న్యూఢిల్లీ : రానున్న సంవత్సరాల్లో భారత్ వెయ్యి అమృత్ భారత్ రైళ్లను తయారు చేయగలుగుతుందని , గంటకు 250 కిమీ వేగంతో ఇవి నడుస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం వెల్లడించారు. పిటిఐ వీడియోస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో వైష్ణవ్ మాట్లాడుతూ వందేభారత్ రైళ్లను ఎగుమతి చేసే పనిని ఇప్పటికే ప్రారంభమైందని, రానున్న ఐదేళ్లలో మొదటి ఎగుమతిని దేశం చూడగలుగుతుందని వివరించారు. గత పదేళ్లలో నరేంద్రమోడీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పరివర్తన కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ప్రపంచం లోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి చీనాబ్ బ్రిడ్జి కోల్‌కతా మెట్రో రైలు కోసం నదీగర్భం కింద సొరంగ నిర్మాణం తదితర నిర్మాణాలు చెప్పుకోదగిన సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే రంగంలో చోటు చేసుకున్నాయని వివరించారు.
రైల్వే రంగానికి భారీ సామాజిక బాధ్యత ఉందని పేర్కొంటూ ప్రతిఏటా 700 కోట్ల మందిని అలాగే ప్రతిరోజూ రెండున్నర కోట్ల మందిని రైల్వే ద్వారా గమ్యాలకు చేర్చడమౌతోందని చెప్పారు. ఒక వ్యక్తిని రైలు ద్వారా తీసుకెళ్లడానికి రూ. 100 వరకు వ్యయం అవుతుండగా, కేవలం రూ.45 మాత్రమే తాము ఛార్జీ వసూలు చేయడమౌతోందని ఉదహరించారు. ఈ విధంగా 55 శాతం ప్రతి ప్రయాణికునికి డిస్కౌంట్ ఇస్తున్నట్టు వివరించారు. రైల్వే సామర్థం గురించి ప్రస్తావిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టు అమృత్‌భారత్ రైళ్లను రూపొందించినట్టు, దీనిలో వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణం కేవలం రూ. 454కే లభిస్తుందని పేర్కొన్నారు. యువతలో వందేభారత్ ఎక్కువగా ప్రాచుర్యం పొందిందని, ముఖ్యంగా ప్రతివారం ఒక వందేభారత్‌ను కొత్తగా రైళ్లలో చేర్చడమౌతోందని చెప్పారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో ఈ రైళ్లు కనీసం 400 నుంచి 500 వరకు తయారవుతాయని వివరించారు.