పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్న సింధు, సైనా, శ్రీకాంత్
న్యూఢిల్లీ: ఒకప్పుడూ ప్రపంచ బ్యాడ్మింటన్‌లో పెను ప్రకంపనలు సృష్టించిన భారత షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్, హెచ్.ఎస్.ప్రణయ్, పారుపల్లి కశ్యప్ తదితరులు కొంత కాలంగా పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నారు. గతంలో మహిళా బ్యాడ్మింటన్‌లో సింధు, సైనాలు ఏకచక్రాధిపత్యాన్ని చెలాయించిన విషయం తెలిసిందే. వరుస టైటిల్స్‌తో ఇటు చైనా అటు స్పెయిన్, కొరియా, జపాన్, ఇండోనేషియా తదితర దేశాల షట్లర్లకు చుక్కలు చూపించారు. టోర్నమెంట్ ఏదయినా సైనా, సింధు అసాధారణ రీతిలో చెలరేగి పోయేవారు. ఇదే క్రమంలో ర్యాంకింగ్స్‌లో కూడా అగ్రస్థానానికి చేరుకున్నారు. పురుషుల విభాగంలో కశ్యప్, శ్రీకాంత్, ప్రణయ్‌లు అద్భుత ప్రతిభను కనబరిచే వారు. అగ్రశ్రేణి షట్లర్లను సయితం వీరు చిత్తుచిత్తుగా ఓడించేవారు. కానీ రానురాను వీరి ఆట గాడి తప్పింది. శ్రీకాంత్, ప్రణయ్, అరవింద్, సౌరభ్ వర్మ, శ్రీనాథ్ అరవింద్ తదితరులు పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నారు.
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఇటు పురుషుల విభాగంలో అటు మహిళల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు తేలిపోతున్నారు. సింధు, సైనాలు టైటిల్స్ సాధించి ఏళ్లు గడిచిపోతున్నాయి. సింధు అయితే కనీసం క్వార్టర్ ఫైనల్ దశను కూడా దాటి ముందుకు వెళ్లడం లేదు. దీన్ని బట్టి ఆమె ఆట ఏ స్థాయిలో సాగుతుందో ఊహించుకోవచ్చు. ఇక ఈ సీజన్‌లోనైన మెరుగైన ఆటతో అలరిస్తుందని భావించినా ఫలితం లేకుండా పోయింది. ఆడిన మూడు టోర్నమెంట్‌లలో కూడా పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. ఇలాంటి పరిస్థితే సైనాది. ఆమె కూడా చెత్త ఆటతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతోంది.
డబుల్స్‌లో కూడా భారత షట్లర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, చిరాగ్, సాత్విక్ సాయిరెడ్డిలు పేలవమైన ఆటతో సతమతమవుతున్నారు. ఇక ఒకప్పుడూ ప్రపంచ బ్యాడ్మింటన్‌లోనే అసాధారణ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ కొన్నేళ్లుగా ఘోర వైఫల్యం చవిచూస్తున్నాడు. టైటిల్ సాధించడం మాట అటుంచితే కనీసం క్వార్టర్ ఫైనల్ దశను కూడా దాటి ముందుకు వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితినే ప్రణయ్ కూడా ఎదుర్కొంటున్నాడు. మరోవైపు డెన్మార్క్, మలేషియా, జపాన్, స్పెయిన్, ఇండోనేషియా, చైనీస్ తైపీ తదితర దేశాలకు చెందిన షట్లర్లు అసాధారణ ఆటతో టైటిళ్ల మీద టైటిల్స్‌ను ఎగురేసుకు పోతుంటే భారత ఆటగాళ్లు మాత్ర కనీసం సెమీస్‌కు కూడా చేరుకోక పోవడం బాధించే అంశమే.