భారతీయ మహిళా రచయిత్రులు ఆంగ్ల సాహిత్యంలో విశేష ప్రాధాన్యతను సాధించారు. కవిత్వం నుండి నవలల వరకు, వీరి రచనలు లింగ సమత్వం, సంస్కృతి, వ్యక్తిత్వ సంక్లిష్టతలను ప్రతిబింబిస్తూ అనేక రచనలను తీసుకు వచ్చారు. వారిలో కొందరు పేరొందిన అవార్డులు గెలుచుకొని, తమ రచనల ద్వారా సమాజంపై విశేష ప్రభావం చూపించారు. భారతీయ మహిళల ఆంగ్ల రచనల ప్రస్థానం 19వ శతాబ్దంలో ప్రారంభమైంది.తొరుదత్ మొదటి భారతీయ ఆంగ్ల కవయిత్రిగా గుర్తింపు పొందారు. భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి అందించడంలో ఆమె రచనలు కీలకమైనవి. ‘ఇండియా నైటింగేల్‘గా ప్రసిద్ధి చెందిన సరోజిని నాయు డు, జాతీయవాదాన్ని తన గీతాలలో మేళవించి, సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
ఇక నవలారచనలో కృపాబాయి సత్తియన్ అధాన్ తొలితరం రచయిత్రులలో ఒకరు. కుల వివక్ష, లింగ అసమత్వం వంటి సమస్యలను తన రచనల్లో ప్రతిబింబించారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మహిళా రచయిత్రుల సంఖ్య పెరిగింది. కమలా దాస్ తన సమ్మర్ ఇన్ కలకత్తా (Summer in Calcutta) వంటి రచనల ద్వారా మహిళల మనోవేదన, లైంగికత వంటి అంశాలను బహిరంగంగా చర్చిస్తూ సంచలనం సృష్టించారు. అనితా దేశాయ్ తన క్రై, ద పీకాక్ (Cry, the Peacock), క్లియర్ లైట్ ఆఫ్ డే (Clear Light of ౄay) వంటి నవలల ద్వారా ఒంటరితనం, ఆత్మపరిశీలన వంటి భావాలను అద్భుతంగా ఆవిష్కరించారు. నయనతార సహగల్ తన రాజకీయ నేపథ్య కథనాల ద్వారా లింగ అసమత్వాన్ని ప్రశ్నించారు.1980-90 దశకాల్లో భారతీయ మహిళా రచయిత్రులు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. అరుంధతి రాయ్ రాసిన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ (The God of Small Things) 1997లో బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. నిషేధిత ప్రేమ, కుల వివక్ష వంటి అంశాలను స్పృ శించిన ఈ నవల అంతర్జాతీయంగా గుర్తింపు పొందిం ది. కిరణ్ దేశాయ్ తనది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ (The Inheritance of Loss) ద్వారా 2006లో బుకర్ ప్రైజ్ సాధించారు.
ఈ నవల గ్లోబలైజేషన్, వలస సమస్యలను ప్రతిబింబించింది. అమెరికాలో స్థిరపడినప్పటికీ, ఝుంపా లహిరి భారతీయ జీవనశైలిని తన రచనల్లో ప్రతిబింబిస్తూ ఇంటర్‌ప్రిటర్ ఆఫ్ మాలడీస్ (Interpreter of Maladies) ద్వారా పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఇటీవల కాలంలో సాహిత్యంలో కొత్త స్రవంతిని ప్రవేశపెట్టిన రచయిత్రులు కూడా కనిపిస్తున్నారు.
చిత్రా బెనర్జీ దివాకరుని తన ది ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్స్ (The Palace of Illusions) ద్వారా పురాణ కథలను స్త్రీ కోణంలో మళ్లీ చెప్పడం ద్వారా విశేషంగా ఆకట్టుకున్నారు. మీనా కందసామి తన రచనల ద్వారా కుల వివక్ష, పితృస్వామ్య వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తూ సామాజిక చైతన్యాన్ని పెంచుతున్నారు. అవ్ని దోషి, మాధురి విజయ్ వంటి కొత్త రచయిత్రులు గుర్తింపు పొందుతూ స్మృతులు, స్థానచలనం, గుర్తింపును ప్రతిబింబించే రచనలు చేస్తున్నారు. ఇవి కాకుండా, ఈ రచయిత్రులు సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ్ అవార్డు, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు సాధించారు. బుకర్ ప్రైజ్, పులిట్జర్ ప్రైజ్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకోవడం ద్వారా భారతీయ మహిళా రచనలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అవార్డుల కంటే ఎక్కువగా, వీరి రచనలు సమాజం పై గణనీయమైన ప్రభావాన్ని చూపించాయి.
పురుషాధిపత్య వ్యవస్థ, కుల వివక్ష, జాతీయవాదం, వలస సమస్యలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ సామాజిక మార్పును ప్రేరేపించాయి. నూతన ఆలోచనలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, భారతీయ సాహిత్యానికి కొత్త దారులు సృష్టించాయి. భారతీయ మహిళా రచయిత్రులు కేవలం కథలు చెప్పడం మాత్రమే చేయలేదు-వారు భావజాలాన్ని మార్చారు, మూస పద్ధతులను ప్రశ్నించారు, సాహిత్యాన్ని కొత్త కోణంలో రాశారు. ఈ గొంతుకలు తరతరాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్