Thursday, January 23, 2025

నేడు లంకతో భారత్ పోరు

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ముంబైలో జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఇప్పటికే ఆరు విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఏడో గెలుపుపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాలని పట్టుదలతో ఉంది. మరోవైపు వరుస ఓటములతో సతమతమవతున్న శ్రీలంకకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. భారత్ వంటి బలమైన జట్లను ఓడించాలంటే లంక అసాధారణ ఆటను కనబరచక తప్పదు. అఫ్గాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఓటమి పాలుకావడం లంక ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఇలాంటి స్థితిలో ఆతిథ్య భారత్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవాలంటే లంక సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. కానీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అంతంత మాత్రంగానే రాణిస్తున్న లంకకు ఈ మ్యాచ్‌లో గెలుపు తేలికేం కాదనే చెప్పాలి. ఇప్పటి వరకు లంక ఆరు మ్యాచుల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది.

ఇంగ్లండ్, నెదర్లాండ్స్‌లపై గెలిచిన లంక ఇతర మ్యాచుల్లో పరాజయం చవిచూసింది.ఇక భారత్ ఆడిన ఆరు మ్యాచుల్లోనూ గెలిచి పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కిందటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. రోహిత్, కోహ్లి, గిల్, సూర్యకుమార్, రాహుల్, జడేజా తదితరులతో భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక షమి, బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజాలతో బౌలింగ్ విభాగం కూడా బాగానే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ అధికారికంగా సెమీస్‌కు దూసుకెళుతోంది. ఇక ఈసారి ఓడితే లంక సెమీస్ ఆశలు గల్లంతు కావడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News