బెంగళూరు : హిమాలయాలు కేవలం సమున్నత మంచుపర్వతాలు కావు. ఇక్కడ అగాధ జల సముద్రం ఉండేదట. దాదాపు 60 కోట్ల సంవత్సరాల క్రితం హిమాలయాల్లో సముద్రం ఉన్నట్లు భారత్, జపాన్‌లకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. బెంగళూరు ఇండియన్ ఇనిస్టూట్ ఆప్ సైన్సెస్ , జపాన్‌లోని నిగాటా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు తమ శాస్త్రీయ పరిశోధనల దశలో ఈ ఆవిష్కరణ సాధించారు.
హిమాలయాలలో వారు జరిపిన అన్వేషణల దశల్లో అత్యంత అరుదైన నీటి బిందువులు ఖనిజాలలో నిక్షిప్తం అయి ఉండగా గుర్తించారు. వీటిని పరిశీలించగా ఇవి దాదాపు 60 కోట్ల ఏండ్ల కిందట ఈ ప్రాంతంలో ఉన్న అత్యంత పురాతన సముద్రపు జలంగా గుర్తించారు. ఈ సముద్రం ఉన్నట్లు నిర్థారణ అయితే ఇక భారతఖండానికి ఓ దశలో పై భాగంలో కూడా సముద్రం ఉండి ఉండేదని భావించవచ్చు. అయితే ఈ సముద్రం ఎంత మేరకు విస్తరించుకుని ఉండేదనేది ఖరారు కాలేదు. నిక్షిప్త నీటి బిందువులలో సున్నం, పలు క్షారమూలకాలు ఉన్నట్లు కనుగొన్నారు.
ఇంతకాలం కేవలం హిమశ్రేణువులు ఉన్న ప్రాంతంలో ఇంతకు ముందు సముద్రం ఉండి ఉంటుందనే విషయం లేదా ఈ సముద్రంలో ఇంతకు ముందే ఈ పర్వతాలు ఉండేవా? లేదా సముద్రం అంతరించిన తరువాత ఈ పర్వతాలు వెలుగులోకి వచ్చాయా? మరి భారీ స్థాయి సముద్రం ఎందుకు అంతరించింది? అనే పలు విషయాలు ఆద్యంతం ఆసక్తికరంగా మారడమే కాకుండా ఈ భూమి పుట్టుక చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కరణకు దారితీస్తుందని భావిస్తున్నారు.
భూగోళపు ఉత్తర ప్రాంతంలో ఇటువంటి పలు సముద్రాలు ఉండేవని తెలిపే కాలసూచిక వంటిది ఈ ఆవిష్కరణ అని ఐఐఎస్‌సి పరిశోధక విద్యార్థి ప్రకాశ్ చంద్ర ఆర్య తెలిపారు. ఈ బృందం హిమాలయాల్లోని పశ్చిమ కుమాన్ శ్రేణువుల్లో అమృత్‌పూర్ నుంచి మిలామ్ గ్లేసియర్‌ల వరకూ, డెహ్రాడూన్ నుంచి గంగోత్రి మంచుకనుమల వరకూ తమ పరిశోధనలు సాగించారు. ఈ క్రమంలో వీరికి విలువైన సమాచారం దక్కింది. దీనిని మరింత పూర్తి స్థాయిలో వడపోసేందుకు సిద్ధం అయ్యారు.