దక్షిణాసియాలోనే మొట్టమొదటి రాత్రిపూట నిర్వహించే ఫార్ములా 4 స్ట్రీట్ కార్ రేస్‌ను నిలిపివేయడానికి మద్రాసు హైకోర్టు గురువారం నిరాకరించింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1మధ్య నిర్వహించనున్న ఈ రేసుకు ముందుగానే ఎఫ్‌ఐఎ సర్టిఫికెట్లు సమర్పించడానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకరించడంతో ఫార్ములా 4 స్ట్రీట్ కార్ రేసుకు హైకోర్టు అనుమతించింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఫార్ములా 4 కార్ రేసును నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి డి కృష్ణకుమార్,
జస్టిస్ పిబి బాలాజీతో కూడిన ఫస్ట్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. 3.7 కిలోమీటర్ల దూరం వరకు జరిగే ఈ కార్ రేసును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ రేసు కారణంగా ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుందని, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని బిజెపి అధికార ప్రతినిధి ఎన్‌ఎస్ ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కార్ రేసును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని ఆయన కోరారు.