న్యూయార్క్: భారత్‌లో తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనా స్ట్రెయిన్ డబుల్ మ్యుటెంట్ (బి1617) ఆందోళనకరమైన రకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) వర్గీకరించింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ కరోనా స్ట్రెయిన్ల మాదరిగానే భారత్ డబుల్ మ్యుటెంట్ కూడా ప్రపంచానికి ప్రమాదంగా ఉందని గుర్తించింది. గత ఏడాది అక్టోబర్‌లో మొదటిసారి ఈ వేరియంట్‌ను మన దేశంలో గుర్తించారు. వుహాన్‌లో పుట్టిన కరోనా రకం కన్నా ఇది అత్యంత వేగంగా ఇతరులకు సోకుతుందని కొవిడ్ విభాగ సాంకేతిక నిపుణురాలు డాక్టర్ మరియా వాన్‌కెర్‌ఖోవ్ వెల్లడించారు.
దీనిపై తమతోపాటు పనిచేస్తున్న ప్రయోగశాలల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, ఈ స్ట్రెయిన్ వ్యాప్తి తీవ్రంగా ఉందని, ప్రపంచానికి ఇది ఆందోళనకరమని గుర్తించామని చెప్పారు. ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం మాత్రమే లభ్యమైందని, ఈ స్ట్రెయిన్ జన్యుక్రమాన్ని, మరిన్ని లోతైన వివరాలను తెలుసుకోవాల్సి ఉందని తెలిపారు. వ్యాక్సిన్ల వల్ల కలిగే యాంటీబాడీల రక్షణను ఇది తప్పించుకునే సామర్థం ఉందా లేదా అనే దానిపై మరింత సమాచారం కావాల్సి ఉందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని రకాల కరోనా వైరస్‌లను చూడాల్సి వస్తుందని, వాటి వ్యాప్తిని వ్యాధి తీవ్రతను తగ్గించడం, మరణాలకు అడ్డుకట్ట వేయడం మనముందున్న కర్తవ్యంగా పేర్కొన్నారు.
India’s Covid Variant is World Concern: WHO