Friday, December 20, 2024

అంతరిక్షం లోకి భారత్ సరికొత్త “అగ్నిబాణ్ ”

- Advertisement -
- Advertisement -

ప్రపంచం లోనే తొలి 3 డీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్
తొలి ప్రైవేట్ లాంచ్‌పాడ్‌పై ప్రయోగం

న్యూఢిల్లీ : చెన్నై ఐఐటీ కేంద్రంగా పనిచేసే అగ్నికుల్ సంస్థ రూపొందించిన “అగ్నిబాణ్‌” గురువారం ఉదయం 7.15 గంటల సమయంలో విజయవంతంగా ప్రయోగించినట్టు ఇస్రో ప్రకటించింది. ప్రత్యేక శ్రేణి ఉపగ్రహాలను వీలైనంత వేగంగా , కారు చౌకగా కక్ష లోకి ప్రవేశ పెట్టేందుకు వీలుగా ఈ ప్రయోగం చేపట్టారు. అగ్నిబాణ్ పేరిట తొలిసారి సబ్‌ఆర్బిటాల్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ ప్రయోగాన్ని నిర్వహించింది. దీంతో ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసి పట్టేలా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఇందులో తొలిసారి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ లిక్విడ్ ఇంజిన్ కంట్రోల్డ్ ఫ్లైట్ నిర్వహించినట్టయింది. అగ్నికుల్ కాస్మోస్ సంస్థను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందించారు. వాస్తవానికి ఈ ప్రయోగం దాదాపు నెలన్నర క్రితమే జరగాల్సి ఉంది. కానీ నాలుగుసార్లు వాయిదా పడింది. ఐదోసారి విజయవంతంగా పూర్తి చేసుకొంది. ఈ ప్రయోగం దాదాపు రెండు నిమిషాల పాటు సింగిల్ స్టేజ్ లోనే జరిగింది.

దీనిలో ప్రపంచం లోనే తొలిసారి తయారు చేసిన సింగిల్‌ఫేస్ త్రీడీ ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్‌ను అమర్చారు. దీనిపై అగ్నికుల్ కాస్మోస్‌కు పేటెంట్ ఉంది. ఇది సబ్‌కూల్డ్ ద్రవ ఆక్సిజన్ ఆధారంగా ఒక స్టేజీలోనే పనిచేసింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేశారు. దీర్ఘ వృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్ పొడవు 6.2 మీటర్లు. దీని లోపలే ఉపగ్రహాన్ని అమర్చారు. ఈ రాకెట్ తొలిసారి ఈథర్‌నెట్ ఆధారంగా పనిచేసే ఏవియానిక్స్ వ్యవస్థను వాడారు. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోపైలెట్ కంట్రోల్ సిస్టమ్‌ను ఇందులో వినియోగించారు. ఒకవేళ ప్రయోగం అదుపు తప్పితే తక్షణమే దానిని నాశనం చేసేలా ఇస్రో అభివృద్ధి చేసిన ఫ్లైట్ టర్మినేషన్ వ్యవస్థను కూడా దీనిలో అమర్చారు. పలురకాల లాంచర్ల నుంచి ప్రయోగించేలా దీనిని నిర్మించారు. 300కిలోల లోపు బరువున్న ఉపగ్రహ ప్రయోగాలకు వెంటనే అవకాశాలు దొరకవు. ఇలాంటి వాటి కోసం అగ్నికుల్ నిర్మించిన రాకెట్ సరిపోతుందని భావిస్తున్నారు.

ప్రయోగం రెండు నిమిషాలే ..

ఈ మొత్తం ప్రయోగం దాదాపు రెండు నిమిషాలు మాత్రమే జరిగింది. ముగిశాక రాకెట్ సముద్రంలో కూలిపోయింది. శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఏఎల్‌పీ ఈ పరీక్షకు వేదికైంది. ఈ రాకెట్ ప్రయోగించిన తరువాత నాలుగు సెకన్ల సమయం లో నిర్ణీత దిశకు మళ్లింది. 1.29 నిమిషాల సమయానికి ఇది నిర్ణీత ప్రదేశానికి చేరి అక్కడ నుంచి తిరిగి సముద్రంలో పడింది. అగ్నికుల్ ఇంజిన్, ఆకారం వాటిని విశ్లేషించి మరింత మెరుగుపరచడానికి ఈ రెండు నిమిషాల పరీక్ష ఉపయోగ పడుతుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అగ్నికుల్ సంస్థను అభినందించారు. ప్రపంచం లోనే తొలిసారి 3 డీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ కావడం విశేషమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News