Monday, December 23, 2024

గంగా తీరంలో మహిళా రెజ్లర్లు!

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ పోలీసుల దమనకాండతో మహిళా రెజ్లర్ల ఆందోళన మరో మెట్టు ఎక్కింది. ఇంకో పెద్ద మలుపు తిరిగింది. ఆదివారం నాడు జంతర్ మంతర్ నుంచి వారిని తొలగించి వారి పట్ల ఢిల్లీ పోలీసులు దురుసుగా వ్యవహరించారు. అక్కడి నుంచి రెజ్లర్లు కొత్త పార్లమెంటు భవనం వైపు వెళ్లబోతుండగా, వారిని అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్ సృష్టించి ఆ తర్వాత ఢిల్లీలోని వివిధ ప్రాంతాలు తిప్పి వదిలిపెట్టారు. ఆ క్రమంలో వారిని బలవంతంగా పట్టుకొని ఈడ్చి నానా ఇబ్బందులకు గురి చేశారు. ఇది జరిగిన తర్వాత ఎంతో ఆవేదనకు గురైన మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియాలు తమ పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేయడానికి నిర్ణయించుకొన్నారు. ఆ ప్రకారం మంగళవారం నాడు వారు హరిద్వార్‌లోని గంగా నదీ తీరానికి చేరుకొని ఎంతో ఆవేదనాభరిత హృదయంతో తమ పతకాలను నిమజ్జనం చేయడానికి ఉద్యుక్తులవుతుండగా రైతు నేత, భారతీయ కిసాన్ యూనియన్ అధినేత నరేశ్ టికాయత్ రంగ ప్రవేశం చేసి ఆ ప్రయత్నాన్ని విరమింపజేశారు.

తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బిజెపి పార్లమెంటు సభ్యుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై తగిన చర్య తీసుకోడానికి మహిళా రెజ్లర్లు, టికాయత్ భారత ప్రభుత్వానికి ఐదు రోజులు వ్యవధి ఇచ్చారు. ఆలోగా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేసి తీరుతామని హెచ్చరించారు. దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన ఈ మహిళలు బ్రిజ్‌భూషణ్ కాముక వేధింపుల గురించి చాలా కాలంగా ఫిర్యాదు చేస్తున్నారు. అతడు తమకు యుపిలో రాజకీయంగా ఉపయోగపడతాడనే ఒక్క కారణం మీద ప్రధాని మోడీ రెజ్లర్ల డిమాండ్‌ను పట్టించుకోకుండా నిర్లక్షం చేస్తూ వచ్చారు. తాను మొన్న ఆదివారం నాడు కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన సమయంలోనే రెజ్లర్లను జంతర్ మంతర్ నుంచి బల ప్రయోగంతో పోలీసులు ఖాళీ చేయించారంటే వారి పట్ల మోడీ ప్రభుత్వానికి ఎంతటి తక్కువ అభిప్రాయమున్నదో ఊహించవచ్చు. సాక్షి మాలిక్ 2016 రియో డి జనేరియో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించుకొన్నారు. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో వినేశ్ ఫోగట్ కాంస్య పతకాన్ని పొందారు. అలాగే బజరంగ్ పూనియా కూడా ఒలింపిక్ పతక విజేత. మహిళల్లో మామూలు క్రీడాకారులే అరుదు.

అటువంటిది కుస్తీ పోటీల్లో అంతర్జాతీయ పతకాలను సాధించిన వీరు దేశానికి ఎంతో ప్రతిష్ఠను తెచ్చి పెట్టారు. వీరిని ప్రభుత్వం గౌరవించవలసిందిపోగా, వారి ఫిర్యాదును పట్టించుకోకుండా, పోలీసు బలగాలను వారిపై ప్రయోగించడం కంటే దారుణం ఏమైనా వుంటుందా? గంగా నదిలో పతకాలను నిమజ్జనం చేసిన తర్వాత ఢిల్లీ ఇండియా గేటు వద్ద నిరాహార దీక్ష చేస్తామని రెజ్లర్లు ప్రకటించగా, అక్కడ కూడా దీక్షకు అనుమతించబోమని పోలీసులు తెగేసి చెప్పారు. సాక్షి మాలిక్ ట్విట్టర్‌లో పెట్టిన ప్రకటన చదివేవారి హృదయాలు ద్రవించకమానవు. ‘ఈ పతకాలు మొత్తం భారతావనికే పవిత్రమైనవి, గంగా నదితో సమానమైన పవిత్ర దీక్షతో వీటిని మేము సాధించుకొన్నాము. దుర్మార్గులకు అండగా నిలబడుతున్న అపవిత్ర ప్రభుత్వానికి ముసుగుగా వీటిని ఇంకెంత మాత్రం కొనసాగనీయం. అందుచేత వీటిని పవిత్ర గంగా నదిలోనే నిమజ్జనం చేయదలచాం’ అని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్న ప్రతి అక్షరం కాదనడానికి వీలులేని సత్యమే. వాస్తవానికి ఈ మహిళా రెజ్లర్లు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని అభిమానించేవారే.

కాని బ్రిజ్‌భూషణ్ వల్ల బిజెపికి కలిగే రాజకీయ మేలుతో పోలిస్తే వీరి అభిమానం వారికి ఎందుకూ పనికిరానిది. 66 ఏళ్ళ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ అత్యంత వివాదాస్పదుడైన పార్లమెంటు సభ్యుడు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అరెస్టయ్యాడు. ఉగ్రవాద వ్యతిరేక టాడా చట్టం కింద కూడా నిర్బంధానికి గురయ్యాడు. ఈయనను బిజెపికి బాహుబలిగా పరిగణిస్తారు. యుపిలోని కైసర్ గంజ్ ప్రాంతంలో గల గోండా నియోజకవర్గం నుంచి ఐదుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. అందులో నాలుగు సార్లు బిజెపి తరపున పార్లమెంటులో అడుగుపెట్టాడు. గోండా, బలరాంపూర్, అయోధ్య మున్నగు ఐదు జిల్లాల్లో ఈయన మాటకు ఎదురులేదని చెబుతారు. ఈయనపై కొన్ని పదుల కేసులు నమోదై వున్నాయి. బ్రిజ్‌భూషణ్ రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్‌గా అనేక అనైతిక చర్యలకు పాల్పడ్డాడు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు అందులో ఒక భాగమే. దేశానికి పేరు ప్రతిష్ఠలు తెచ్చిన సీనియర్ మహిళా రెజ్లర్లు రోడ్డు మీదికి వచ్చి ఇంత కాలంగా ఆందోళన చేస్తున్నా కదలిక లేక ప్రధాని మోడీ ప్రభుత్వం తన బేటీ బచావో, బేటీ పడావో వంటి పథకాల పరువును దారుణంగా బలి తీసుకొంటున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News