తిరువనంతపురం: భారత్‌లో మంకీపాక్స్ బారిన పడిన తొలి బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన ఈ 35 ఏళ్ల ఈ వ్యక్తి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా 72 గంటల్లో రెండుసార్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి మంకీపాక్స్ నెగెటివ్ వచ్చిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి వెల్లడించారు. శనివారమే అతడ్ని డిశ్చార్జి చేసి ఇంటికి పంపించినట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితుడు శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని తెలిపారు. అతని శరీరంపై వచ్చిన దద్దుర్లు కూడా పూర్తిగా నయమైనట్లు చెప్పారు. అంతేకాదు బాధితుడి కుటుంబ సభ్యుల్లో ఎవరికి కూడా మంకీపాక్స్ సోకలేదని, అందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు.
అలాగే మంకీపాక్స్ సోకిన మరో ఇద్దరు బాధితుల పరిస్థితి కూడా ప్రస్తుతం బాగానే ఉందని మంత్రి తెలిపారు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన మంకీపాక్స్ తొలి బాధితుడికి ఈ నెల 14న పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతను విదేశాలనుంచి వచ్చాడు. ఆ తర్వాత రాష్ట్రంలోనే మరో రెండు కేసులు వెలుగు చూశాయి. వారు కూడా విదేశాలకు వెళ్లి వచ్చిన వారే. మంకాపాక్స్ జంతువులనుంచి మానవులకు సోకినట్లు ప్రపంచ ఆరరోగ్య సంస్థ (డబ్లు హెచ్‌ఓ) ఇప్పటికే తెలియజేసిన విషయం తెలిసింది. ఈ మహమ్మారిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా ప్రకటించింది. ఇది స్మాల్‌పాక్స్ తరహా వ్యాధి అని అయితే ప్రాణాంతకం కాదని పేర్కొంది.