Friday, November 15, 2024

నైపుణ్య గనిగా భారతీయ యువత!

- Advertisement -
- Advertisement -

ఇటీవల ‘మెర్సర్స్ అండ్ మెటిల్’ సంస్థ విడుదల చేసిన భారతీయ గ్రాడ్యుయేట్స్ నైపుణ్య సూచిక (ఇండియాస్ గ్రాడ్యుయేట్స్ స్కిల్ ఇండెక్స్)- 2033 నివేదికతో పాటు వి బాక్స్ విడుదల చేసిన ఇండియా స్కిల్ రిపోర్ట్ -2023 నివేదిక సైతం పలు ఆశాజనక యువ నైపుణ్య సామర్థ్య అంశాలకు సంబంధించిన ఆసక్తికర అధ్యయన ఫలితాలను వెల్లడించాయి. భారతీయ పట్టభద్ర యువతలో 45% మందికి ఆధునిక ఉద్యోగ సాధన నైపుణ్యాలు ఉన్నాయని తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. మెర్సర్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో 2,500 క్యాంపస్‌లు, 4,40,000 గ్రాడ్యుయేట్ యువత అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. నాన్-టెక్నికల్ రంగాల్లో 53 శాతం, టెక్నికల్ రంగాల్లో 44 శాతం మంది యువతకు ఉద్యోగ సాధన నైపుణ్యాలు ఉన్నట్లు తేలింది.
భారతీయ పట్టభద్రుల్లో 48% యువత ఎఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), ఎంఎల్ (మెషిన్ లెర్నింగ్) రంగాల్లో ఉద్యోగాలు పొందగల నైపుణ్యాలను సొంతం చేసుకున్నట్లు నివేదిక స్పష్టం చేస్తున్నది. బ్యాకెండ్ డెవలప్‌మెంట్, డాటా సైన్స్, డాటా అనాలిసిస్, క్యూఎ ఆటోమేషన్ రంగాల్లో కూడా 39% యువత నైపుణ్య అర్హతలు కలిగి ఉన్నట్లు తేలింది. అప్లైడ్ మ్యాథమెటిక్స్ రంగ యువతలో అత్యధికంగా 72% యువత ఆధునిక నైపుణ్యాలను కలిగి ఉద్యోగాలు పొందగలుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది. డాటా సైన్స్, మైఎస్‌క్యూఎల్ యువతకు 57%, ఒరాకిల్ ఎస్‌క్యూఎల్ రంగాల యువతకు 54%, ఎంఎస్ ఆఫీస్‌లో 61 శాతం, అకౌంటింగ్‌లో 60%, న్యూమరికల్ ఎబిలిటీలో 57% యువత ఉద్యోగాలు పొందగలుగుతున్నారని వివరించబడింది. యూత్/యుఎక్స్ డెవలపర్స్‌కు 36%, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ రంగంలో 42 శాతం, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్‌కు 40%, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యువతకు కనిష్టంగా 23% మంది ఉద్యోగాలు పొందగలుగుతున్నారు.

నాన్-టెక్నికల్ రంగాల్లో ఫైనాన్సియల్ అనలిస్టులకు 45 శాతం, హూమన్ రిసోర్స్ అసోసియేట్స్‌కు 44 శాతం, బిజినెస్ అనలిస్టులకు 45 శాతం ఉద్యోగాలు పొందగలిగిన నైపుణ్యాలు ఉన్నాయని పేర్కొనబడింది. ఉద్యోగ క్షేత్రాలకు అవసరమైన సమస్యల పరిష్కార నైపుణ్యాలు, సృజనశీల నైపుణ్యాలు నేటి గ్రాడ్యుయేట్ యువతలో గణనీయంగా పెరగడం గమనించారు.
భారతీయ కళాశాలల్లో విద్య నాణ్యత, బోధన, నైపుణ్య వికాస విధానాలను బట్టి టైయర్ -1, టైయర్- 2, టైయర్ 3 అనబడే మూడు రకాల కళాశాలలుగా విభజించారు. ఉన్నత ప్రమాణాలు కలిగిన టైయర్ -1 కళాశాలల యువతలో 46 శాతం, టైయర్- 2 కళాశాలల యువతలో 44 శాతం, టైయర్- 3 కళాశాలల యువతలో 43 శాతం మంది ఉద్యోగాలు పొందగలుగుతున్నట్లు తేలింది. టెక్నికల్ స్కిల్స్‌తో పోల్చితే నాన్- టెక్నికల్ స్కిల్స్ పొందడంలో యువత ముందున్నారని కూడా తెలుస్తున్నది.
ఇండియాస్ గ్రాడ్యుయేట్స్ స్కిల్స్ ఇండెక్స్ 2023 ప్రకారం యుపి, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాల్లో యువతకు నైపుణ్యాలు అధికంగా ఉన్నాయని పేర్కొనబడింది. బిటెక్, ఎంబిఎ, బికామ్ కోర్సులకు ఉద్యోగ సాధన సులభంగా జరుగుతున్నట్లు తేలింది.

అంతేకాకుండా ముంబాయి, లక్నో, మంగళూరు నగరాల్లో యువతకు ఉద్యోగ సాధన నైపుణ్యాలు మెండుగా ఉండడం గమనించారు. ఇతర భారతీయ మహా నగరాలతో పోల్చితే బెంగళూరు, మంగళూరు, ఢిల్లీ, చెన్నై మహానగరాల్లో ఉద్యోగాలకు యువత ప్రాధాన్యం ఇస్తున్నారని విశ్లేషించబడింది. 2023 – 2030 మధ్య కాలంలో రిటైల్, పునరుత్పాదక శక్తి రంగాలు అధిక ప్రాధాన్యాలను పొందుతాయని తేలింది. జీరో కార్బన్ ఎమిషన్, అధిక శక్తి తలసరి వినియోగాలు పెరుగుట వలన దేశ సుస్థిరాభివృద్ధి, ఇన్‌క్లూజివ్ గ్రోత్‌లను దృష్టిలో పెట్టుకొని భారీ పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం/ నైపుణ్యాలు కలిగిన యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయి. 2030 నాటికి రిటైల్ మార్కెట్ రంగంలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 25 మిలియన్ల కొత్త ఉద్యోగులు కావలసిన వస్తుందని అంచనా. మాన్యుఫాక్చరింగ్ రంగంలో 27.3 మిలియన్లు, వ్యవసాయేతర రంగాల్లో 90 మిలియన్లు, హెల్త్ రంగం లో 12 మిలియన్ల నూతన ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి.

సిఐఐ, ఎఐసిటిఇ, ఎకనామిక్ టైమ్స్ లాంటి ప్రముఖ సంస్థల సహకారంతో చేసిన విబాక్స్ అధ్యయనంలో కూడా భారతీయ నైపుణ్య నివేదిక -2023 పేరున విడుదలైన నివేదిక ప్రకారం గత ఏడాది 46.2 శాతం యువత ఉద్యోగాలు పొందితే, ఈ ఏడాది 50.3 శాతం నైపుణ్య యువత ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నట్లు ఆశాజనక అంశాలను వెల్లడించింది. మహిళా యువ విద్యావేత్తల్లో 52.8 శాతం, పురుషుల్లో 47.2 శాతం ఉద్యోగ సాధన నైపుణ్యాలను స్వంతం చేసుకున్నట్లు తెలుస్తున్నది. 2047 నాటికి శత వసంతాల స్వతంత్ర భారత ఉత్సవాల వరకు యువ భారతం ప్రపంచానికే నైపుణ్య దారి దీపం కావాలని, ఆ దిశలో ఉన్నత విద్య సంస్థలు తమ బోధన/ శిక్షణాంశాలకు పదును పెట్టాలని కోరుకుందాం. ఇండియా స్కిల్ రిపోర్ట్- 2023 వెల్లడించిన నివేదికలో భారతీయ పట్టభద్రులో ఉద్యోగ సాధన నైపుణ్యాలలో సానుకూల అభివృద్ధి సాధించాయని, మహిళల ఉద్యోగ సాధనలో 52.8 శాతం, పురుషుల్లో 47.2 శాతం సఫలం అవుతున్నారని తేలింది. ఇదే క్రమంలో నైపుణ్య యువత నిర్మించబడినపుడు 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ గణనీయ వృద్ధి రేటును నమోదు చేసుకొంటుందని వివరించబడింది. మహిళా విద్యావంతుల్లో ఆ

ధునిక టెక్నాలజీకి సంబంధించిన నైపుణ్యాలు, పటిష్టమైన శిక్షణలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మార్కెట్ అనుసంధానం చేయడం, స్టార్ట్‌ప్‌లకు బాసటగా నిలవడం జరగాలి. కార్పొరేట్, పారిశ్రామిక రంగాలు ఆశిస్తున్న ఆధునిక నైపుణ్యాలకు విశ్వవిద్యాలయాలు బోధిస్తున్న నైపుణ్యాలకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయని, వీటి మధ్య గ్యాప్‌ను తగ్గిస్తేనే అధిక శాతం భారతీయ నైపుణ్య యువతకు అర్హతకు తగిన ఉద్యోగాలు దొరుకుతాయని విశ్లేషణలు వివరిస్తున్నాయి. ఈ విషయంలో మన ఉన్నత విద్యా సంస్థలు శ్రద్ధ వహించి అత్యాధునిక అవసర నైపుణ్యాలను బోధిస్తూ యువ భారతాన్ని ప్రపంచ వేదికపై నిలపాలని కోరుతున్నారు. టెక్నికల్/ నాన్-టెక్నికల్ నైపుణ్యాలను నేర్పకుండా ప్రదానం చేసే డిగ్రీ, పిజి, పిహెచ్‌డి పట్టాలు నిష్ప్రయోజనం అని మన అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. టైయర్ 2, టైయర్ -3 కళాశాలల యువతలో కూడా నైపుణ్యాలను పెంచుతూ అన్నింటినీ టైయర్ -1 కళాశాలలుగా మార్చడానికి పటిష్టమైన ప్రణాళికలు వేస్తూ అంకితభావంతో అమలులోకి తేవాలని నేటి భారత యువ సమాజం కోరుకుంటున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News