Monday, December 23, 2024

అదరగొట్టిన హర్మన్ సేన

- Advertisement -
- Advertisement -

సౌతాఫ్రికా మహిళలతో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం నాలుగో రోజు 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఏకైక టెస్టు మ్యాచ్ సిరీస్ భారత్ దక్కించుకుంది. ఓపెనర్లు సుభా సతీష్ (13), షెఫాలీ వర్మ (24) పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు పది వికెట్ల తేడాతో విజయం సాధించి పెట్టారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ళభారత్ 30తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏకైక టెస్టులోనూ టీమిండియా జయభేరి మోగించింది. ఇక ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుంది.

ఫాలోఆన్ ఆడుతూ సోమవారం 232/2తో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత మహిళల విజయం సాధించారు. నాలుగో రోజు తిరిగి బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్ మరిజానె కాప్ 31 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. దీప్తి శర్మకు ఈ వికెట్ దక్కింది. ఆ వెంటనే డెల్మి టక్కర్ (0) కూడా ఔటైంది. స్నేహ్ రాణా అద్భుత బంతితో టక్కర్‌ను వెనక్కి పంపింది. మరోవైపు కెప్టెన్ లౌరా వల్‌వర్డ్‌ను రాజేశ్వరి గైక్వాడ్ వెనక్కి పంపింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన లౌరా 314 బంతుల్లో 16 ఫోర్లతో 122 పరుగులు సాధించింది. మరోవైపు నడైన్ డి క్లర్క్ అద్భుత పోరాట పటిమతో అలరించింది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న క్లర్క్ మారథాన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆతిథ్య జట్టు బౌలర్ల సహనాన్ని పరీక్షించిన క్లర్క్ 185 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 61 పరుగులు చేసి రాజేశ్వరి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది.

వికెట్ కీపర్ సినాలో జఫ్టా (15) తప్ప మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 154.4 ఓవర్లలో 373 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాజేశ్వరి రెండేసి వికెట్లను పడగొట్టారు. ఇక 37 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 9.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 603 పరుగులు సాధించి డిక్లేర్డ్ చేసింది. ఈ క్రమంలో మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కాగా, సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా ఏకంగా 8 వికెట్లను పడగొట్టింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News