Monday, November 18, 2024

ఫ్రాన్స్‌ నుంచి ముంబయి చేరుకున్న భారతీయులున్న విమానం

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఫ్రాన్స్‌లో నిలిపివేసిన భారతీయులున్న విమానం ఎట్టకేలకు ముంబయికి చేరుకుంది. మానవ అక్రమ రవాణా జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో 303 మందికి పైగా ప్రయాణికులున్న విమానాన్ని విచారణ కోసం ఫ్రాన్స్‌లో నిలిపి వేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్ అధికారుల అదుపులో ఉన్న ఈ విమానం ఎట్టకేలకు సోమవారం అక్కడినుంచి బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున ముంబయిలో దిగింది. ఇద్దరు మైనర్లు సహా 25 మంది ఫ్రాన్స్ అశ్రయం కోరడంతో వారిని అక్కడే ఉంచేశారు. యుఎఇనుంచి నికరాగువాకు బయలుదేరిన రుమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంధనం కోసం వాట్రీ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే ఫ్రాన్స్ అధికారులు దానిlr తమ అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.అందులో 11 మంది మైనర్ల వెంట తెలిసిన పెద్దవాళ్లు ఎవరూ లేరనే విషయాన్ని అధికార్లు గుర్తించారు.

అన్ని న్యాయపరమైన విచారణలు పూర్తయిన తర్వాత విమానం ముంబయికి బయలుదేరేందుకు అనుమతి లభించింది. దీనిపై ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ విషయంలో అధికారులు త్వరితగతిన స్పందించారని వెల్లడించింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తదుపరి చర్యల చేపట్టనుంది. తొలుత ఈ విమానాన్ని దుబాయికి గానీ, నికరాగువాకు కానీ పంపాలని అనుకున్నారు. అయితే భారతీయులు ఎక్కువగా ఉండడంతో చివరికి ముంబయికి పంపాలని నిర్ణయించారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది గుజరాత్, పంజాబ్‌లకు చెందిన పేదప్రజలున్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించాలనే ప్రణాళికలో భాగంగా వారంతా నికరాగువా వెళ్తున్నట్లు తెలుస్తోంది.

మీడియాకు దూరంగా పరుగులు
ముంబయి విమానాశ్రయంలో దిగిన వెంటనే ప్రయాణికులపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. వారినుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశారు. ‘ ఫ్రాన్స్‌నుంచి ఎవరూ రావడం లేదు సర్’ అని చెప్పిన ఓ ప్రయాణికుడు ఆ తర్వాత అక్కడినుంచి అదృశ్యమయ్యాడు. మరోవ్యక్తి తాను ఫ్రాన్స్‌నుంచే వచ్చినట్లు అంగీకరించినా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరిచాడు. అమెరికాలో ఆశ్రయం పొందాలనుకునే వారికి నికరాగువా ఒక పాపులర్ కేంద్రంగా మారింది. 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 96,917 మంది భారతీయులు అమెరికాలోకి ప్రవేశించడం కోసం ప్రయత్నించారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 51.61 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News