న్యూఢిల్లీ: ఇకపై దేశవ్యాప్తంగా భారత ప్రామాణిక కాలం (ఐఎస్‌టి)ని తప్పనిసరిగా అమలుచేయడానికి ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. అంటే దేశవ్యాప్తంగా మనకు ఒకే టైమ్ అమలు అవుతుంది.ఇప్పటివరకు మనం ఐఎస్‌టినే అనుసరిస్తున్నా మన కంప్యూటర్‌లో ఒక సమయం కనిపిస్తే మన సెల్‌ఫోన్‌లో వేరే టైమ్ కనిపిస్తుంది. కనీసం కొన్ని నిమిషాలు లేదా సెకన్లు అయినా తేడా ఉంటుంది. ఇప్పటివరకు దేశంలో భారత ప్రామాణిక కాలంను కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన ఏదీ లేదు. దీంతో కొన్ని చిక్కులు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి.దీనిని అధిగమించడానికి ఇకనుంచి ఐఎస్‌టిని కచ్చితంగా అమలు చేయాలని అనుకొంటున్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐఎస్‌టితో దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లు, కంప్యూటర్లు మనకు ఒకే సమయాన్ని చూపిస్తాయి.
టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, పవర్‌గ్రిడ్లు, బ్యాంకులు, స్టాక్ ఎక్స్‌చేంజిలు తదితరాలు ఐఎస్‌టిని అనుసరిస్తాయి. ఐఎస్‌టిని అమలు చేయడానికి నేషనల్ ఫిజికల్ లేబరేటరీ(ఎన్‌పిఎల్), ఇస్రో సహకారంతో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రాజెక్టును సిద్ధం చేసింది ఈ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా ఐదు చోట్లనుంచి ఐఎస్‌టినిఅందించడానికి అవసరమైన టెక్నాలజీని, మౌలిక సదుపాయాలను సృష్టించాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. డిఓసిఎకు చెందిన రీజనల్ రిఫరెన్స్ స్టాండర్డ్ లేబరేటరీలుగా పిలవబడే ఈ కేంద్రాలను అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, ఫరీదాబాద్, గౌహతిలో ఏర్పాటు చేస్తారు. ఐఎస్‌టిని అమలు చేస్తే స్పేస్ నావిగేషన్, రేడియో టెలిస్కోప్, అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లోకాలాన్ని కనీసం నానో సెకను కూడా తేడా లేకుండా చూపుతుంది.