Wednesday, January 22, 2025

పతన వృద్ధి రేటు!

- Advertisement -
- Advertisement -

ప్రస్తుత సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి తగ్గిపోనున్నదని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి కానరెన్స్ (అన్‌క్టాడ్) ఇటీవల హెచ్చరించింది. గత ఏడాది నమోదైన 8.2 శాతం నుంచి అది 5.7 శాతానికి పడిపోతుందని వెల్లడించింది. 2023లో ఇది మరింతగా దిగజారి 4.7 శాతానికి చేరుకోనున్నదని అభిప్రాయపడింది. ఈ సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని సాధించనున్నదని, ఇది ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నింటినీ మించిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా చెప్పుకున్నారు. అయితే దేశంలోని అసాధారణ నిరుద్యోగం, ఆదాయ వ్యత్యాసాలు, దారుణమైన దారిద్య్రం ఈ వృద్ధి గణాంకాల గాలిని తీసివేస్తున్నాయని అంతర్జాతీయ సంస్థలు, నిపుణులు వేలెత్తి చూపిస్తున్నారు.

ఈ సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు గతంలో అనుకొన్న 6.9 శాతం నుంచి 6.6 శాతానికి పడిపోతుందని 38 ప్రజాస్వామ్య దేశాల ఉమ్మడి సంస్థ ఒఇసిడి (ఆర్థిక సహకారం అభివృద్ధి సంస్థ) వెల్లడించింది. దేశీయ గిరాకీ, ఎగుమతులు తగ్గనున్నందున 2023లో మన జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి 5.7 శాతానికి కుదించుకుపోనున్నదని కూడా ఈ సంస్థ జోస్యం చెప్పింది. దేశ దేశాల అభివృద్ధి గమనాన్ని అంచనా వేసే గోల్డ్‌మన్ శాచెస్ ప్రకారం 2022లోని 6.9 శాతం నుంచి భారత ఆర్థిక వృద్ధి రేటు 2023 నాటికి 5.9 శాతానికి పతనం కానున్నది. ఇలా అనేక సంస్థలు జిడిపి వృద్ధి అంచనాలను తగ్గించి చూపిస్తుండడం దేశ భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. దీని మూలంలో వున్నది మన ఆదాయ వ్యయాలలోని పూడ్చడానికి సాధ్యం కాని వ్యత్యాసమే. మన విదేశీ వాణిజ్య లోటే.

మనం భారీగా దిగుమతి చేసుకొనే క్రూడాయిల్ ఖర్చు దేశ ఆర్థికాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నది. అదే స్థాయిలో ఎగుమతులను పెంచుకోలేకపోడం ఆదాయాన్ని హరించి వేస్తున్నది. పర్యవసానంగా దేశంలో అభివృద్ధి కింద ఖర్చు చేసే సామర్థం ప్రభుత్వానికి లోపిస్తున్నది. దీనికి తోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యన్ ఆయిల్ ఎగుమతులు చేసే నౌకలకు అమెరికా, పాశ్చాత్య దేశాలు బీమా సౌకర్యాన్ని నిరాకరించడం, ఆయిల్ ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిని పరిమితం చేసుకోడం వంటి పరిణామాలు అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్‌ను అతలాకుతలం చేసి మన వంటి దేశాల బడ్జెట్‌లను తల్లకిందులు చేస్తున్నాయి. 202223 ఆర్థిక సంవత్సరం మొదటి సగంలో దేశ క్రూడాయిల్ దిగుమతి బిల్లు 72 శాతం పెరిగి 93.3 బిలియన్ డాలర్లకు చేరుకొన్నది. దిగుమతి చేసుకొన్న క్రూడాయిల్ కిమ్మత్తు 15 శాతం అధికమై 116.6 మిలియన్ టన్నులైంది. సరళమైన షరతులపై ఆయిల్‌ను మనకు అమ్ముతున్న రష్యా నుంచి క్రూడ్ దిగుమతి బాగా పెరిగింది.

దిగుమతి వ్యయం పెరిగినప్పటికీ రష్యా నుంచి వస్తున్న సుళువు సరఫరాల వల్ల మన దేశంలో ఆయిల్ అందుబాటులో ఎటువంటి అవాంతరం కలగడం లేదు. నిన్న మొన్నటి వరకు మన ఆయిల్ దిగుమతుల్లో కేవలం 0.2 శాతం మాత్రమే వున్న రష్యన్ ఆయిల్ వాటా ఇప్పుడు 22 శాతానికి చేరుకొన్నది. ఇరాక్ (20.5శాతం), సౌదీ అరేబియా(16 శాతం) కంటే మించిపోయింది. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయం పుంజుకోడానికి ఏమాత్రం ఆస్కారం లేని రీతిలో మన విధానాలు మారిపోయాయి. విదేశాల నుంచి వ్యవసాయ దిగుమతులకు గేట్లు బార్లా తెరవడం, చిన్న కమతాలుగా వున్న వ్యవసాయ రంగానికి మూలాధారమైన చిన్న రైతులను, కౌలు రైతులను ఆదుకొనే విధానాలు లేకపోడం మన సాగు రంగాన్ని తీవ్రంగా దెబ్బ తీశాయి. అయినా 50 శాతం కార్మికులు ఈ రంగం మీదనే ఆధారపడి బతుకుతున్నారు. గ్రామీణ రైతు కూలీలు వ్యవసాయాన్ని విడిచి వేరే రంగంలోకి వెళలేని పరిస్థితిలో వున్నారు.

జిడిపిలో వ్యవసాయ రంగం వాటా కేవలం 18 శాతమే కావడం ఆ రంగం దయనీయ స్థితిని చాటుతున్నది. ఇంకొక వైపు తయారీ రంగం కూడా నీరసించిపోయింది. మన పారిశ్రామిక ఉత్పత్తులు దేశీయ మార్కెట్ మీదనే ఆధారపడుతున్నాయి. వాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో తగిన గిరాకీ లేదు. ఈ పరిస్థితిని మార్చి ఎగుమతులను విశేషంగా పెంచుకొని దిగుమతుల భారాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలి.దేశంలో క్రూడాయిల్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలి. అప్పు డు మాత్రమే ఉద్యోగావకాశాలు విశేషంగా వృద్ధి చెందుతాయి. మోతీలాల్ వోస్వాల్ అనే బ్రోకరేజ్ సంస్థ నివేదిక ప్రకారం విపరీతంగా పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని హద్దుల్లో వుంచాలంటే 2030 వరకు ప్రతి ఏటా 10 మిలియన్ల ఉద్యోగాలు కల్పించవలసి వుంటుంది. ఏడాది కి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న ప్రధాని మోడీ వాగ్దానం గాలికి పేలపిండిలా నామ రూపాల్లేకుండాపోయింది. బ్రిటన్‌ను మించిపోయిన అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని గొప్పలు చెప్పుకోడం వల్ల ఏమి ప్రయోజనం? వృద్ధి రేటులో దేశ ప్రజల మందహాసం ప్రతిబింబించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News