న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్‌లో విద్యార్థుల హింసాత్మక కోటా ఉద్యమ ప్రభావం అక్కడి భారతీయ విద్యార్థులపై పడింది. అక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని ఇప్పటివరకూ మొత్తం 778 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరారు. మరో 300 మంది వరకూ విమానాల్లో వచ్చారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరంతా వేర్వేరు మార్గాల మీదుగా ఇక్కడికి వచ్చారని వివరించారు. పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో ఇప్పటికీ వివాదాస్పద ఉద్యోగ రిజర్వేషన్లపై భీకర ఘర్షణలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థుల యోగక్షేమాల గురించి ఎప్పటికప్పుడు అక్కడి మన దేశ రాయబార కార్యాలయం తరచూ ఆరా తీస్తోంది. భారతీయులు, అక్కడి మన దేశ విద్యార్థుల క్షేమం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. స్వదేశానికి రావాలనుకునే విద్యార్థులను గుర్తించి వారిని తిరిగి భారత్‌కు తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భూ మార్గాల ద్వారా దాదాపు 800 మంది వరకూ తిరిగి వచ్చారు. కాగా దాదాపు 200 మంది వరకూ ఢాకా, చిట్టగాంగ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు తరలివచ్చారు. ఈ విధంగా ఇప్పటివరకూ దాదాపు వేయి మంది వరకూ భారతీయ విద్యార్థులు, కొందరు పౌరులు ఇక్కడి వారివారి ప్రాంతాలకు చేరారని అధికారిక ప్రకటనలో తెలిపారు.
ప్రతిభ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని, పలురకాల రిజర్వేషన్లతో తమకు అన్యాయం జరుగుతోందని విశ్వవిద్యాలయాలే వేదికగా ఆరంభమైన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఇప్పుడు దేశంలోని పలు నగరాలు, పట్టణాల వీధుల్లోకి చేరింది. ఈ క్రమంలో పోలీసు బృందాలకు నిరసనకారులకు మధ్య ఘర్షణ పలువురు మృతికి దారితీసింది. షేక్ హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసే వరకూ తమ నిరసనలు సాగుతాయని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అక్కడి ఘర్షణలలో 50 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లింది. బంగ్లాదేశ్‌లో మన భారతీయులు దాదాపుగా 15000 మంది వరకూ ఉంటారని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు.