మృతుడు కర్ణాటక హవేరీజిల్లా వాసి నవీన్
కీవ్ : ఉక్రెయిన్ లోని ఖార్కీవ్‌లో మంగళవారం ఉదయం రష్యా దాడులకు భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ట్విటర్‌లో వెల్లడించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢసానుభూతి ప్రకటించారు. మృతుడు కర్ణాటక లోని హవేరీ జిల్లాకు చెందిన నవీన్‌గా గుర్తించారు. విద్యార్థి కుటుంబానికి సమాచారం ఇచ్చినట్టు విదేశాంగ శాఖ తెలియజేసింది. విద్యార్థి నవీన్ ఉక్రెయిన్‌లో వైద్యవిద్య నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఖార్కివ్ లోని ప్రభుత్వ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా బాంబు దాడులకు పాల్పడగా, అవి గురితప్పి నవీన్ ఉంటున్న నివాస ప్రాంతంపై పడినట్టు తెలుస్తోంది.
తాజా సంఘటన నేపథ్యంలో భారత్ లోని ఉక్రెయిన్ , రష్యా రాయబారులతో కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి మాట్లాడారు. ఖార్కివ్ సహా ఇతర నగరాల్లోని భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టాలని రెండు దేశాలను కోరినట్టు ఎంఈఏ వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ , ఆ నగర పరిసరాల్లో తీవ్ర పరిస్థితుల దృష్టా ఆ నగరాన్ని వెంటనే వీడాలని ఈ ఉదయమే అక్కడి భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా రైళ్లు, ఇతర రవాణా మార్గాల్లో కీవ్‌ను వీడి సరిహద్దులకు రావాలని భారత విద్యార్థులు, పౌరులకు సూచించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఖార్కివ్‌లో భారత విద్యార్థి మృతి చెందినట్టు విదేశాంగ శాఖ వెల్లడించడం గమనార్హం.