ఆర్థిక వ్యవస్థ మెరుగవడంతో 2023-24 వృద్ధి రేటును పెంచిన ఫిచ్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు అంచనాను పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం చొప్పున వృ ద్ధి చెందుతుందని ఫిచ్ పేర్కొంది. అంతకుముం దు ఫిచ్ జిడిపి 6 శాతంగా అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన దృక్పథం, మొదటి త్రైమాసికంలో సానుకూల వృద్ధి రేటు అంచనా కారణంగా, ఫిచ్ తన రేటింగ్ అంచనాను సవరించింది. 2023 మే 31న ప్రభుత్వం గణాంకాలను విడుదల చేస్తూ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి 7.2 శాతంగా ఉండనుందని, ఇది అంచనా కంటే మెరుగ్గా ఉందని పేర్కొంది. ఈ సంఖ్యను ప్రకటించిన తర్వాత 2023-24లో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని ఆర్థికవేత్తల నుండి ఏజెన్సీల వరకు అంచనా వేస్తున్నారు. అంతకుముందు 2023 మార్చిలో ఫిచ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిడిపి అంచనాను 6.2 శాతం నుండి 6 శాతానికి తగ్గించింది. భారత ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, గ్లోబల్ డిమాండ్ లేకపోవడం వల్ల భారాన్ని భరించవలసి ఉంటుందని ఫిచ్ తన అంచనాలో పేర్కొంది.
మార్చి నుంచి పరిస్థితిలో మార్పు
2023 మార్చి నుంచి భారతదేశం పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. గత రెండు ద్రవ్య విధాన సమావేశాల్లో ఆర్‌బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ సమయంలో ఏప్రిల్, మే నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదల నమోదు చేసింది. కాగా మేలో ద్రవ్యోల్బణం 4.25 శాతానికి తగ్గింది. దీంతో ఆర్‌బిఐ వడ్డీ రేట్లు తగ్గించవచ్చని, చౌకైన రుణాలు చూడొచ్చని అంచనాలు పెరిగాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చనుంది. జనవరి- మార్చి త్రైమాసికంలో జిడిపి వృద్ధి అద్భుతంగా ఉందని ఫిచ్ పేర్కొంది. రెండు త్రైమాసికాలుగా నిరంతర క్షీణతను ఎదుర్కొన్న తర్వాత తయారీ రంగం, అలాగే నిర్మాణ రంగంలో మెరుగుదల కనిపించింది. అలాగే వ్యవసాయ ఉత్పత్తిలో పెరుగుదల నమోదైంది. దీని కారణంగా దేశీయ ఆర్థిక వ్యవస్థ వేగం అందుకుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని రేటింగ్ ఏజెన్సీ వృద్ధి రేటు అంచనాను పెంచింది. 2024-25, 2025-26లో భారతదేశ జిడిపి 6.5 శాతంగా ఉంటుందని ఫిచ్ తన అంచనాలో పేర్కొంది.