ఐదు వేల సంవత్సరాల క్రితం వరకు భారతీయులంతా కుల, మత, దైవ భావనలకతీతంగా మనుషులుగా, సమూహాలుగా, సంఘ జీవులుగా, ప్రకృతి ఆరాధకులుగా ఉండేవారు. ఆర్యులు వచ్చి భారతదేశంలో వర్ణ వ్యవస్థను స్థాపించి కుల, సామాజిక అంతరాలను సృష్టించి భారత జాతిని వేల కులాలుగా విభజించారు. మరి కొద్ది కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థతతో పాటు పంచమవర్ణం ఏర్పడింది. కుల, మత, సామాజిక అంతరాలు, అంతరానితనం లాంటి సామాజిక రుగ్మతలతో దేశం మరింత విభజనకుగురయింది.దేశప్రజలు కులాలుగా, అంటరానివాళ్ళుగా, శూద్రులుగా, పైత్రివర్ణాలుగా విభజింపబడి సామాజిక అంతరాలతో సతమతమవుతూ దుఃఖితులై ఉండటం చూసివారి దుఃఖాన్ని మాన్పటానికి బౌద్ధనైతిక ధర్మాన్ని స్థాపించాడు బుద్ధుడు. బౌద్ధ నైతికధర్మం మనుషులను, భారతీయులను ఐక్యం చేసిన మానవ ధర్మం. కులాలుగా, వర్ణాలుగా, మూఢనమ్మకాలు, అశాస్త్రీయ విషయాలతో విభజింపబడిన భారత జాతిని ఒకటి చేసిన ధర్మం. భారతీయులందర్నీ బుద్ధుడు బహుజనులని, ‘బహుజన హితాయ -బహుజన సుఖాయ’ అన్నాడు. బౌద్ధ ధర్మంలో కులాలకతీతంగా అందరికీ ప్రవేశం లభించింది.
బౌద్ధం భారత దేశంలో మంచి దశలో ఉన్న కాలంలో శూద్రులైన మౌర్యులు దేశాన్ని పాలించారు. అశోకుడు బౌద్ధధర్మం అవలంబించిన వాడవడంతో ఆసియా ఖండమంతటా విస్తరించింది. బౌద్ధం దేశంలో ఉచ్ఛస్థితిలో ఉన్న కాలంలో భారతదేశం అఖండంగా, అజేయంగా ఉంది. మౌర్యరాజులు భారత ప్రజలను అన్నదమ్ముల్లా ఉంచగలిగారు. బౌద్ధం సమయంలో ఏ విదేశీయుడూ ఈ దేశం వైపు కన్నెత్తి చూడలేదు. భారతీయులుగా దేశ ప్రజల ఐక్యత ఇతర దేశస్థులు ఈ దేశం దిక్కు చూడటానికి, దండయాత్రలు చేయటానికి అవకాశమివ్వలేదు. ఒక్క అలెగ్జాండర్ మాత్రం దేశంపైకి దండయాత్ర చేసినా దేశ ప్రజల ఐక్యత, పురుషోత్తముడి పరాక్రమం చూసి ఈ దేశంలో ఉండలేకపోయాడు. తన మాతృభూమి గ్రీసు దేశం చేరకుండానే మార్గమధ్యంలోనే మరణించాడు. ఈ దేశంలో కులమతాలు, సామాజిక అంతరాలు రాకముందున్న భారతీయ ఐక్యత బౌద్ధ ధర్మం బాగా విలసిల్లిన కాలం లో మూడు పూవులారు కాయలన్నట్టుగా వర్ధిల్లింది.
పుష్యశృంగుడి కాలంలో ప్రారంభమైన బౌద్ధధర్మ విధ్వంసం, గుప్తరాజులు, ఆ తర్వాతి కాలంలో పరిసమాప్తమైంది. దేశంలోంచి బౌద్ధధర్మం తరిమివేయబడి మత ధర్మ విషయంగా భారతదేశం ఆత్మహత్య చేసుకుంది. దేశం మళ్ళీ కులాలుగా, సామాజిక అంతరాలుగా, శైవ వైష్ణవ మతాలుగా విభజింపబడింది. మనుషుల్లో విభజన రేఖలు గీయబడ్డాయి. మనుషులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, అతిశూద్రులుగా, శైవ వైష్ణవులుగా, వేల కులాలుగా విభజింపబడి భారతీయుల్లోని ఐక్యత దెబ్బతింది. ప్రజలమధ్య అంతరాలు, మత కలహాలు, రాజుల మధ్య అంతఃకలహాలు, ప్రాంతాల మధ్య కలహాలు బౌద్ధం దేశంలోంచి పోయింతర్వాత అధికమయ్యాయి. దేశంలోని ఈ స్థితిని చూసి వహుణులు, శకులు, మహమ్మదీయులు, ఆ తర్వాత ఫ్రెంచివారు, పోర్చుగీసువారు, డచ్చివారు ఈ దేశంపై దండెత్తారు. దేశ ప్రజలను ఐక్యంగా ఉంచే ధర్మం కరువై కుల, మత, ప్రాంత, భాష, జాతి విభేదాలు, అంతరాల దొంతరలు విదేశీయుల దండయాత్రలకు ద్వారాలు తెరిచాయి. తత్ఫలితంగా ముస్లిం రాజులు భారదేశాన్ని ఎనిమిది వందలేండ్లకు పైగా పాలిస్తే, ఆంగ్లేయులు రెండువందలేండ్లకు పైగా పాలించారు.
మానవీయ ధర్మం బౌద్ధాన్ని దేశం నుంచి తరిమివేసి భారత దేశాన్ని వెయ్యేండ్లు పాలించిన హిందూ రాజులు కాని, ఎనిమిది వందలేండ్లు పాలించిన ముస్లిం రాజులు కాని, చివర్లో రెండు వందలేండ్లు పాలించిన బ్రిటిష్ ప్రభువులు కాని వారివారి మతాలకు, ప్రార్ధనాలయాలకిచ్చిన ప్రాధాన్యత దేశ ప్రజలందరినీ ఐక్యంగా ‘మనుషులు’గా ఉంచటానికి ఇవ్వలేదు. వేల కులాలుగా సామాజిక అంతరాలతో సతమతమవుతున్న భారతీయులను కలుపడానికి ప్రయత్నించలేదు. ఊరూరికీ, వాడవాడకూ, దేవాలయాలు, మసీదులు, చర్చీలు నిర్మించారే కాని ప్రజలందరినీ కలిపే విద్యాలయాలు, వైద్యాలయాలు నిర్మించలేదు. ఒకరి ప్రార్ధనాలయాలను కూల్చుతూ మరొకరు, కూల్చకుండానూ పోటాపోటీగా మత సంబంధిత కట్టడాలు నిర్మించారే తప్ప మనిషి సంబంధిత ఆలోచనా ధారను పెంపొందించలేదు. మానవీయమైన, మనిషి దుఃఖోపశమన మార్గమైన బౌద్ధస్రవంతిని నాశనం చేసి తమతమ మతసంబంధ సంస్కృతిని దేశ వ్యాప్తం చేశారు. మెకాలే ఆధునిక, భౌతికపరమైన ఆంగ్లేయ విద్య ప్రేవేశపెట్టేంత వరకు దేశంలో మతసంబంధ విద్య తప్ప భౌతిక విద్య లేదు. అదీ కొద్దిమందికే.
భారతదేశంలో దైవ, తదితర విశ్వాసాలకు, మతాలకు ఇచ్చిన ప్రాధాన్యత, పెట్టిన ఖర్చు విద్య, వైద్య, పేదరిక నిర్మూలనకు పెట్టిఉంటే ఈ దేశంలో పేదరికం, అవిద్య, పోషకాహారలోపం లాంటి అనేక రోగాలు మచ్చుకు లేకుండా పోయి విద్య, వైజ్ఞానిక మానవీయ సమాజం ఏర్పడి ఉండేది. బౌద్ధ స్రవంతి మానవ ధర్మ ఆలోచనాధార బుద్ధుని, మౌర్య రాజుల కాలంలోలా బతికుంటే తక్షశిల, నలంద, విక్రమపురి లాంటి విశ్వవిద్యాలయాలు వేల సంఖ్యలో దేశ వ్యాప్తంగా వందలు, వెయ్యేండ్ల కిందనే వచ్చి మనుషులంతా ఒక్కటేనన్న భావం పెరిగి ఉండేది. భారతీయులంతా మనుషులుగా జోడింపబడక కులాలు, మతాలు, భాషలు, జాతు లు, ప్రాంతాలు, విశ్వాసాలుగా విభజించబడటం వల్ల చరిత్ర పొడవునా యుద్ధాలు, సంఘర్షణలు, రక్తపాతమే. ఏ మతం వాళ్ళు పాలన చేస్తే అ మతం వాళ్ళు గొప్పగా అభివృద్ధి చెందుతారన్నది పెద్ద భ్రమ. అట్లయితే భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులలో ఎవరూ పేదవారుండకూడదు. యూరోపు ఖండంలోనూ, అమెరికాలోనూ క్రైస్తవులు పేదలుగా ఉండకూడదు. భారత దేశంలోని హిందూ శూద్రులు, దళితులు, ముస్లింలలోని చాలా ఉపకులాలు, దళిత క్రైస్తవులు, పేద క్రైస్తవులు ఎంతో మంది ఆయా మత పాలకుల కాలంలో పేదరికాన్నీ, సామాజిక అంతరాలను అనుభవించినవారే కదా! అనుభవిస్తున్నవారే కదా! కులా లు, మతాలు, విశ్వాసాలు మనుషులను విభజించాయి, దేశాన్ని విభజించాయే తప్ప ప్రజలకొరగబెట్టిందేమీ లేదు. అందుకోసం లౌకికత్వం, మనిషితత్వం పెంపొందిoచాలి.
భారతదేశంలోని ప్రజలందరినీ కలుపడానికి భారతీయులంతా ఒకటిగా జీవించటానికి ప్రపంచంలోనే ఎన్నదగినదనబడే ‘భారతరాజ్యాంగం’ రాశాడు అంబేడ్కర్. భారతదేశాన్ని ఐక్యంగా ఉంచి న బౌద్ధ ధర్మంలోని అశోక ధర్మచక్రాన్ని జాతీయ జెండాలో ప్రతిష్టింప జేశాడు. సామాజిక అంతరాలను, ఆర్థిక అంతరాలను, మత విభేదాలను తగ్గించి దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి నెహ్రూ, అంబేడ్కర్ రాజ్యాంగంలో సోషలిస్టు, లౌకిక, మత స్వేచ్ఛ పదాలను చేర్చారు. రాజ్యాంగంలో పొందుపరిచిన Preamble, రాజ్యాంగం బాగా అమలు జరిగి ఉంటే దేశంలో కుల, మత, సామాజిక అంతరాలు, నిరక్షరాస్యత, అంటరానితనం లాంటి అమానవీయ రుగ్మతలు అంతరించిపోయేవి. అంబేడ్కర్, నెహ్రూ బతికున్న కాలంలో ఈ ఆశయాలు నెరవేరుతాయన్న ఆశ ఉన్నా క్రమక్రమంగా బిజెపి లాంటి మతతత్వ శక్తులు బలపడటంతో ఆ ఆశవమ్మయ్యింది. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సమీక్ష చేయాలని వాజ్‌పేయ్ కాలంలో, రాజ్యాంగాన్నే మార్చాలని మోడీ కాలంలో బలమైన వాదనలు బయటకొచ్చాయి.
ఎనిమిదేళ్ళ మోడీ పాలనలో భారతదేశం కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, మధ్యయుగాల్లో కంటే ఎక్కువ వేగంగా విడిపోతుంది. కొందరి దగ్గరే దేశ సంపదంతా చేరి ధనిక, పేద వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు వ్యక్తుల పరమతమవుతూ భారతదేశ సార్వభౌమత్వం దెబ్బతింటుంది. ప్రజాసామ్యం,ఫెడరలిజం, లౌకిక భావాలు నవ్వుల పాలవుతూ కేంద్ర, రాష్ట్ర సంబంధాలు దెబ్బతింటున్నాయి. మనిషిని మనిషిని ప్రేమించుకునే, మానవ సంబంధాలను పెంపొందించుకునే రాజకీయాలకు బదులు ‘ద్వేష’ పూరిత రాజకీయాలు విశృంఖల విహారం చేస్తున్నాయి. దేశంపై లక్షల కోట్ల అప్పుల భారం పెరిగి అమ్మకానికో దేశం అనే స్థితిలోకి దేశం నెట్టబడుతుంది. దేశ మంటే మతం, దేశభక్తంటే మతభక్తి తప్ప మనిషికాదన్న భావం వ్యాప్తి చెందుతుంది.
ఇలాంటి పరిస్థితులలో యువనాయకుడు, ప్రతిష్ఠాకరమైన దేశభక్త రాజకీయ కుటుంబ నేపథ్యమున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్రను కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేయడానికి సంకల్పించి ప్రారంభించాడు. రాహుల్ మచ్చలేని నాయకుడు, నెహ్రూ కుటుంబం లౌకికత్వానికి, సెమీ సోషలిస్టు భావాలకు, ప్రాంతాతీత మానవ సంబంధాలకు పెట్టింది పేరు. నెహ్రూ చేపట్టిన ప్రభుత్వరంగ బలోపేతం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, అలీన విధానం, ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయీకరణ, గరీబీ హటావో విధానం పివి, మన్మోహన్‌ల పనికి ఆహార పథకం, దేశాన్ని ఆర్ధికంగా బలోపేతం చేయడం, కాంగ్రెస్, ఇతర పాలకులు రాజ్యాంగాన్ని కొంత వరకైనా హత్తుకోవడం, టిఆర్‌ఎస్ లాంటి పార్టీల సంక్షేమ పథకాలు అన్నిటినీ భ్రష్టు పట్టిస్తున్న బిజెపి రహిత భారతమే ఈ యాత్ర ప్రధానోద్దేశం. ఇదొక చరిత్రాత్మక పాదయాత్ర స్వాతంత్య్ర పోరాట కాలంలో జరిగిన దండియాత్ర, క్విట్ ఇండియా ఉద్యమాలను మించినయాత్ర. తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ ప్రజలు, సోషలిస్టు వ్యవస్థ కొరకు చైనా ప్రజలు చేసిన లాంగ్ మార్చ్‌ను మరిపించిచేలా భారత్ జోడో సాగాలి. కులాలుగా, మతాలుగా, జాతులుగా, ప్రాంతాలుగా, విశ్వాసాలుగా విభజింపబడిన దేశీయులను ‘భారతీయులు’ గా, మనుషులుగా ఐక్యం చేసి దేశాన్ని ఐక్యం చేసి, రక్షించే యాత్ర.., భారత్ జోడో -దేశ్కో బచావో పాదయాత్రను బిజెపియేతర పార్టీలన్నిటితో పాటు బిజెపిలోని ప్రజాస్వామిక మానవతా వాదులందరూ సమర్ధించి భారత దేశ సార్వభౌమత్వాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తారని ఆశిద్దాం… భారత్ జోడో -దేశ్కో బచావో యాత్ర, విజయవంతం కావడం నేటి చారిత్రక, రాజకీయ, మానవీయావసరం.
డా॥కాలువ మల్లయ్య
9182918567