భారతీయ సైంటిస్టు సారధ్య విజయం
ధర తక్కువ…పర్యావరణ పరిరక్షణ
ఆవాల తరహా మొక్కలతో రూపకల్పన
వాషింగ్టన్ : మొక్కలతో రూపొందించిన విమాన ఇంధనం కార్బన్ ఉద్గారాల శాతాన్ని తగ్గిస్తుంది. వాయు కాలుష్యాన్ని గణనీయంగా నివారిస్తుంది. భారతీయ సంతతి శాస్త్రజ్ఞులు పునీత్ ద్వివేది సారథ్యంలోని బృందం ఆవాల వంటి మొక్కలతో విమానాలలో వాడే ఇంధనాన్ని రూపొందించింది. ఈ జెట్ ఫ్యూయల్‌తో వాయుకాలుష్యం 68 శాతం వరకూ తగ్గుతుందని ఈ సైంటిస్టుల బృందం నిర్థారించుకుంది. అమెరికాలోని జార్జియా వర్శిటీలో సహజవనరుల సంబంధిత విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్న పునీత్ విమాన ఇంధనాలలో ప్రత్యామ్నాయాల (ఎస్‌ఎఎఫ్) రూపకల్పనకు తమ బృందంతో కలిసి పరిశోధనలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో వంటనూనేతర గింజల పంట నిచ్చే ఆవాల వంటి బ్రాస్సికా కరినాటా మొక్కలోని పర్యావరణ హిత లక్షణాలను , ఇంధన స్వభావాన్ని గుర్తించి జరిపిన విశేష పరిశోధనల క్రమంలో సరికొత్తగా జెట్ ఫ్యూయల్ రూపకల్పన జరిగింది. వీరి పరిశోధన వివరాలను జిసిబి బయోఎనర్జీ జర్నల్‌లో ప్రచురించారు.
విమానాలలో ఇంధనంగా దీనిని వాడుకోవచ్చు. ఇప్పటి ఇంధనాలతో పోలిస్తే తక్కువ ధరకు లభ్యం కావడం. కాలుష్య కారక వాయువులకు బ్రేక్ పడటం వంటి పరిణామాలు అత్యంత కీలకమైనవని అధ్యయనంలో నిర్థారించారు. ఈ ప్రత్యామ్నాయ ఇంధనానికి అవసరం అయిన ముడిసరుకుగా పనికివచ్చే నూనె మొక్కల లభ్యత , తగు విధంగా సరఫరాకు ప్రోత్సాహకాలు లభిస్తే ఈ రకం ఇంధనాన్ని రూపొందివచ్చు అని పునీత్ తెలిపారు. కార్బన్ ఉద్గారాల మొత్తం పరిణామాలలో వైమానిక రంగం నుంచి అంటే విమానాలు, హెలికాప్టర్ల నిర్వహణక్రమంలో వాడే ఇంధనం ద్వారా వెలువడే కాలుష్యం అమెరికాలో అయితే రెండున్నర శాతం వరకూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది గ్లోబల్ వార్మింగ్ పరిణామానికి మూడున్నర శాతం వరకూ కారకం అవుతుందని ఈ సైంటిస్టుల టీం తెలిపింది. ఈ బృందం రూపొందించిన మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయ ఇంధనం ఉత్పత్తికి తక్కువలో తక్కువ లీటరుకు 0.12 శాతం డాలర్ నుంచి అత్యధిక స్థాయిలో 1.28 డాలర్ల వరకూ ఖర్చు అవుతుంది. ఈ ప్రాతిపదికన ఈ రకం ఇంధనం ధరలను తక్కువగానే ఖరారు చేసుకునేందుకు వీలుంటుందని తెలిపారు. స్పార్క్ పరిశోధకులుగా పేరొందిన ఈ బృందం ఈ సరికొత్త ఇంధన రూపకల్పనకు గత నాలుగేళ్లుగా శ్రమిస్తూ వచ్చింది.