యూఏఈలో భారత మహిళ షెహజాది ఖాన్‌కు మరణశిక్ష అమలైంది. ఉత్తరప్రదేశ్ లోని బాందా జిల్లాకు చెందిన షెహజాది ఖాన్ తన సంరక్షణలో ఉన్న చిన్నారి మృతి కేసులో హత్య అభియోగాలు నమోదు కావడంతో యూఏఈ ప్రభుత్వం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెను రక్షించాలంటూ కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఫిబ్రవరి 15నే ఈ శిక్ష అమలైంది. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు విదేశాంగ శాఖ తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ లోని బాందా జిల్లా గోయ్రా ముగ్లి గ్రామానికి చెందిన షెహజాది 2020లో కిచెన్‌లో పనిచేస్తుండగా, అగ్నిప్రమాదానికి గురైంది. అనంతరం ఆస్పత్రిలో చికిత్సతో కోలుకుంది. 2021లో ఉజైర్ అనే వ్యక్తి ఆమెను యూఏఈ లోని అబుదాబీకి తీసుకెళ్తానని , అక్కడ జీవితం బాగుంటుందని ఆశ పెట్టాడు. ఆ మాటలు నమ్మి అతడితో వెళ్లింది. ఉజైర్ ఆమెను ఆగ్రా లోని తమ బంధువులైన ఫైజ్, నాడియా దంపతులకు విక్రయించాడు.
వారు ఆమెను అబుదాబీకి తీసుకెళ్లారు. చివరికి ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో న్యాయస్థానం ఆదేశాలతో ఫైజ్‌నాడియా దంపతులపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. మరోవైపు అదే సమయంలో ఫైజ్ నాడియా దంపతుల బిడ్డ బాగోగులు షెహజాదినే చూస్తోంది. అనుకోకుండా ఆ బిడ్డ చనిపోవడంతో , ఆ దంపతులు ఆమెపై హత్య ఆరోపణలు మోపారు. అక్కడి దర్యాప్తు బృందాలు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చాయి. షెహజాది మాత్రం ఔషధాల విషయంలో ఆ దంపతులు నిర్లక్షంగా వ్యవహరించడంతోనే చిన్నారి ప్రాణాలు పోయినట్టు చెబుతోంది. కానీ న్యాయస్థానం మాత్రం ఆమెకు మరణశిక్ష విధించింది. ఇక యూపీ లోని ఆమె తండ్రి షబ్బీర్‌ఖాన్ తన కుమార్తెను కాపాడాలని ప్రభుత్వానికి, అధికారులకు విజృప్తి చేసినా ఫలించలేదు. తాజాగా ఫిబ్రవరి 16న అక్కడి జైలు అధికారులు షెహజాది చివరి కోరిక ఏమిటని అడగ్గా, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడతానని అభ్యర్థించింది. దీంతో యూపీ లోని ఆమె కుటుంబ సభ్యులతో వారు మాట్లాడించారు. ఈ సందర్భంగా తాను నిర్దోషినని, ఆమె తన కుటుంబీకుల ముందు కన్నీటి పర్యంతమైంది. తాజాగా ఆమెకు మరణశిక్ష అమలైంది.