిన ఎంపిల ఓట్లన్నీ కలిపితే 1,50,000 పడనున్నాయి. అదే స్థాయిలో వివిధ రాష్ట్రాల ఎంఎల్‌ఎల ఓట్లు ఆయనకు దక్కనున్నాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈ సారి విపక్షాల అభ్యర్థికి కొంత మేరకు అధికంగా లభించనున్నాయి. కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నికయినప్పుడు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ క్రియాశీలకంగా ఉంది. కానీ ఈ సారి అసెంబ్లీ లేని కారణంగా శాసనసభ్యుల ఓటు విలువ 708 నుంచి 700కు పడిపోయింది. కాగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జులై 18న నిర్వహిస్తున్నారు. ఫలితం 21న ప్రకటిస్తారు.

Indian Presidential Election 2022 on July 18th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News