Thursday, January 23, 2025

రైల్వే పార్సిల్ రవాణా భద్రత పటిష్టతపై దృష్టిసారించిన భారతీయ రైల్వే

- Advertisement -
- Advertisement -

దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి పార్సిల్ స్కానర్ హైదరాబాద్ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు

Indian Railways focuses on parcels by transport security
మనతెలంగాణ/హైదరాబాద్:  రవాణా, రైలు ప్రయాణంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సురక్షితమైన రైలు ప్రయాణానికి వీలుగా రైళ్ల ద్వారా రవాణా చేసే పార్సిల్ సరుకులను స్కానింగ్ చేసే ప్రక్రియను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. అందులో భాగంగా హైదరాబాద్ స్టేషన్ పార్సిల్ కార్యాలయంలో మొదటి పార్సిల్ స్కానర్‌ను ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వేలో తొలిసారిగా ఈ వినూత్న వ్యవస్థను దక్షిణమధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్‌లో ప్రారంభించడం సంతోషకరమని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. పార్సిల్ సరుకులను సాధారణంగా పార్సిల్ వ్యాన్లలో లేదా ప్రయాణికుల రైళ్లలోని గాడ్స్ బ్రేక్ వ్యాన్ పక్కన ఉండే లగేజ్ రూంలో రవాణా చేస్తారు. రైళ్లలో పార్సిల్ రవాణా చేసేందుకు ఇటీవల రైల్వే అనేక ఆకర్షణీయమైన విధానాలను చేపట్టడంతో ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పార్సిల్ రవాణా భారీగా అభివృద్ధి చెందింది. ఈ సందర్భంగా ప్రయాణికులు, వినియోగదారుల సురక్షితం కోసం రైల్వే పార్సిల్ రవాణాలో అనేక భద్రతా చర్యలు చేపడుతున్న సికింద్రాబాద్ డివిజన్ హైదరాబాద్ స్టేషన్‌లోని పార్సిల్ కార్యాలయంలో పార్సిల్ స్కానర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఎన్‌ఐఎన్‌ఎఫ్‌ఆర్‌ఐఎస్‌లో భాగంగా స్కానర్ ఏర్పాటు
భారతీయ రైల్వే న్యూ ఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్ (ఎన్‌ఐఎన్‌ఎఫ్‌ఆర్‌ఐఎస్)లో భాగంగా ఇక్కడ స్కానర్‌ను రైల్వే శాఖ ప్రారంభించింది. మొదటిసారిగా ప్రారంభించిన ఈ వినూత్న పథకంలో భాగంగా రైల్వే వారికి ఖర్చు రహితంగా పార్సిల్ స్కానర్స్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. సరుకులు, రైలు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రవాణా చేసే ప్యాకింగ్‌లు బుక్ చేసేముందు కచ్చితంగా అధికారులు ఈ ప్యాకింగ్‌లను స్కానింగ్ చేయనున్నారు. ఒకసారి స్కానింగ్ పూర్తయిన తర్వాత వాటిపై స్టిక్కర్లు/స్టాంపులు అతికిస్తారు. స్కాన్ చేసిన ప్యాకేజీలను మాత్రమే బుకింగ్, లోడింగ్‌కు అనుమతిస్తామని రైల్వే శాఖ తెలిపింది. వీటికి నామమాత్రపు రుసుంను అధికారులు వసూలు చేయనున్నారు. నాన్ లీజ్డ్ పార్సిల్ వ్యాన్లలో పార్సిల్ బుకింగ్ కోసం ప్రతి ప్యాకేజీపై రూ.10, లీజ్డ్ వ్యాన్లలో పార్సిల్స్ కోసం ప్రతి ప్యాకేజీపై రూ.5లను రైల్వే శాఖ వసూలు చేస్తోంది.
అధికారులు, సిబ్బందికి జిఎం అభినందన
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ జైన్ స్కానింగ్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవతో కృషి చేసిన సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా వారి బృందంతో పాటు ప్రధాన కార్యాలయం అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. రైలు రవాణాలో రక్షణ, భద్రతను చేపట్టడంలో దక్షిణ మధ్య రైల్వే ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రస్తుత సమయాల్లో ఇలాంటి వ్యవస్థల అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదే తరహా భద్రతా చర్యలు ఇతర ప్రధాన పార్సిల్ కార్యాలయాలలో కూడా రాబోయే రోజుల్లో చేపట్టడానికి అవకాశాలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News