Wednesday, January 22, 2025

రూపాయిని కాపాడేదెలా?

- Advertisement -
- Advertisement -

నేను ఓడిపోలేదు, వాడు గెలిచాడు అని అనడం కింద పడినా పైచేయిగానే వున్నట్టు చెప్పుకొనేవారి దబాయింపుకి ప్రబల తార్కాణం. డాలర్‌తో రూపాయి మారకపు విలువ వేగంగా, దారుణంగా పడిపోడం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ సరిగ్గా ఇలాగే వుంది. రూపాయి విలువ తగ్గడం లేదు, డాలరు పుంజుకొంటున్నది అని ఆమె తన నేతృత్వంలో దేశ ఆర్థిక స్థితి దెబ్బ తినడం లేదని పరోక్షంగా చెప్పుకున్నారు. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి విలువ అపూర్వ రీతిలో అమిత వేగంగా పడిపోతున్నది. తాజాగా మరి 27 పైసలు తగ్గిపోయి ఒక డాలరు రూ. 82.76 తో సమానమైంది. ఈ సంవత్సరారంభంలో డాలర్‌కు 74గా వున్న రూపాయి సంవత్సరం ముగుస్తున్న సమయానికి ఇంతగా పడిపోడం అసాధారణ విషయం.

ప్రధాని మోడీ తొలిసారి ప్రధాని అయిన 2014 నాటికి డాలర్‌కు 62.33 రూపాయిలు పలుకగా, ఇప్పుడది మరి రూ. 20 పడిపోయింది. ఈ పడిపోడం రూపాయి బలహీనత వల్ల గాక డాలర్ బలపడడం వల్ల జరుగుతున్నదని, అందుకు ఆందోళన చెందవలసిన పని లేదని నిర్మలా సీతారామన్ అంటున్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 2013 ఆగస్టులో డాలర్‌తో రూపాయి విలువ పతనం గురించి అప్పటి యుపిఎ ప్రభుత్వంపై అత్యంత వ్యంగ్య కంఠంతో వ్యాఖ్యానించారు. రూపాయి, యుపిఎ విలువలు పోటీ పడి పతనమవుతున్నాయని అన్నారు. అధికారాన్ని, పదవులను కాపాడుకోడమే ప్రధానంగా యుపిఎ పాలకులు వ్యవహరిస్తున్నారని, రూపాయిని కాపాడలేకపోతున్నారని మోడీ అప్పుడు నిశితంగా విమర్శించారు. ధరల పెరుగుదలను ఆపలేని దద్దమ్మలని వారిపై విరుచుకుపడ్డారు. అప్పట్లో డాలర్‌తో రూపాయి విలువ 64 కంటే కిందికి దిగజారిపోయింది. అప్పుడు కూడా డాలర్ బలపడినందునే రూపాయి పడిపోయింది.

రూపాయిల్లో డాలర్ విలువ పెరిగే కొద్దీ దానిని చెల్లించి మనం విదేశాల నుంచి కొనుక్కొనే సరకుల దిగుమతి ఖర్చు ఎగబాకుతుంది. అది దేశంలో సరకుల ధరలను విపరీతంగా పెంచి వేసి ప్రజల బతుకులను మరింత దుర్భరం చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆయిల్ కోసం మనం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాము. ఇది ఇక్కడి ధరలను భగ్గుమనిపిస్తున్నది. డాలరు బలపడుతున్నదేగాని రూపాయి బలహీనపడడం లేదనడం అతి తెలివి మాటే. వాస్తవంగా ప్రజల జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందనేదే ఏ పరిణామానికైనా గీటురాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నదని, వచ్చే ఏడాది కూడా ఈ పరిస్థితిలో మార్పు రాదని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ రాజన్ బుధవారం నాడు రాజస్థాన్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ వ్యాఖ్యానించారు.

Rupee

దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడే సంస్కరణలను తీసుకురాడంలో భారత ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. కరోనా వల్ల అత్యధికంగా నష్టపోయిన కింది మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దేశ ఆర్థిక విధానాలను రూపొందించాలని, వాస్తవంలో అది జరగడం లేదని ఆయన అన్నారు. కరోనా సమయంలో ఉన్నత మధ్య తరగతి కుటుంబాల వారు ఇళ్ళ నుంచి కూడా పని చేసి ఆదాయం సంపాదించుకున్నారని, కింది మధ్య తరగతి ప్రజలే నిరుదోగంలో కూరుకుపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎగుమతులు తగ్గుతున్నాయని, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతున్నదని అందువల్ల వృద్ధి రేటు పడిపోక తప్పదని అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు ఇచ్చి వాటి అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరముందని సూచించారు. ఇందుకు విరుద్ధంగా ప్రధాని మోడీ ప్రభుత్వం అంబానీ, అదానీల బడా కార్పొరేట్ పరిశ్రమలకే కొమ్ముకాస్తున్నది. గత ఎనిమిదేళ్ళ ఎన్‌డిఎ హయాంలో లక్షలాది చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి.

Digital Rupee

అమెరికా బ్యాంకు అదే పనిగా వడ్డీ రేట్లను పెంచుతున్నది. అక్కడ ద్రవ్యోల్బణాన్ని అదుపులో వుంచడానికి అందుకు పాల్పడుతున్నది. దానితో మన స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపుదార్లు భారీ ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకొని అమెరికన్ మార్కెట్లకు తరలిపోతున్నారు. ఇది మన షేర్ మార్కెట్‌ను భారీ గా పతనమొందించి ఆర్థిక వ్యవస్థను కుంగజేస్తున్నది. గురువారం నాడు మన షేర్ మార్కెట్ల విషయంలో ఇదే జరిగింది. బొంబాయి స్టాక్ ఎక్స్‌ంజ్ ఉన్నపళంగా 879 పాయింట్లు పతనమైంది. నేషనల్ స్టాక్ ఎకేంజ్ నిఫ్టీ కూడా 245.40 పాయింట్లు తగ్గిపోయింది. అమెరికా ఫెడరల్ బ్యాంకు ముందు ముందు మరింతగా వడ్డీ రేట్లు పెంచనున్నదనే ఊహాగానాలు మన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లపై మరింత వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయి. దేశంలో తయారీ రంగాన్ని అసాధారణ స్థాయిలో మెరుగుపరచవలసి వుంది. ప్రపంచ మార్కెట్లలో పోటీని తట్టుకొని ముందుకు పోయేలా మన ఎగుమతి సరకుల నాణ్యతను పెంచవలసి వుంది. ఇది జరగకుండా డాలర్‌తో తట్టుకొని రూపాయి నిలదొక్కుకోడం జరిగే పని కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News