ప్రతిబింబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
ప్రస్తుత వలస నియమాలు భారతీయుల
అవసరాలకు అనుగుణంగా లేవు : కర్నాటక బార్
కౌన్సిల్ కార్యక్రమంలో సిజెఐ ఎన్.వి.రమణ
బెంగళూరు: దేశ న్యాయవ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతయినా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ పేర్కొన్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న వలస నియమాలు భారతీయుల అవసరాలకు అనుగుణంగా లేవని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు దివంగత న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం శాంతను గౌడర్‌కు నివాళి అర్పించేందుకు కర్నాటక బార్ కౌన్సిల్ శనివారం బెంగళూరులో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో జస్టిస్ ఎన్‌వి రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో వాస్తవ పరిస్థితలుకు అనుగుణంగా న్యాయవ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. సమాజంలోని ఆచరణాత్మక వాస్తవాలకు, స్థానిక అవసరాలకు అనుగుణంగా న్యాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ రోజుల్లో కోర్టు తీర్పులు రావడానికి చాలా ఆలస్యం అవుతోందని, దీనివల్ల కక్షిదారులకు ఎంతో ఇబ్బంది కలుగుతోందని జస్టిస్ ఎన్‌వి రమణ తెలిపారు. సామాన్య మానవుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు కోర్టులు, న్యాయమూర్తులను చూసి భయపడే పరిస్థితి ఉండకూడదన్నారు. కక్షిదారు నిజం చెప్పగలిగేలా కోర్టు వాతావరణాన్ని సౌకర్యవంతం చేయాలిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులదేనని సూచించారు. న్యాయాన్ని ప్రజలకు చేరువ చేయడం సహా దాన్ని మరింత సమర్థంగా అందించడం చాలా కీలకమని పేర్కొన్నారు. న్యాయస్థానాలు కక్షిదారు కేంద్రంగా పని చేయాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.