అప్పటికి 35 లక్షల యాక్టివ్ కేసులు
జూన్ 1 నాటికి వైరస్ మైనస్
ఐఐటి సైంటిస్టుల గణాంక సూత్ర
న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత వచ్చే నెల (మే ) 15వరకూ కొనసాగుతుంది. మే 15 నాటికి దేశంలో సోకిన వారితో యాక్టివ్ కేసుల సంఖ్య 33 నుంచి 35 లక్షలకు చేరుకుంటుందని ఐఐటి సైంటిస్టులు విశ్లేషించారు. ఇప్పటి సెకండ్ వేవ్ మే చివరి నాటికి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. భారతదేశపు కొవిడ్ గ్రాఫ్‌ను ఐఐటి సైంటిస్టులు సమగ్రమైన గణిత సమీకరణలతో తేల్చిచెప్పారు. కరోనా తీవ్రత స్థాయిని బట్టి యాక్టివ్‌కేసుల నిర్థారణ జరుగుతుంది. శుక్రవారానికి దేశంలో ఒక్కరోజు వ్యవధిలో కరోనా సోకిన వారి సంఖ్య 3,32,730 అయ్యింది. ఒక్కరోజు మరణాల సంఖ్య 2263 అయింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపుగా 25 లక్షల స్థాయికి చేరింది. ఎప్రిల్ చివరి వారంలో ఈ పరిస్థితి ఉండగా మే నెల మధ్య నాటికి మరో పది లక్షల మందిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం 35 లక్షల యాక్టివ్ కేసులు రికార్డు అవుతాయి.
ఇది ప్రమాదకర పరిణామం అవుతుంది. అయితే ఆ తరువాత క్రమేపీ ఈ గ్రాఫ్‌లో తగ్గుదల కన్పిస్తుంది. మే నెలాఖరుకు వైరస్ చల్లబడే పరిస్థితి ఉండవచ్చునని కాన్పూర్, హైదరాబాద్ ఐఐటిలకు చెందిన సైంటిస్టులు కనుగొన్నారు. ఇందుకోసం అత్యంత అధునాతనమైన మ్యాథమెటిక్ మాడ్యుల్ వినియోగించుకున్నారు. కరోనా అనుమానితులు , పాజిటివ్‌లు, వైరస్ గుర్తింపు లేని వారు , ఈ వైరస్ జాబితా నుంచి తీసివేసిన వారిని ప్రాతిపదికగా చేసుకుని సూత్ర మోడల్ పద్ధతిలో తమ విశ్లేషణ చేశారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణలలో ఈ నెల 25 నుంచి 30 మధ్యలో అత్యధిక సంఖ్యలో కరోనా రోగుల సంఖ్య ఉండవచ్చునని తెలిపారు.
ఇప్పటికే కొత్త కేసుల విషయంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లు రికార్డు స్థాయిల్లో నిలుస్తున్నాయి. వచ్చే నెల కరోనా తీవ్రతకు సంబంధించి అత్యంత కీలకం అవుతుంది. 15వ తేదీ నాటికి యాక్టివ్ కేసులు పరాకాష్టకు చేరుకునే అవకాశం ఉంది. తరువాత ఈ పరిణామం తగ్గుముఖం పట్టవచ్చునని , అయితే ఈ తిరోగమన దశలో దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని శీఘ్రగతిలోనే వైరస్ పతనం చెందుతే మే చివరి నాటికి గణనీయ స్థాయిలో తగ్గుదల ఉండవచ్చునని ఐఐటి సైంటిస్టులు తెలిపారు.