పెరిగిన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ
గత వారం 460 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుకులను చూస్తున్నాయి. మార్కెట్లు లాభపడినట్టే కనిపించినా, మళ్లీ పతనమతున్నాయి. కొత్త సంవత్సరం(2023)లో మొదటి వారం మార్కెట్లు నష్టపోయాయి. వారం మొత్తంలో సెన్సెక్స్ 460 పాయింట్లు కోల్పోయింది. వారాంతం శుక్రవారం విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ పెరగడంతో సెన్సెక్స్ భారీగా 452 పాయింట్ల పతనమైంది. ఆఖరికి 59,900 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు పతనమై 17,859 వద్దకు చేరుకుంది. వరుసగా మూడో రోజు మార్కెట్ క్షీణించింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 26 నష్టపోయాయి.
అదే సమయంలో 4 స్టాక్స్ పెరిగాయి. జెఎస్‌డబ్లు స్టీల్, టిసిఎస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, కోటక్ బ్యాంక్ నిఫ్టీలో నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు బ్రిటానియా, రిలయన్స్, ఎంఅండ్‌ఎం, బిపిసిఎల్, ఒఎన్‌జిసి, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, ఐటిసి సహా 11 నిఫ్టీ షేర్లు లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఇలోని 11 రంగాల సూచీలలో 10 సెక్టార్లు నష్టపోయాయి. ఐటి రంగంలో గరిష్టంగా 2 శాతం క్షీణత కనిపించింది. బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, పిఎస్‌యు బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, మీడియా, మెటల్ రంగాలు కూడా క్షీణించాయి.
ఎఫ్‌ఎంసిజి సెక్టార్‌లో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపించింది. శుక్రవారం ఎఫ్‌ఐఐ(విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి దాదాపు రూ.2,620 కోట్ల విలువచేసే షేర్లను విక్రయించారు. ఈ ఏడాది భారత మార్కెట్ అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు, కరెన్సీ అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎఫ్‌ఐఐ విక్రయాలను ఎదుర్కొందని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక పేర్కొంది. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం, 2023 సంవత్సరం కూడా భారత మార్కెట్‌లో బూమ్‌ను కనిపించవచ్చు. బిఎఫ్‌ఎస్‌ఐ, క్యాపిటల్ గూడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిమెంట్, హౌసింగ్, డిఫెన్స్, రైల్వేలు వంటి రంగాలు 2023లో దృష్టి సారిస్తాయని బ్రోకరేజ్ సంస్థ భావిస్తోంది.
విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ) కూడా కొత్త సంవత్సరంలో భారత మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అయితే మాంద్యం భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు వంటి అంశాల వల్ల స్టాక్ మార్కెట్ అస్థిరంగా ఉండవచ్చు. 2023లో మార్కెట్ గమనాన్ని నిర్ణయించడంలో ఆర్‌బిఐతో పాటు యుఎస్ ఫెడ్ విధానాలు కీలక పాత్ర పోషించనున్నాయి.