Wednesday, January 22, 2025

దేశీయ సోషల్ మీడియా యాప్ ‘కూ’ మూసివేత

- Advertisement -
- Advertisement -

దేశీయ సోషల్ మీడియా యాప్ ‘కూ’ మూతపడింది. ఎక్స్(ట్విటర్)కు ప్రత్యామ్నాయంగా మారుతుందని అనిపించిన ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ తన కార్యకలాపాలను తాజాగా నిలిపివేసింది. సంస్థ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ఈ మేరకు లింక్డిన్‌లో బుధవారం పోస్ట్ చేశారు. డైలీ హంట్ సహా వివిధ కంపెనీలతో విక్రయానికి చర్చలు జరిపినా, అవేవీ సఫలీకృతం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. కూ యాప్ 2019లో ప్రారంభమైంది. అప్రమేయ రాధాకృష్ణ , మయాంకర్ బిడపట్కా కలిసి దీన్ని ప్రారంభించారు. రాధాకృష్ణ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. రైతు ఉద్యమ సమయంలో అకౌంట్ల బ్లాకింగ్ విషయంలో ట్విటర్‌తో కేంద్రానికి ఘర్షణ నెలకొన్నప్పుడు కూ యాప్ బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులే స్వయంగా ఆత్మనిర్భర్ యాప్‌గా దీన్ని ప్రమోట్ చేశారు. దీంతో అనతి కాలంలో యూజర్ బేస్ భారీగా పెరిగింది. తర్వాత నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాలకూ తన కార్యకలాపాలను విస్తరించింది.

తర్వాతి కాలంలో సంస్థకు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది. ఈ ఏడాది లేఆఫ్‌లూ ప్రకటించింది. పలు అంతర్జాతీయ కంపెనీలు , మీడియా హౌస్‌లతో కూ విక్రయం కోసం చర్చలు జరిపినప్పటికీ అవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదని వ్యవస్థాపకులు అప్రమేయ, మయాంక్ పేర్కొన్నారు. అందుకే కార్యకలాపాలు నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈమేరకు లింకిన్‌లో ఓ నోట్ పెట్టారు. స్థానిక భాషలకు పెద్ద పీట వేస్తూ దేశీయ యాప్‌ను రూపొందించామని, ఓ దశలో 21 లక్షల డైలీ యాక్టివ్ యూజర్లను కూడా ‘కూ’ సొంతం చేసుకుందని తెలిపారు. నిధుల కొరత తమకు అవరోధంగా మారిందని, దేశీయ యాప్‌ను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని రాసుకొచ్చారు. తన నాలుగేళ్ల ప్రయాణంలో కూ అనేక ఎత్తుపల్లాలు చూసిందన్నారు. లిటిల్ ఎల్లో బర్డ్ ఇక గుడ్‌బై చెప్తోందంటూ వ్యవస్థాపకులు తమ లింక్డిన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News