Sunday, January 12, 2025

మోడీ పాలనలో తగ్గిన ఎగుమతులు

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు మనల్ని నిలదీస్తారు.అంతేకాదు ప్రపంచ దేశాల్లో 2022 సౌదీ అరేబియా తప్ప జి20 దేశాల్లో 6.7శాతంతో మన దేశమే అగ్రస్థానంలో ఉంది. మరి అలాంటపుడు మన దిగుమతులు కూడా ఎందుకు తగ్గినట్లు ? తాజాగా వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ వెల్లడించిన సమాచారం ప్రకారం వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మన ఎగుమతులు 11.9% తగ్గి 172.95 బిలియన్ డాలర్లుండగా, మన దిగుమతులు 12% తగ్గి 271.83 బి.డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే మన వాణిజ్యలోటు 112.85 నుంచి 98.88 బి.డాలర్లకు తగ్గింది.

అంటే పద్నాలుగు బిలియన్ డాలర్ల మేర మన విదేశీ మారక ద్రవ్యం మిగిలింది. కానీ సెప్టెంబరు 16వ తేదీ సమాచారం ప్రకారం గడచిన పదకొండు వారాలలో ఐదు బిలియన్ డాలర్లు తగ్గి మన నిల్వలు 593,9 బి.డాలర్లకు చేరాయి. మన దిగుమతులు గతేడాది మాదిరిగా ఉంటే వాటి పరిస్థితి ఇంకా దిగజారి ఉండేది. గుజరాత్ తరహాలో దేశమంతటినీ అభివృద్ధి చేస్తామన్నారు. నల్లధనాన్ని వెలికి తీసి ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామని చెప్పారు. ఎగుమతులతో చైనాను వెనక్కు నెట్టేసేందుకు గాను మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా, ఆత్మనిర్భరత పథకాలను ప్రకటించారు. పరిస్థితి ఇంకా దిగజారింది తప్ప మెరుగుపడలేదు. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు తప్ప కేంద్రం ప్రకటించిన ఆర్ధిక విధానాలనే రాష్ట్రాలు అమలు జరుపుతున్నాయి. మెజారిటీ రాష్ట్రా లు బిజెపి ఏలుబడిలోనే కొనసాగుతున్నాయి. గ్లోబల్ ఫైనాన్స్ అనే పత్రికలో 2023 జూన్ 8వ తేదీన ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం 2018 నుంచి 2022 వరకు ఐదు సంవత్సరాల కాలంలో మన సగటు వృద్ధి రేటు 4.1% కాగా, దిగజారిందీ, తీవ్ర ఆర్థిక సమస్యలతో ఉందని చెబుతున్న చైనాలో 5.5% ఉంది.

వికీపీడియా సమాచారం ప్రకారం 2022లో ఎగుమతులలో ప్రథమ స్థానంలో ఉన్న చైనా వస్తు, సేవల విలువ 3,71,582.7 కోట్ల డాలర్లు కాగా, అమెరికా 3,01,185.9 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. మన దేశం 76,771.7 కోట్లతో పదవ స్థానంలోఉంది. పదిహేనవదిగాఉన్న హాంకాంగ్ ఎగుమతుల విలువ 69,829.3 కోట్ల డాలర్లు. చైనా తన ఉత్పత్తులు కొన్నింటిని హాంకాంగ్ పేరుతో ఎగుమతి చేస్తున్న సంగతి బహిరంగమే. ప్రపంచ జిడిపిలో దేశాన్ని నరేంద్ర మోడీ ఐదవ స్థానంలోకి తీసుకుపోయినట్లు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నవారు ఎగుమతుల్లో ఎందుకు తీసుకుపోలేదన్నది ప్రశ్న. ప్రపంచ బ్యాంకు విశ్లేషణ (https://data.worldbank.org/ indicator/NE.EXP.GN FS.ZS?locations=IN) ప్రకారం 2004 లో యుపిఎ అధికారంలోకి వచ్చినపుడు మన జిడిపిలో వస్తు, సేవల ఎగుమతుల విలువ 17.9% కాగా, 2013 నాటికి 25.3కు పెరిగింది. మరుసటి యేడు 23శాతంగా ఉంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత అది క్రమంగా తగ్గుతూ 2019లో 18.7 కు దిగజారింది. తరువాత 2022లో 22.4% ఉంది. 1960 నుంచి 1990 వరకు మన జిడిపిలో ఎగుమతుల విలువ 4.5 నుంచి 7.1 శాతం మధ్య ఉంది. నూతన ఆర్థిక సంస్కరణల పేరుతో ఆర్ధిక విధానాల్లో మార్పుల తరువాత అది 1998 నాటికి 11 శాతానికి చేరింది.

బిజెపి నేత అటల్ బిహారీ వాజ్‌పేయీ అధికారంలో ఉన్న 19982004 కాలంలో పైన చెప్పుక్నుట్లు 17.9 శాతానికి పెరిగింది. నరేంద్ర మోడీ ఏలుబడిలోనే తొలిసారిగా పదేండ్ల కాలంలో పతనమైంది. ఎగుమతులను పెంచేందుకు ప్రతి దేశమూ చర్యలు తీసుకుంటున్నపుడు మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వాటిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒక నిర్దిష్ట విధానం, నిలకడ, స్పష్టత లేని, సరైనవి కాని విధానాలను అమలు జరిపినపుడు అవి జయప్రదం కావు. మన దేశంలో జరిగిందీ, జరుగుతున్నదీ అదే. జనానికి ఏం చెప్పారు, ఆచరణలో ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న. జనాల మనోభావాలను సంతుష్టీకరించి చైనాను దెబ్బ తీసిన మొనగాడిగా నరేంద్ర మోడీ కనిపించిన సంగతి తెలిసిందే. యాప్‌లు, పెట్టుబడులు మన రక్షణను దెబ్బ తీస్తాయని చెబితే జనమంతా నిజమే కామోసు అనుకున్నారు.

మోడీ మీద ఉన్న భ్రమ అలాంటిది. సరిహద్దు వివాదం, 1962లో యుద్ధం జరిగినప్పటికీ తరువాత కాలంలో రెండు దేశాలూ వివాదాలకు దౌత్య సంబంధాలకు, వాణిజ్యానికి ముడిపెట్టకూడదన్న అవగాహనకు వచ్చాయి. దాని ఫలితం, పర్యవసానమే నరేంద్ర మోడీ జి జిన్‌పింగ్ ఇద్దరూ కలసి ఊహాన్, మహాబలిపురాల్లో ఉయ్యాలలూగేందుకు దోహదం చేసింది. గాల్వన్ ఉదంతాలు తీవ్ర విచారకరమైనవి. కాని వాటికి వాణిజ్యానికి లంకెపెట్టి హడావుడి చేసిన పెద్దలు ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా తమ మాటలను తామే దిగమింగి పెద్ద ప్రచారం లేకుండా చైనా సంస్థలకు తిరిగి స్వాగతం పలుకుతున్నారు. ఇది రక్షణకు ముప్పులేదని అంగీకరించటమే కదా!
మన దేశంలో షియోమీ ఫోన్లను సరఫరా చేసే డిక్సన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో సెల్‌ఫోన్ అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు పోతున్నట్లు బ్లూవ్‌ుబెర్గ్ న్యూస్ తెలిపింది. నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో రానున్న మూడు సంవత్సరాల్లో మూడు లక్షల చదరపు అడుగుల్లో స్మార్ట్ ఫోన్ల యూనిట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు, వచ్చే నెలలో ప్రారంభించనట్లు వార్తలో పేర్కొన్నారు.

ఇదే విధంగా మన దేశంలోని అప్టిమస్ ఎలక్ట్రానిక్స్ సంస్థకు బ్లూటూత్ నెక్‌బాండ్ ఇయర్ ఫోన్ల తయారీ కాంట్రాక్టును కూడా అదే కంపెనీ అప్పగించింది. ఇటీవలి కాలంలో షియోమీ కంపెనీ మీద విధించిన ఆంక్షలు, ఇతర కారణాలతో మన దేశంలో దాని ఉత్పత్తుల విక్రయం తగ్గింది. ఈ ఒప్పందాలతో ఆటంకాలను అధిగమించి తిరిగి మార్కెట్ వాటాను పెంచుకోవచ్చని భావిస్తున్నారు.చట్టబద్ధంగా, మన చట్టాలకు అనుగుణంగా పని చేసే చైనాతో సహా ఏ దేశానికి చెందిన ఏ సంస్థనైనా అనుమతిస్తామని ఐటి, ఎలక్ట్రానిక్స్ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనా సరఫరా వ్యవస్థ నుంచి వైదొలగాలని అమెరికా, ఇతర ఐరోపాదేశాల గీతానికి మన దేశం కోరస్‌గా గొంతు కలిపింది. అయితే చైనా మీద ఆధారపడకుండా మనుగడ కష్టమని గడచిన మూడు సంవత్సరాల అనుభవతత్వం బోధపడటం, మన దేశంలోని కార్పొరేట్ సంస్థల వత్తిడి, ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ముందుకు రాకపోవటం, చైనా నుంచి కంపెనీలు వియత్నాంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు పూనుకోవటం వంటి పరిణామాలతో చైనా కంపెనీల గురించి కేంద్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందన్నది స్పష్టం. తన వైఖరిని సమర్ధించుకొనేందుకు మన దేశ కంపెనీలకు 51% వాటా ఉండాలన్న నిబంధన విధించినట్లు చెబుతున్నారు.

ఈ మేరకు 2022 డిసెంబరులోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు మీడియాకు లీకులు వదిలారు. గాల్వన్ ఉదంతాల తరువాత విధించిన ఆంక్షల ప్రకారం 202021లో చైనా నుంచి వచ్చిన 58 ఎఫ్‌డిఐ ప్రతిపాదనలను, మరుసటి ఏడాది మరో 33 ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది. సంయుక్త రంగంలో విద్యుత్ వాహనాల తయారీకి వంద కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామన్న చైనా బివైడి కంపెనీ ప్రతిపాదనను కూడా తిరస్కరించారు. అయినప్పటికీ ఆ ప్రతిపాదన కూడా ఇంకా పరిశీలనలోనే ఉందని చెబుతున్నారు.2023 మార్చి 21 నాటికి చైనా లేదా హాంకాంగ్ నుంచి వచ్చిన 54 పెట్టుబడి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు తెలిపారు.
ప్రతి దేశం తన స్వంత పరిశ్రమలు, వాణిజ్యాన్ని కాపాడుకొనేందుకు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నది. దానికి మన దేశం కూడా మినహాయింపు కాదు. నరేంద్ర మోడీ సర్కారు కూడా ఆర్ధిక ఆయుధాలను ప్రయోగించి పరీక్షిస్తున్నది. చైనా విషయంలో అవి పని చేయటం లేదన్నది గత పది సంవత్సరాల అనుభవం చెబుతున్నది.

చైనా నుంచి మన దిగుమతులు దాదాపు రెట్టింపు కావటమే దానికి నిదర్శనం. అదే మాదిరి మన ఎగుమతులు పెరగలేదు. ఐఎంఎఫ్ సమాచారం ప్రకారం రెండు దేశాల మధ్య 2022లో 117 బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగితే చైనా నుంచి దిగుమతుల వాటా 87% ఉంది. మన దేశం నుంచి రొయ్యలు, పీతల వంటి సముద్ర ఉత్పత్తులు, పత్తి, గ్రానైట్, వజ్రాల వంటి వాటిని ఎగుమతి చేస్తుంటే చైనా నుంచి ఎలక్ట్రానిక్ చిప్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, ఔషధాల తయారీకి అవసరమైన పదార్ధాలను దిగుమతి చేసుకుంటున్నాము. మన ఉత్పత్తుల ఎగుమతి నిలిపి వేసినా చైనా వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కానీ చైనా నుంచి మనం తెచ్చుకుంటున్న వస్తువులను అంత తక్కువ ధరలకు మరేదేశమూ ఇవ్వని కారణంగానే మరోమార్గం లేక దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అనుమతించకపోతే కార్పొరేట్ల ఆగ్రహానికి మోడీ గురికావాల్సి వస్తుంది. ఇక మన దేశం తీసుకుంటున్న రక్షణాత్మక చర్యల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆగస్టు మొదటి వారంలో అంబానీ కంపెనీ జియో లాప్ టాప్‌లు, టాబ్‌లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది.

అంతకు ముందు అదే కంపెనీ వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకొని మార్కెట్ చేసింది. ఇప్పుడు విడిభాగాలను దిగుమతి చేసుకొని ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తూ తన పేరు పెట్టుకుంది. సరిగ్గా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాప్‌టాప్‌ల దిగుమతులపై ఆంక్షలు విధించి అవసరమైన వారు అనుమతి తీసుకోవాలంటూ నిబంధన విధించింది. ఇంతకాలం లేని అనుమతులు ఇప్పుడెందుకు? ఇది ఎవరి కోసమో చెప్పనవసరం లేదు. 2018లో అమెరికా అధినేతగా ఉన్న ట్రంప్ చైనా వస్తువుల మీద దిగుమతి పన్ను విధిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీశాడు. అదే ఏడాది మన కేంద్ర ప్రభుత్వం చైనా ఫోన్ల దిగుమతులను అడ్డుకొనేందుకు 20 శాతం పన్ను విధించింది. గాల్వన్ ఉదంతాల తరువాత చైనా బొమ్మలపై అప్పటికే ఉన్న దిగుమతి పన్నును 60, తరువాత 2021లో 70 శాతానికి పెంచింది.

షియోమీ, బిబికె ఎలక్ట్రానిక్స్ చెల్లించాల్సిన దాని కంటే తక్కువ పన్ను చెల్లించినట్లు ఆరోపించి ఆ సంస్థల మీద దాడులు చేశారు. మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఉత్పాదక ఎగుమతి బోనస్‌గా చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం 33 బిలియన్ డాలర్లను పక్కన పెట్టి ఒక పథకాన్ని రూపొందించింది. అందుకోసం పద్నాలుగు రంగాలను గుర్తించింది, వాటిలో ఎక్కువగా చైనా కంపెనీల ఆధిపత్యమే కొనసాగుతున్నది. చివరకు ఇప్పుడు ఆ చైనా కంపెనీల పెట్టుబడులకే అనుమతులు ఇచ్చి ఉత్పత్తులు చేయించేందుకు, సబ్సిడీలుఇచ్చి ఎగుమతు చేయించేందుకు పూనుకుంది.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News