మన తెలంగాణ/హైదరాబాద్: ఆసియా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ట్రోఫీని సాధించాలని జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు ఆకాంక్షించారు. సౌదీ అరేబియా వేదికగా జరిగే ఆసియా హ్యాండ్‌బాల్ పోటీల్లో భారత్ తలపడుతుంది. సౌదీకి బయలుదేరే ముందు భారత ఆటగాళ్లతో జగన్మోహర్ రావు మాట్లాడారు. ఇటీవల కాలంలో దేశంలో హ్యాండ్‌బాల్ క్రీడకు ఆదరణ పెరుగుతుందన్నారు. ఈ క్రీడను మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. హ్యాండ్‌బాల్ క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆసియా పోటీల్లో ట్రోఫీని సాధించాలని అభిలాశించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎఫ్‌ఐ కార్యదర్శి తేజ్ రాజ్‌సింగ్, కోశాధికారి వినయ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనందీశ్వర్ పాండే తదితరులు పాల్గొని భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో ఆసియాకు చెందిన 16 జట్లు తలపడుతున్నాయి.