మాలె: ఈ ఏడాది మార్చి 10వ తేదీ లోగా తమ దేశంలో ఉన్న భారత సైనిక దళ సిబ్బందికి చెందిన తొలి బ౧ందాన్ని భారత్‌కు పంపించి వేస్తామని, మిగిలిన రెండు భారత ఏవియేషన్ ప్లాట్‌ఫారాలకు చెందిన సైనిక బృందాలను ఈ ఏడాది మే 10వ తేదీలోగా పంపించి వేస్తామని మాల్లీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సోమవారం ప్రకటించారు. తమ దేశ సైనిక పాటవాన్ని పెంచుకోవాలన్నదే తమ లక్షమని ఆయన తెలిపారు. మాల్దీవుల పార్లమెంట్‌ను ఉద్దేశించి అధ్యక్షుడు ముయిజ్జు సోమవారం తొలి ప్రసంగం చేశారు. దేశం నుంచి విదేశీసైనిక దళాలను పంపించి వేస్తామని తాము చేసిన వాగ్దానాన్ని నమ్మే తమ దేశంలోని మెజారిటీ ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతిచ్చారని ఆయన తెలిపారు. మాల్దీవుల అధ్యక్షుడిగా నవంబర్ 17న బాధ్యతలు చేపట్టిన వెంటనే అధ్యక్షుడు ముయిజ్జు మార్చి 15 నాటికల్లా దేశం నుంచి 88 మంది సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వానికి లాంఛనంగా విజ్ఞప్తి చేసింది. భారత ప్రభుత్వానికి ఈ అభ్యర్థనను అందచేయడానికే తమ దేశ ప్రజలు తనకు బలమైన తీర్పును ఇచ్చారని ఆయన ఆ సందర్భంగా అన్నారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 45 ఏళ్ల ముయిజ్జు భారత్‌తో స్నేహాన్ని కాంక్షించే తన ప్రత్యర్థి ఇబ్రహిం ముహమ్మద్ సోలిహ్‌ని ఓడించారు. గత ప్రభుత్వం భారత్‌తో కుడుర్చుకున్న 100కి పైగా ఒప్పందాలను ముయిజ్జు ప్రభుత్వం ప్రస్తుతం సమీక్షిస్తోంది. ఈ ఏడాది ప్రారంభ సమావేశంలో పార్లమెంట్‌లో ముయిజ్జు చేసే ప్రసంగాన్ని బహిష్కరిస్తామని ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండిపి) ఆదివారం ప్రకటించింది. కాగా..పార్లమెంట్‌లో అధ్యక్షుడు ముయిజ్జు ప్రసంగిస్తూ తమ దేశం కోల్పోయిన సరిహద్దు భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. దేశ సార్వభౌమత్వాన్ని కించపరిచే గత ప్రభుత్వం చేసుకున్నఎటువంటి ఒప్పందాలనైనా రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. తమ దేశ భూతల, వైమానిక, నౌకా దళాలతో కూడిన సమగ్ర రక్షణ వ్యవస్థ బలోపేతానికి, సైనిక పాటవ పెంపుదలకు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను అధ్యక్షుడు నొక్కిచెప్పారు. మాల్వీవియన్ సముద్రాన్ని, తీర ప్రాంతాలను కొలవడానికి, మ్యాపింగ్ చేయడానికి విదేశీ ప్రభుత్వాలతో కుడుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించబోమన్న విషయాన్ని ఆయా దేశాలకు ఇప్పటికే తెలియచేసినట్లు ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉండగా..మాల్దీవులలో భారతీయ ఏవియేషన్ ప్లాట్‌ఫారాలకు చెందిన కార్యకలాపాల కొనసాగింపునకు సంబంధించి పరస్పర అంగీకార యోగ్యమైన ఒప్పందం కుదిరినట్లు భారత ప్రభుత్వం ఫిబ్రవరి 2న ప్రకటించిన నేపథ్యంలో అధ్యక్షుడు ముయిజ్జు నేడు పార్లమెంట్‌లో భారత దళాల నిస్సైనికీకరణపై ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా భారతీయ ఏవియేషన్ ప్లాట్‌ఫారాలు మాల్దీవుల ప్రజలకు మానవతాపరమైన, వైద్యం కోసం తరలింపు సేవలను అందచేస్తున్నాయి.