Monday, December 23, 2024

మహిళా రెజ్లర్స్‌కు మద్దతు ఇద్దాం

- Advertisement -
- Advertisement -

ఒలింపిక్స్ క్రీడల్లో ఆడి, పతకాలు గెలిచి దేశానికే ప్రతిష్ఠ, గౌరవాన్ని తెస్తున్న మహిళా రెజ్లర్లపై భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు, రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ లైంగిక వేధింపులను పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. బ్రిజ్ భూషణ్‌ను ఫోస్కో కేసు కూడా నమోదైనందున వెంటనే అరెస్టు చేసి చట్టబద్ధంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళా రెజ్లర్లు గౌరవంగా జీవించే హక్కు కోసం పోరాడుతున్న వారికి పౌర హక్కుల సంఘం తన మద్దతును ప్రకటిస్తూ, వారికి న్యాయం దొరికేంత వరకు ఆ పోరాటంలో భాగమవుతామని ఈ పత్రికా ప్రకటన సందర్బంగా తెలియజేస్తున్నాం.
జనవరి 23న మేరీకోవ్‌ు నేతత్వంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది.

ఏప్రిల్ 5న కమిటీ తన నివేదికను క్రీడల మంత్రిత్వ శాఖకు సమర్పించింది కాని ప్రభుత్వం దాన్నింకా బహిరంగపరచలేదు. బ్రిజ్ భూషణ్‌పై చర్య కాదు కదా కేసు కూడా నమోదు కాకపోవడంతో ఏప్రిల్ లో రెజ్లర్లు తిరిగి నిరసనలు ప్రారంభించారు. ఈ బ్రిజ్ భూషణ్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ బిజెపి యంపి. అతనిపై నాలుగు క్రిమినల్ కేసులు సహా 30 కేసులు నమోదై ఉన్నాయి.మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహీంతో సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి.బ్రిజ్ భూషణ్‌పై ఏడుగురు రెజ్లర్లు వేర్వేరుగా ఫిర్యాదులు దాఖలు చేసినప్పటికీ ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఎస్‌ఐఆర్ నమోదు చేయకపోవడం తో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి ఏప్రిల్ 28న ఢిల్లీ పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేసే వరకూ తమ పోరాటం ఆగదని రెజ్లర్లు దీక్షబూనారు.

లైంగిక వేధింపులు, అత్యాచారాల వంటి ఘటనలపై ఏ మహిళ కూడా అంత సులభంగా, బహిరంగంగా మాట్లాడటానికి, ఆందోళన చేయడానికి సిద్ధపడదు. కానీ ఎంతో పేరు, ప్రఖ్యాతలున్న 10 మంది మహిళా క్రీడాకారులు, తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని బహిరంగంగా చెబుతూ తమకు తోచిన రీతిలో 3 నెలలుగా వివిధ రూపాలలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఒక వైపు బిజెపి కేంద్ర ప్రభుత్వం మహిళలను దృష్టిలో పెట్టుకొని ‘బేటీ పడావో బేటీ బచావో’ అంటూ పెద్ద ఎత్తున నినాదాల్ని ప్రచారం చేస్తుంది. ప్రభుత్వాలు మహిళలు గౌరవంగా జీవించే హక్కు పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా మహిళలు అన్ని ఉద్యోగ రంగాల్లోనూ నిత్యం లైంగిక దాడులకు గురి అవుతున్నారు. చివరికి భారత క్రీడారంగం కూడా అందుకు మినహాయింపు లేకుండా పోయింది. అయితే ఇక్కడ లైంగిక వేధింపులు చేస్తున్నది భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడైన బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్.

ఆ పార్టీ దేశాన్ని భారత మాతతో పోల్చుతూనే నిజమైన భారత మహిళలపై అత్యాచారాలు, న్యాయ స్థానాలు కల్పించుకోవడం వల్లనే పోస్కో కేసు కూడా నమోదైంది. కానీ ఇంకా అరెస్టు జరగడం లేదు. కానీ 2023 మే 7న అఖిల భారత సంయుక్త రైతు సంఘం ఆధ్వర్యంలో 100కు పైగా బస్సుల్లో వేలాది మంది రైతులు జంతర్ మంతర్ చేరుకొని భారత దేశ ఆడ బిడ్డల రక్షణ కోసం మరొక పోరాటానికి సిద్ధమై బాధితులకు మద్దతునిచ్చారు. రైతు నాయకులు 31 మందితో కలసి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ నెల 21 లోపట బ్రిజ్‌భూషణ్ చరణ్ సింగ్‌ను అరెస్టు చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం అని అల్టిమేటం ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌ను అరెస్టు చేయకుండా మోడీ ప్రభుత్వం భారత దేశ క్రీడా బాలికలు గౌరవంగా జీవించే హక్కును అణచివేతకు గురి చేస్తుందనే విషయాన్ని రైతు సంఘం పౌర సమాజం ముందుకు తీసుకు వచ్చింది.

బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌ను అరెస్టు చేయకపోతే బలమైన ఫోస్కో చట్టం బలహీన పడ్డట్టుగా, క్రీడాకారుల మనోధైర్యం నిలబెట్టాల్సిన ప్రధాన మంత్రి మోడీ నిర్లక్ష్యం వహించినట్లుగా పౌర హక్కుల సంఘం భావిస్తున్నది. ఒక వైపు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలల్లో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచార, హత్యాకాండలకు అంతేలేకుండా పోతున్నది. 40 మందికి పైగా మహిళా మల్లయోధులు చేస్తున్న ఆందోళన వారు గౌరవంగా జీవించి హక్కు కోసమేనని పౌరహక్కుల సంఘం భావిస్తూ తన పూర్తి మద్దతును తెలియజేస్తున్నది. క్రిమినల్ కేసులు నమోదు చేసినా, అరెస్టు చేయకుండా ఉండడమంటే చట్టవిరుద్ధంగా వ్యవహరించడమేనని తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు జెండర్ పట్ల ప్రధానంగా మహిళల పట్ల వివక్షను కలిగి ఉండడం, ప్రజాస్వామ్య పరిపాలన అనిపించుకోదు. ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు న్యాయం చేసేంత వరకు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు మద్దతుగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఇదిలా ఉండగా 2023 మే 3 అర్ధరాత్రి నిరసనకారులపై పోలీసులు దాడికిదిగారు. మహిళా క్రీడాకారులను వేధించిన వాడు నిర్భయంగా తిరుగుతుంటే బాధితుల మీదే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అత్యంత దుర్మార్గం. దేశ గౌరవాన్ని సమున్నతంగా నిలిపిన క్రీడాకారులు ఇప్పుడు ఇందుకోసమేనా తాము మెడల్స్ గెలిచింది అని కన్నీళ్ళు పెట్టుకున్నారు. తాము గెల్చుకున్న పతకాలను తిరిగిచ్చేస్తామని అంటున్నారు. పారిస్ ఒలింపిక్స్‌కు శిక్షణకు వెళ్లవలసిన వీరు న్యాయం కోసం ఇలా వీధిన పడటం గురించి తమకు తాము దేశభక్తులం అని సర్టిఫికెట్లు ఇచ్చుకునేవారు చప్పుడు చేయకపోవడం, పైగా నిందితుడి తరపునే ఎదురు దాడులు చేయడం వాళ్లకేమాత్రం సిగ్గనిపించదు.

ఆందోళనకు నేతత్వం వహిస్తున్న ప్రధాన క్రీడాకారిణి ‘వినేశ్ ఫొగట్ టోక్యో ఒలింపిక్స్ తర్వాత స్వయంగా ఈ దేశ ప్రధాన మంత్రిని, తర్వాత క్రీడా శాఖ మంత్రిని కలిసి తమపై జరుగుతున్న దారుణాలను వివరించినప్పటికీ సమస్య పరిష్కారం అవ్వకపోగా, ఇంకా నిందితుడి తరపు వ్యక్తులు భయపెడుతూ, ఇబ్బందులకు గురిచేస్తూ మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నారంటే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ప్రభుత్వం నుండి ఎంతటి మద్దతు ఉందో అర్ధమవుతూనే ఉంది. మూడు నెలల ఆందోళన తర్వాత సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించినప్పటికీ నిందితుడిని ఆ పదవి నుండి తప్పించి నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైన ఓ కథనం ప్రకారం, ‘2010 2020 మధ్య కాలంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 45 లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదయ్యాయని, వీటిలో 29 ఫిర్యాదులు కోచ్‌లపైనే వచ్చాయంటేనే అర్ధం చేసుకోవచ్చు క్రీడా రంగంలో మహిళల పట్ల ఎంతటి దారుణాలు జరుగుతున్నాయి. నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ కోడ్ ఆఫ్ ఇండియా-2011 నిబంధల ప్రకారం.. మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించే బాధ్యత స్పోర్ట్స్ ఫెడరేషన్‌దే, ఫిర్యాదుల కోసం మొదట ఇంటర్నల్ కంప్లంట్ (ఐసి) కమిటీలను వీరు ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి మహిళలు నేతత్వం వహించాలి. వీటితో పాటు మహిళా హక్కుల కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులకు దీనిలో సభ్యత్వం కల్పించాలి.

మొత్తంగా ఈ కమిటీలో మహిళల వాటా 50 శాతం కంటే ఎక్కువే ఉండాలని నియమని బంధనలు చెబుతున్నా ఎక్కడా కూడా వీటిని పాటిస్తున్న దాఖలాలు లేవు. తమ రాజకీయాలకు మద్దతు తెలుపుతున్న పిటీ ఉషా వంటి ఒకరిద్దరు మాజీ క్రీడాకారుల్ని ఇందులో భాగస్వాములను చేసినా వాళ్లు ఎటువంటి వ్యక్తులకు బాసటగా నిలబడతారో తాజా రెజ్లర్ల ఆందోళన బహిర్గతం అయ్యింది. కాబట్టి నియమ నిబంధలను పాటించడమే కాకుండా మహిళా సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు బృందం చేత విచారణ జరిపిస్తే తప్ప న్యాయం జరిగే అవకాశం లేదు. మహిళా రెజ్లర్ల ఆందోళన తర్వాతనైనా పోస్కో కేసు నమోదు అయినందున ఇప్పటికైనా వెంటనే విచారణ జరిపి చట్టబద్ధంగా శిక్షించి భారత మహిళా క్రీడాకారుల స్ఫూర్తిని రక్షించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.

 ఎన్. నారాయణ రావు
(ప్రధాన కార్యదర్శి, పౌరహక్కుల సంఘం)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News