న్యూయార్క్ : అమెరికాలోని ఇండియానాలో ఉన్న ప్రఖ్యాత మాన్‌రోయ్ సరస్సులో పడి ఇద్దరు భారతీయ విద్యార్థులు విషాదరీతిలో మృతి చెందారు. గత వారం కొందరు స్నేహితులతో కలిసి సరస్సులో ఈతకు దూకిన సిద్ధాంత్ షా (19), ఆర్యన్ వైద్య (20) గల్లంతు కాగా వీరికోసం జరిపిన గాలింపు క్రమంలో ఇప్పుడు వీరి మృతదేహాలు లభించాయి. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు. ఇండియనాపోలిస్ డౌన్‌టౌన్‌కు ఆగ్నేయంగా దాదాపు 102 కిలోమీటర్ల దూరంలో ఉండే సరస్సుకు స్నేహితుల బృందం పాంటూన్ బోటులో ఈ నెల 15న బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వీరు స్విమ్మింగ్ కోసం సరస్సులోకి దిగారు.
ఆ తరువాత కన్పించకుండా పొయ్యారు. ఇండియానా యూనివర్శిటీ అనుబంధం అయిన కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో వీరు విద్యార్థులు అని వెల్లడైంది. స్విమ్మింగ్ దిగి నీటిలో మునిగిపోతున్న దశలొ వీరిని కాపాడేందుకు తోటివారు యత్నించినా లాభం లేకుండా పోయిందని ఇండియానా సహజవనరుల విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. వీరు గల్లంతు కావడంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. రెండు మూడు రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలులు, హిమాపాతం వంటి ప్రతికూలతలు ఉండటంతో గాలింపు చర్యలు సజావుగా సాగలేదు.
ముందు ఓ యువకుడు స్విమ్మింగ్‌కు దిగి మునిగిపోతూ ఉండగా తోటిస్నేహితుడు బోటులోని నుంచి దూకి రక్షించే యత్నానికి దిగి తానూ కొట్టుకుపోయినట్లు సహజవనరుల ప్రతినిధి ఎల్‌టి అంగేలా గోల్డ్‌మెన్ చెప్పారు. ఇద్దరు విద్యార్థులు గతంలో సికామోర్ హైస్కూల్‌లో చదివి ఉండటంతో వీరి మరణ వార్త స్థానికంగా విషాదఛాయలను నింపింది. స్కూల్ యాజమాన్యం సంతాప ప్రకటన వెలువరించింది.