Saturday, November 23, 2024

ప్రజాస్వామ్యంపట్ల యువత విముఖత!

- Advertisement -
- Advertisement -

పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేస్తూ ఎమర్జెన్సీ వంటి కఠినమైన నిర్బంధ పరిస్థితులను కల్పించినప్పటికీ ప్రజలలో నిగూఢంగా నెలకొన్న అటువంటి ప్రబలమైన విశ్వాసమే నిరంకుశ చర్యలను శాంతియుతంగా ఎదిరించి, భారత్ వంటి దేశాలు తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకో గలుగుతున్నాయి. అయితే, ప్రజాస్వామ్య దేశాలలోని యువత ప్రధానంగా ఈ వ్యవస్థపై విశ్వాసాన్ని క్రమంగా కోల్పోతున్నారనే వాస్తవం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ప్రజాస్వామికంగా ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలే ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరించివేస్తూ నిరంకుశ విధానాలు అవలంబిస్తూ ఉండడంతో వారు విసుగు చెందుతున్నట్లు భావించాల్సి వస్తున్నది

రెండు రోజుల క్రితమే ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని (సెప్టెంబర్ 15) జరుపుకున్నాము. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పటిష్టతకు అవసరమైన భావప్రకటన స్వేచ్ఛ, సాధారణ ప్రజల ప్రాతినిధ్యం, భిన్నాభిప్రాయాలను గౌరవించడం, సహనం వంటి అంశాల గురించి ప్రస్తావించుకున్నాము. ఎన్ని లోపాలు వున్నప్పటికీ, ప్రజలకు గౌరవనీయమైన జీవనాన్ని కల్పించడంలో, ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ నేడు అందుబాటులో వున్న అన్ని పాలనా వ్యవస్థలలో ప్రజాస్వామ్యాన్ని అత్యంత ఉత్తమమైన వ్యవస్థగా చెప్పుకుంటున్నాము. చివరకు ప్రజాస్వామ్యం పొడ కూడా గిట్టని కమ్యూనిస్టు, నిరంకుశ వ్యవస్థల అధిపతులు సహితం ప్రజాస్వామ్యంపై తమవైన భాష్యాలు చెబుతూ తాము కూడా ప్రజాభిమతం మేరకే పాలన సాగిస్తున్నట్లు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రజాస్వామ్యం ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అయితే అసమానతలు నుండి వాతావరణ సంక్షోభం వరకు, కనీస అవసరాలైన విద్య, ఉపాధి, వైద్యం వంటి సదుపాయాలు కల్పించడంలో నేడు ఈ వ్యవస్థ పలు సవాళ్ళను ఎదుర్కొంటున్నది. పైగా, పలు ప్రజాస్వామ్య దేశాలు తరచూ శాంతిభద్రతల సమస్యలను సహితం ఎదుర్కొంటున్నాయి. ఈ వ్యవస్థపట్ల ప్రజలకు ఉన్న ప్రగాఢమైన విశ్వాసమే ఈ వ్యవస్థ మనుగడకు దారితీస్తున్నది. పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేస్తూ ఎమర్జెన్సీ వంటి కఠినమైన నిర్బంధ పరిస్థితులను కల్పించినప్పటికీ ప్రజలలో నిగూఢంగా నెలకొన్న అటువంటి ప్రబలమైన విశ్వాసమే నిరంకుశ చర్యలను శాంతియుతంగా ఎదిరించి, భారత్ వంటి దేశాలు తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకో గలుగుతున్నాయి.
అయితే, ప్రజాస్వామ్య దేశాలలోని యువత ప్రధానంగా ఈ వ్యవస్థపై విశ్వాసాన్ని క్రమంగా కోల్పోతున్నారనే వాస్తవం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.

ప్రజాస్వామికంగాఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలే ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరించివేస్తూ నిరంకుశ విధానాలు అవలంబిస్తూ ఉండడంతో వారు విసుగు చెందుతున్నట్లు భావించాల్సి వస్తున్నది. గత వారం ప్రచురించిన 30 ప్రజాస్వామ్య దేశాలలో చేపట్టిన ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం 86 % మంది ప్రజాస్వామ్య వ్యవస్థలలో జీవించడానికి సుముఖత వ్యక్తం చేశారు. కేవలం 20% మంది మాత్రమే ‘పౌరులు ఏమి కోరుకుంటున్నారో’ అందించ గల సామర్థ్యాన్ని నిరంకుశ ప్రభుత్వాలు కలిగి ఉన్నాయని నమ్ముతున్నట్లు వెల్లడైంది. అయితే, 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల వారిలో (యువత) సగం మందికి పైగా 57% మంది ప్రజాస్వామ్యం కన్నా మరే విధమైన ప్రభుత్వంనైనా కోరుకుంటున్నట్లు తెలిపారు. కానీ, 56 ఏళ్లు పైబడిన వారిలో 71% మంది ప్రజాస్వామ్యం కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు. యువతలో 42% మంది సైనికుల ప్రభుత్వంకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ శాతం ఆ పై వయస్సు గల వారిలో 20% మాత్రమే ఉంది. బిలియనీర్ జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చిన సివిల్ సొసైటీ డోనర్ నెట్‌వర్క్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ (ఒఎస్‌ఎఫ్) నివేదిక ప్రకారం, మూడవ వంతు (35%) మంది యువకులు ఎన్నికలను నిర్వహించని లేదా పార్లమెంట్‌ను సంప్రదించని ‘బలమైన నాయకుడు’, ‘దేశాన్ని నడపడానికి మంచి మార్గం’ గా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యువతలో ఇటువంటి నిరాకార పరిస్థితి నెలకొనేందుకు ముఖ్యంగా ప్రజాస్వామ్యం తమకు బంగారు భవిష్యత్ ఏర్పర్చగలదనే నమ్మకం వారిలో సడలటమే కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవస్థల పని తీరు పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. రాజకీయ నాయకుల సామర్థ్యం పట్లనే కాకుండా, వారి లక్ష్యాల పట్ల కూడా అవిశ్వాసం నెలకొంటుంది.రాజకీయాలను ఓ వ్యాపార ప్రక్రియగా మార్చే ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సర్వే ఫలితాలు భయంకరంగా ఉన్నట్లు ఒఎస్‌ఎఫ్ అధ్యక్షుడు, ఐక్యరాజ్యసమితి మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ మార్క్ మల్లోచ్ బ్రౌన్ తెలిపారు.

‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇప్పటికీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించాలనుకుంటున్నారు. అయితే వారి జీవితాల్లో ఖచ్చితమైన మార్పులను అందించగల దాని సామర్థ్యంపై సందేహాలు పెరగడంతో క్రమంగా విశ్వాసం క్షీణిస్తోంది’ అని వెల్లడించారు. మరోవంక, అన్ని ప్రాంతాలలో 85% నుండి 95% మధ్య అత్యధికంగా ప్రజలు మానవ హక్కులకు బలమైన మద్దతు ఇస్తున్నట్లు ఈ పోలింగ్ వెల్లడించింది. ప్రభుత్వాలు కనిపించే తీరు, మతం, లైంగిక లేదా లింగ ధోరణి ఆధారంగా వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడం తప్పు అని స్పష్టం చేస్తున్నారు.

జాతీయ, అంతర్జాతీయ సంక్షోభాలు పలు రెట్లు పెరుగుతున్న సమయంలో పేదరికం, అసమానత (20%),వాతావరణ సంక్షోభం (20%), అవినీతి (18%) వంటి అంశాలపై ఎక్కువగా ఆందోళన చెందటం లేదు. సగానికిపైగా (53%) ప్రజలు తమ దేశం తప్పుడు మార్గంలో సాగుతున్నట్లు భావిస్తున్నారు. తమ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు పని చేయడం లేదని మూడవ వంతు మంది చెప్పారు. బంగ్లాదేశ్, అమెరికా వంటి భిన్నమైన దేశాలతో సహా దాదాపు సగం మంది (49%) గత సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా తమను తాము పోషించుకోవడానికి కష్టపడ్డామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సామర్థ్యం పట్ల ప్రజలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు ఈ నివేదిక వెల్లడిస్తున్నది.

‘ప్రజాస్వామ్యపు పునాది అంశాలలో విశ్వా సం దాని వాస్తవ ప్రపంచ ఆచరణ, ప్రభావం గురించి లోతైన సందేహాలతో సహ జీవనం చేస్తుంది’ అని మల్లోచ్ బ్రౌన్ చెప్పారు. సగటున 58% మంది తమ దేశాల్లో రాజకీయ అశాంతి తదుపరి సంవత్సరాలలో హింసకు దారితీస్తుందని ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. ఇటువంటి భయం దక్షిణాఫ్రికా, కెన్యా (79%), కొలంబియా (77%), నైజీరియా (75%)లలో అత్యధికంగా ఉంది. కాగా, అమెరికా, ఫ్రాన్స్‌లలో మూడింట రెండు వంతుల మందిలో అటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. అభద్రత కూడా ప్రధాన ఆందోళన కలిగిస్తున్నది. లాటిన్ అమెరికా అంతటా అటువంటి పరిస్థితి వ్యక్తం అవుతుంది. బ్రెజిల్‌లో 74%, అర్జెంటీనాలో 73%, కొలంబియాలో 65%, మెక్సికోలో 60% మంది తమ దేశాల్లో చట్టాలు తమను సురక్షితంగా ఉంచలేకపోతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. కాగా, సర్వేలో పాల్గొన్న వారిలో 70% మంది ప్రజలు వాతావరణ మార్పుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే సంవత్సరాల్లో తమ జీవితాలను, తమ జీవనోపాధి అంశాలపై ప్రభావం చూపగలదని భయపడుతున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ (90%), టర్కీ (85%), కెన్యా (83%), భారత్ (82%) మంది ఈ విధమైన ఆందోళనలో ఉన్నారు. చైనాలో (45%), రష్యా (48%), బ్రిటన్ (54%) లలో ఇటువంటి ఆందోలన కొంత మేరకు తక్కువగా ఉంది.
వాతావరణ సంక్షోభాన్ని ప్రపంచంలో నేడు ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాలుగా భారత దేశం, ఇటలీలలో 32% మంది భావిస్తుండగా, ఆ తర్వాత జర్మనీ (28%), ఈజిప్ట్ (27%), మెక్సికో (27%), ఫ్రాన్స్ (25%), బంగ్లాదేశ్ (25%) ప్రజలు ఈ విషయమై ఆందోళన చెందుతున్నారు.

జాతీయ స్థాయిలో మొత్తం మీద 23% మంది అవినీతి పట్ల ప్రధానంగా ఆందోళన చెందుతున్నారు. అటువంటి ప్రజల సంఖ్య జర్మనీలో 6%, ఫ్రాన్స్, బ్రిటన్‌లలో 7% మంది ఉండగా, ఘనాలో 45%, నైజీరియాలో 44%, కొలంబియాలో 37% మంది ఉన్నారు. వ్యక్తులను వ్యక్తిగతంగా నేరుగా ప్రభావితం చేసే సమస్యలలో పేదరికం, అసమానతలు అత్యధికంగా ఉన్నాయి ఇక, వలసలు చాలా దేశాల కీలక రాజకీయ ప్రచార అంశంగా అంటున్నప్పటికీ ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వలసలు ప్రధాన సమస్య అంటూ కేవలం 7% మాత్రమే పేర్కొన్నారు. అయితే వలసదారులకు సురక్షితమైన, న్యాయపరమైన మార్గాలు ఏర్పరచాలని 66% మంది భావిస్తున్నారు.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News