హోవ్: ఇంగ్లండ్ మహిళలతో దివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 149 పరుగుల లక్షాన్ని ఛేదించడంలో ఇంగ్లండ్ ఒక దశలో విజయం వైపు దూసుకువెళ్తున్నట్లు కనిపించింది. టామీ బ్యూమోంట్, హీథర్ నైట్‌లు మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ విజయం నల్లేరు మీద నడకగా కనిపించింది. అయితే ఈ ఇద్దరూ వరస బంతులకు ఔటవడంతో ఇంగ్లండ్ కష్టాలు మొదలైనాయి. బ్యూమోంట్ 59 పరుగులు చేయగా, నైట్ 30 పరుగులు చేసింది.
అయితే వీరిద్దరూ ఔటయిన తర్వాత వరసగా వికెట్లు పడడంతో లక్ష ఛేదన కఠినంగా మారింది. ఆ జట్టు కేవలం 5.4 ఓవర్లలో 31 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకు ముందు తొలుత బ్యాట్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలు చక్కటి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. షఫాలీ 38 బంతుల్లో 48 పరుగులు చేసింది. మంధాన 20 పరుగులు చేసింది. ఆ తర్వాత కౌర్ 31 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1 స్కోరుతో సమంగా నిలిచింది.
INDIAN Women win 2nd T20 against ENG Women