టిటి ఫైనల్లో భారత ఆణిముత్యం బెన్
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం ఖాయమైంది. మహిళల సింగిల్స్ టిటి విభాగంలో భారత స్టార్ భవినాబెన్ పటేల్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో కనీసం రజత పతకాన్ని ఖరారు చేసింది. టిటి సింగిల్స్‌లో భవినా పటేల్ అసాధారణ ఆటతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలియోను జయించిన భవినా పటేల్ పారాలింపిక్స్‌లో చారిత్రక ప్రదర్శనతో పసిడి పోరుకు దూసుకెళ్లింది. శనివారం జరిగిన హోరాహోరీ సెమీఫైనల్లో భవినా పటేల్ 32 తేడాతో చైనా క్రీడాకారిణి జాంగ్ మియావోను ఓడించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో భవినా పటేల్ 711, 117, 114, 911, 118 తేడాతో జాంగ్‌ను మట్టి కరిపించింది. దాదాపు 34 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో భవినాబెన్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి గేమ్‌లో భవినాకు చుక్కెదురైంది.
అయితే ఏ మాత్రం ఆధైర్య పడకుండా ఆడిన భవిన తర్వాతి రెండు గేమ్‌లను తన ఖాతాలో వేసుకుంది. అయితే కీలకమైన నాలుగో గేమ్‌లో మళ్లీ జాంగ్ పుంజుకుంది. అద్భుత ఆటతో భవినను ఓడించింది. ఇక ఫలితాన్ని తేల్చే కీలకమైన ఐదో గేమ్‌లో కూడా పోరు నువ్వానేనా అన్నట్టుగానే సాగింది. కానీ చివరి వరకు దూకుడును ప్రదర్శించిన భారత స్టార్ భవినా పటేల్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో భవినాకు కనీసం రజత పతకం ఖాయమైంది. పారాలింపిక్స్ టిటిలో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా భవినా పటేల్ చరిత్ర సృష్టించింది.
బెన్‌కు ప్రధాని ఆల్ ది బెస్ట్..
టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్ భవినా పటేల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఫైనల్‌కు చేరడం ద్వారా కనీసం రజత పతకం ఖాయం చేసిన భవినాకు ప్రధాని ఆల్ ది బెస్ట్ చెప్పారు. తుది పోరులో ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. అభినందనలు భవినా పటేల్. అద్భుతంగా ఆడావు. రేపటి మీ విజయం కోసం దేశం మొత్తం ప్రార్థిస్తోంది. మీ వంతు ప్రయత్నించండి. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడేందుకు ప్రయత్నించండి. మీ విజయం దేశ ప్రజలందరికీ స్ఫూర్తినిస్తోంది అని ప్రధాని ట్విటర్ వేదికగా భవినాను ఉత్సాహ పరిచారు.