Sunday, December 22, 2024

బైడెన్‌ను చంపడానికే దాడి

- Advertisement -
- Advertisement -

తెలుగు సంతతి యువకుడు సాయి వర్షిత్ అరెస్టు
బైడెన్‌ను చంపాలనుకున్నా.. ఆర్నెల్లుగా ప్లాన్ చేశా
పోలీసుల విచారణలో విస్తుబోయే విషయాలు వెల్లడించిన సాయి వర్షిత్
హిట్లర్ గొప్ప నాయకుడంటూ ప్రశంసలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద ఓ యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో నిందితుడైన తెలుగు సంతతి వ్యక్తి 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా ఆశర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యక్షుడు జో బైడెన్ హత్య చేయాలనే లక్షంతో నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఇందుకోసం అతను ఆరు నెలలుగా ప్లాన్ చేసి మరీ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సాయి వర్షిత్ విచారణలో సైతం అంగీకరించినట్లు సీక్రెట్ సర్వీస్ ఏజంట్ వర్గాలు బుధవారం మీడియాకు తెలియజేశాయి.
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతలో ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు తెలియజేశారు. సాయి వర్షిత్ సోమవారం రాత్రి సెయింట్ లూయిస్‌నుంచి వాషింగ్టన్‌లోని డుల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ తర్వాత యుహౌల్ సంస్థనుంచి ట్రక్కు అద్దెకు తీసుకుని నేరుగా వైట్‌హౌస్ వెలుపల ఉన్న సైడ్‌వాక్ వద్దకు వెళ్లాడు. అక్కడ వైట్‌హౌస్ ఉత్తర భాగం వైపు భద్రత కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ట్రక్కుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్ చేసి మరోసారి ఢీకొట్టాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో సాయి వర్షిత్ చెప్పిన విషయాలు భద్రతాసిబ్బందిని సైతం నివ్వెరపరిచాయి. ఈ దాడి కోసం తాను ఆరునెలలుగా ప్లాన్ చేసినట్లు అతను చెప్పాడు.

దాడికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తన‘ గ్రీన్‌బుక్’లో రాసుకున్నట్లు కూడా చెప్పాడు.‘శ్వేతసౌధంలోకి వెళ్లి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే నా లక్షం’ అని నిందితుడు చెప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే అధికారాన్ని ఎలా దక్కించుకుంటావని సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు అడగ్గా.. ‘అవసరమైతే బైడెన్‌ను చంపేయాలని అనుకున్నా.లేదా అక్కడున్న వారిలో తనకు అడ్డువచ్చే వారిలో ఎవరినైనా గాయపర్చడమో లేదా చంపడమో చేయాలనుకున్నా’ అని సాయి వర్షిత్ విచారణలో అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. కాగా.. నిందితుడిపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని పోలీసులు తెలిపారు.
కాగా సాయి వర్షిత్ వద్ద నాజీ జెండాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని గురించి అడగ్గా తాను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ‘ హిట్లర్ బలమైన నేత.. నాజీలకు గొప్ప చరిత్ర ఉంది’ అని కూడా నిందితుడు చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.

దీంతో అతని మానసిక స్థితిపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఇందుకోసం అతని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను విచారించినట్లు కూడా తెలుస్తోంది. అయితే సాయి వర్షిత్ ఇలాంటి పని చేశాడంటే తాము నమ్మలేకపోతున్నామని, అతను చాలా నెమ్మదస్తుడని అతను ఉంటున్న ప్రాంతంలోని ఇరుగుపొరుగు వారు, అతని తోటి విద్యార్థులు చెప్పడం గమనార్హం. సాయి వర్షిత్‌పై రాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటుగా అధ్యక్షుడి హత్యకు కుట్రపన్నిన కేసులు నమోదు చేసినట్లు, మంగళవారం మధ్యాహ్నం డిసి సుపీరియర్ కోర్టులో హాజరుపరిచినట్లు యుఎస్ పార్క్ పోలీసులు తెలిపారు.

మిస్సోరిలోని చెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌ది భారతీయ సంతతికి చెందిన మధ్య తరగతి కుటుంబం. 2022లో మార్కెట్ సీనియర్ హైస్కూల్‌నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజిల మీద పట్లు ఉన్న అతను డేటా అనలిస్టుగా కెరీర్‌ను ఎంచుకోవాలని చూస్తున్నట్లు అతని లింక్డిన్ ప్రొఫైల్‌ద్వారా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News