నీరజ్ చోప్రాకు సారథ్య బాధ్యతలు, హంగేరి వేదికగా మెగా క్రీడలు
న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ పాల్గొనే భారత బృందానికి భారత స్టార్ అథ్లెన్, జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా సారథ్యం వహించనున్నాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో ఆగస్టు 19 నుంచి ప్రతిష్టాత్మకమైన ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలు జరుగనున్నాయి. ఈ మెగా పోటీల కోసం 28 మందితో కూడి భారత జట్టును ఎంపిక చేశారు. భారత జట్టుకు నీరజ్ చోప్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కాగా, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అథ్లెట్ల జాబితాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే అథ్లెట్లకు సంబంధించిన వసతి, విమాన ప్రయాణ ఖర్చులు, శిక్షణ, వీసాల కోసం నిధులు తామే భరిస్తామని క్రీడా శాఖ పేర్కొంది. ఇక ఛాంపియన్‌షిప్‌లో అందరి దృష్టి ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రాపైనే నిలిచింది. ఈసారి అతను స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. కిందటి ఏడాది అమెరికాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ పోటీల్లో నీరజ్ రజతం సాధించాడు. ఈసారి మాత్రం పసిడి పతకం దక్కించుకోవాలని తహతహలాడుతున్నాడు.