ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కెనడాలో తుపాకుల తుటాలకు మరో భారతీయ విద్యార్థిని మృతి చెందింది. 21 ఏళ్ల హర్‌సిమ్రత్ రంధవా అనే విద్యార్థిని హోమిల్టన్‌లోని మోహాక్ కాలేజీలో చదువుతోంది. అయితే.. బస్టాప్‌లో బస్సు కోసం వేచి ఉండగా కారులో వచ్చిన దుండగుడు హర్‌సిమ్రత్ పై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మరణించింది. దీనిపై భారతీయ కాన్సులేట్ జనరల్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హామిల్టన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. బాధితురాలి కుటుంబంతో టచ్ లో ఉన్నామని.. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.
స్థానిక సమయం ప్రకారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో హామిల్టన్‌లోని అప్పర్ జేమ్స్, సౌత్ బెండ్ రోడ్ వీధుల సమీపంలో కాల్పులు జరిగినట్లు తమకు సమాచారం అందిందని హామిల్టన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి, ఛాతీపై తుపాకీ గాయంతో రాంధావా కనిపించారని.. ఆమెను ఆసుపత్రికి తరలించామని, కానీ ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పినట్లు వెల్లడించారు.