Friday, November 22, 2024

విదేశీ అప్పు ఊబిలో దేశం!

- Advertisement -
- Advertisement -

India's external debt rises to $570 billion

 

‘అధికార కేంద్రాన్ని కాపాడుకోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది’ ఆగండి ఆగండి నరేంద్ర మోడీ అభిమానులారా! ఈ మాటలన్నది రాహుల్ గాంధీయో, సీతారావ్‌ు ఏచూరో కాదు. ఒక్కసారి గతంలోకి వెళితే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ నోటి నుంచి వెలువడిన సుభాషితాలే ఇవి అని మీరు ఇట్టే గ్రహించేస్తారు.

ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే రూపాయి విలువ పతనం కారణంగా మన విదేశీ అప్పు గణనీయంగా పెరిగిపోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ రిజర్వుబ్యాంకే తాజాగా చెప్పింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన విదేశీ అప్పు 570 బిలియన్ డాలర్లకు పెరిగింది. గతేడాది మార్చి నాటికి జిడిపిలో విదేశీ అప్పు శాతం 20.6 శాతం ఉంటే ఈ ఏడాదికి అది 21.1శాతానికి “అభివృద్ధి” చెందింది. గతేడాది మన విదేశీ అప్పు 11.5 బిలియన్ డాలర్లు పెరిగింది. మన రూపాయి విలువ పతనం కానట్లయితే ఆ పెరుగుదల 4.7 బిలియన్ డాలర్లు ఉండేది, పతనం కారణంగా 6.8 బిలియన్ డాలర్లు అదనం అయింది. మనందరికీ తెలిసిన సాధారణ విషయం ఏమంటే ఒప్పందం ప్రకారం వడ్డీ నెల నెలా కట్టకపోతే అది అసలులో కలిసి అప్పు భారం పెరుగుతుంది. మనం కొత్తగా అప్పులు తీసుకోకపోయినా, వడ్డీ సకాలంలో చెల్లించినా రూపాయి విలువ తగ్గితే మన అప్పు పెరిగి పోతుంది. అందువలన మోడీ గారు చెప్పినట్లు రూపాయి విలువ తగ్గుదలపెరుగుదల ప్రభుత్వాలదే గనుక ఆ పుణ్యం మన నరేంద్రమోడీ ఖాతాలోకే వేయాలి మరి. మన్మోహన్ సింగ్‌కు ఒక న్యాయం నరేంద్రమోడీకి ఒక న్యాయం ఉండదు కదా !

మా నరేంద్ర మోడీ అప్పులే చేయలేదు, గతంలో చేసిన అప్పులు తీర్చారు అని బిజెపి (ట్రోల్స్) సామాజిక మాధ్యమంలో ఊదరగొట్టారు. మరి రిజర్వు బ్యాంకు చెబుతున్న వివరాల సంగతేమిటి? అప్పులు తీరిస్తే ఎందుకు పెరుగుతున్నాయి ? 2014లో 446.2 బిలియన్ డాలర్ల అప్పుంటే ఇప్పుడు 570 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది చెల్లించిన అసలు, వడ్డీ కలిపి 8.2 శాతం ఉండగా అంతకు ముందు 6.5 శాతం ఉంది. గత ఏడు సంవత్సరాలలో అది 5.9 నుంచి 8.2శాతం మధ్య ఉంది తప్ప మోడీ భక్తులు చెబుతున్నట్లుగా ఏ ఒక్క ఏడాదిలోనూ అసాధారణంగా అప్పు తీర్చిన దాఖలా లేదు. ప్రభు త్వం తీసుకున్న అప్పులు ఇదే కాలంలో 79 బిలియన్ డాలర్ల నుంచి 107కు పెరిగాయి. అందువలన గత ప్రభుత్వం మాదిరే మోడీ సర్కార్ కూడా అప్పులు తీసుకుంటున్నదీ, చెల్లిస్తున్నది తప్ప 56 అంగుళాల ఆర్ధిక నైపుణ్య ప్రత్యేకత ఏమీ లేదు.

గత ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్ల భారం తమ మోడీ సర్కార్ భరించాల్సి వస్తున్నది కనుక సమీప భవిష్యత్‌లో చమురు ధరలు లేదా పన్ను తగ్గించే అవకాశం లేదని అభిమానులు చెబుతారు. మన్‌కీ బాత్ అంటూ ప్రతి నెలా మోడీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంత వరకు ఏ నెలలో అయినా ఆ విషయం చెప్పారా అందువలన ఏదో ఒక సమయంలో ఆ ముక్కేదో నరేంద్ర మోడీనే చెప్పమనండి ! చెప్పలేరు ? ఎందుకని ? మన్మోహన్ సింగ్ సర్కార్, అంతకు ముందు వాజ్‌పేయ్ సర్కార్ జారీ చేసిన బాండ్లకు గాను చెల్లించాల్సిన మొత్తం లక్షా 30 వేల కోట్ల రూపాయలు. వాటి గడువు ఇంకా ఉంది. అది కూడా వినియోగదారులకు సబ్సిడీగా ఇచ్చిన మొత్తం తప్ప మరొకటి కాదు.

ఈ మొత్తానికి గుండెలు బాదుకుంటూ చమురు ధర తగ్గించలేరని చెబుతున్న వారు మోడీ సర్కార్ చేసిన అప్పుల గురించి మాట్లాడరు. విదేశీ అప్పు గురించి పైన చెప్పుకున్నాం. గత ఏడు సంవత్సరాల కాలంలో చేసిన అప్పు ఎంతో తెలుసా! 2014లో ఉన్న అప్పు 54,90,763 కోట్లు. అది 2021మార్చి 31 నాటికి 116.21 లక్షల కోట్లకు పెరిగింది. చమురు బాండ్లు ఈ మొత్తంలో వందో వంతు కంటే తక్కువే కదా? మరి ఇంత అప్పు ఎందుకు చేసినట్లు? ఈ మొత్తంతో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ? దాని వలన వచ్చిన ఫలితాలేమిటో ఎవరైనా చెప్పేవారున్నారా ?

ఏడు సంవత్సరాల క్రితం ఒక లీటరు పెట్రోలు మీద రూ. 9.48 ఎక్సైజ్ పన్ను ఉంది. అది ఇప్పుడు 32 రూపాయలకు పెరిగింది. ఒక రూపాయి పన్ను పెరిగితే కేంద్ర ప్రభుత్వానికి ఏటా పద్నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంచనా. అంటే ఏడు సంవత్సరాల కాలంలో ఆదాయం లక్షా 30 వేల కోట్ల నుంచి నాలుగున్నర లక్షల కోట్లకు పెరిగింది. యుపిఎ చమురు బాండ్ల పేరుతో ఇంత బాదుడా? జనాన్ని అంత అమాయకంగా చూస్తున్నారా? 2014 మే నెలలో మనం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా ధర డాలర్లలో 107.7 ఉండగా మన రూపాయల్లో చెల్లించిన మొత్తం 6,326. ఇప్పుడు జూన్ నెలలో 71.40 డాలర్లు కాగా రూపాయల్లో 5,257, జూలై రెండవ తేదీ ధర 74.75 కాగా రూపాయల్లో 5,560 ఉంది.

ఏడు సంవత్సరాల క్రితం అంత తక్కువ ఎందుకు చెల్లించాము, ఇప్పుడు ఇంత ఎక్కువ ఎందుకు చెల్లిస్తున్నాము. అంటే మోడీ ఏలుబడిలో రూపాయి విలువ పతనం కావటమే కారణం. మరి రూపాయి విలువ గురించి గతంలో చెప్పిన మాటలేమైనట్లు ? ఇలా పతనం అవుతుంటే ఎవరు లాభపడుతున్నట్లు? గోడ దెబ్బ చెంపదెబ్బ మాదిరి వినియోగదారులకు పన్నుపోటు రూపాయి పోటు రెండూ ఎడాపెడా తగులుతున్నాయి. సమర్ధవంతమైన పాలన ఎక్కడ, అనుభవం ఏమైనట్లు ?

మోడీ పాలనలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అంత పెరిగాయి, ఇంత పెరిగాయి చూడండి అంటూ గొప్పలు చెబుతారు. మన వాణిజ్యం ప్రతి సంవత్సరం లోటులోనే నడుస్తున్నది. మరి ఈ నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయి? గతేడాది కరోనా కారణంగా వినియోగం తగ్గి దిగుమతులు పడిపోయి వాణిజ్య మిగులు ఉంది తప్ప ఎప్పుడూ మనకు చైనా, జపాన్ మాదిరి డాలర్లు మిగల్లేదు. మరి మన దగ్గర ఉన్న డాలర్ నిల్వలు ఏమిటి అంటే మన స్టాక్ మార్కెట్లో విదేశీయుల పెట్టుబడులు, చేస్తున్న అప్పులు, ప్రవాస భారతీయులు దాచుకుంటున్న నిల్వలు మాత్రమే. మరో విధంగా చెప్పాలంటే మన జేబులో సొమ్ము తప్ప బీరువా ఖాళీయే.

మన రూపాయి విలువ తక్కువ, ఎక్కువ ఉండటం గురించి మన వాణిజ్య వేత్తల్లో విభేదాలు ఉన్నాయి. విదేశాల నుంచి రుణాలు తీసుకున్నా లేదా విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినా మన దగ్గర డాలర్ నిల్వలు పెరుగుతాయి, దాంతో రూపాయి విలువ పెరుగుతుంది. ఇది ఎగుమతిదారుల లాభదాయకతను దెబ్బ తీస్తుంది. విదేశీ మార్కెట్లో మన వస్తువులు పోటీ పడలేవు. అందువలన రూపాయి బలం గా ఉండటాన్ని ఎగుమతిదారులు వ్యతిరేకిస్తారు. ఇప్పుడున్న దాని మీద రూపాయి విలువ 20 శాతం తగ్గిస్తే మన ఎగుమతులు ఇబ్బడి ముబ్బడి అవుతాయని వారు చెబుతారు.

మన రూపాయి బలంగా ఉంటే చమురు, ఇతర దిగుమతుల ధరలు తగ్గుతాయి. వినియోగదారుల మీద భారం తగ్గుతుంది. కనుక రూపాయి విలువ పతనాన్ని అరికట్టాలని దిగుమతిదారులు డిమాండ్ చేస్తారు. 2011 నుంచి మన ఎగుమతులు 300 నుంచి 314 బిలియన్ డాలర్ల మధ్యనే ఉన్నాయి. ఒక సంవత్సరం మాత్రం 330 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇదే సమయంలో దిగుమతులు పెరగటమే తప్ప తరగటం లేదు. ఏడు సంవత్సరాలుగా మేకిన్ ఇండియా పేరుతో ప్రధాని మోడీ వస్తు తయారీకి పిలుపులు ఇస్తున్నా ఎగుమతులూ లేవు, దిగుమతులూ తగ్గలేదు. అంటే మనకు అవసరమైన వస్తువులను కూడా మనం తయారు చేసుకోలేకపోతున్నాం. మొత్తం మీద చెప్పవచ్చేదేమంటే మోడీ సర్కార్ వైఫల్యాలు జనం మీద భారాలు పెంచుతున్నాయి. మునిగే పడవ గడ్డిపోచను కూడా భరించలేదన్నట్లుగా పరిస్ధితి దిగజారుతోంది. అందుకే మోడీ మీ భారాలు మోయలేకున్నాం అని చెప్పాల్సి వస్తోంది. వినిపించుకుంటారా! అధికారంలో ఉన్నవారు అలాంటి మంచి పని చేసిన దాఖలా లేదు మరి !!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News