భారత్‌లో రైల్వే చార్జీలు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల్లో కన్నా బాగా తక్కువ అని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. కాగా, రైల్వే శాఖ మంత్రిగా ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పటి కన్నా రైలు ప్రమాదాలు 90 శాతం మేర తగ్గాయని ఆయన నొక్కిచెప్పారు. 202526 సంవత్సరానికి రైల్వే మంత్రిత్వశాఖ కింద బడ్జెట్ పద్దులపై చర్చకు మంత్రి సమాధానం ఇస్తూ, జాతీయ రవాణా సంస్థ రైల్వేలు తన ఖర్చులు భరించేందుకు కొవిడ్ మహమ్మారి నాటి ఇబ్బందుల నుంచి బయటపడిందని తెలియజేశారు. మహా కుంభమేళాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనపై మాట్లాడేందుకు తమను అనుమతించకపోవడంపై ప్రతిపక్షాలు పెద్ద పెట్టున నిరసనలు వ్యక్తం చేస్తుండగానే మంత్రి మాట్లాడుతూ, స్టేషన్లలో జన సమూహం నియంత్రణకు రైల్వే శాఖ పలు చర్యలు తీసుకున్నదని, పండుగల సీజన్లలో పలు ప్రత్యేక రైళ్లు నడుపుతోందని తెలిపారు. భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి కేంద్రీకరించడంతో
రైలు ప్రమాదాల సంఖ్య లాలూ యాదవ్ కాలంలో కన్నా 90 శాతం మేర తగ్గినట్లు వైష్ణవ్ తెలియజేశారు. ‘లాలూ యాదవ్ కాలంలో ఒక సంవత్సరంలో దాదాపు 234 ప్రమాదాలు, 464 రైళ్లు పట్టాలు తప్పిన సంఘటనలు, ఏడాదికి దాదాపు 700 జరిగాయని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని మోడీ భద్రతపై దృష్టి కేంద్రీకరించి, కొత్త టెక్నాలజీని, పెట్టుబడులను తెచ్చారని, ఇప్పుడు దుర్ఘటనల సంఖ్య 33 ప్రమాదాలకు, 43 పట్టాలు తప్పిన ఘటనలకు తగ్గిందని ఆయన చెప్పారు. పది వేల లోకోమోటివ్‌లపైన, 15 వేల కిమీ మేర కవచ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలియజేశారు. రైల్వే శాఖ 2020 తరువాత చార్జీలను పెంచలేదని, అప్పటి నుంచి స్థిరంగానే ఉన్నాయని ఆయన చెప్పారు. రైల్వే శాఖకు బడ్జెట్‌ను ‘చరిత్రాత్మకమైనది’గా వైష్ణవ్ శ్లాఘిస్తూ, తమ శాఖ సొంత ఆదాయంలో నుంచే ఖర్చులు అన్నీ భరిస్తోందని తెలిపారు. లోక్‌సభ ఆ తరువాత రైల్వే మంత్రిత్వశాఖ బడ్జెట్ పద్దులను ఆమోదించింది.