Thursday, January 23, 2025

మత్స్య 6000 సబ్‌మెరైన్ సంసిద్ధం.. సముద్రయాన్‌తో అగాథ అన్వేషణ

- Advertisement -
- Advertisement -

చెన్నై : సముద్ర గర్భ అన్వేషణ దిశలో భారతదేశం సిద్ధమైంది. చంద్రయాన్ , గగన్‌యాన్ తరహాలో ఇప్పుడు సముద్రయాన్‌కు రంగం సిద్ధమైంది. ఈ అత్యంత కీలకమైన ప్రాజెక్టులో ప్రధాన భూమిక వహించే మత్స్య 6000 జలాంతర్గామి తుది మెరుగుల దశలో ఉంది, సంబంధిత ఫోటోలను కేంద్ర ఎర్త్ సైన్స్ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ విడుదల చేశారు. ఈ సబ్ మెరైన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇది మానవ సహిత జలాంతర్గామిగా ఉంటుంది. సముద్ర గర్భ అన్వేషణలో సాగుతుంది.

చైన్నైలోని నేషనల్ ఇనిస్టూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఒటి)దీనిని రూపొందించింది. సబ్‌మెరైన్ చోదకులైన ఆక్వానట్‌లు ముగ్గురు వరకూ ఇందులో వెళ్లవచ్చు. ఆక్వానట్‌లు దీని ద్వారా క్రమేపీ సముద్ర గర్భంలో ఆరుకిలోమీటర్ల లోతువరకూ దీని ద్వారా వెళ్లేందుకు, పరిశోధనలు నిర్వహించేందుకు లక్షాన్ని ఎంచుకున్నారు. ముందుగా ఇది ప్రయోగాత్మకంగా 500 మీటర్ల లోతువరకూ వెళ్లుతుంది. ఈ సబ్‌మెరైన్ సముద్రయాన్ పరిశోధనల వల్ల సముద్ర పర్యావరణానికి ఎటువంటి ముప్పు లేదని కేంద్ర మంత్రి ఈ ఫోటోలు, వీడియోలను విడుదల చేసిన సందర్భంగా విలేకరులకు తెలిపారు. 2026 నాటికి సముద్రయాన్ మిషన్ కార్యరూపంలోకి వస్తుంది. సముద్ర గర్భంలో అపార ఖనిజాలు , వనరులు ఉన్నాయి.

అరుదైన జీవజాలం ఉనికి ఉంది. సముద్ర గర్భ నిక్షిప్తాలను పసిగట్టడం జరిగితే అంతర్గత పర్యావరణానికి ఎటువంటి ముప్పులేకుండానే ఈ వనరులను సద్వినియోగం చేసుకోవచ్చునని, దీనితో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ ఉపాధి కల్పనకు వీలేర్పడుతుందని మంత్రి తెలిపారు. ఈ సబ్‌మెరైన్‌లోకి వెళ్లి, కొద్ది సేపు కూర్చున్న కేంద్ర మంత్రి రిజిజు , దీని సాంకేతిక విషయాలను , దీని నిర్మాణ వివరాలను సాంకేతిక నిపుణులు, ఇంజినీర్ల ద్వారా తెలుసుకున్నారు. గోళాకారంలో ఉండే ఈ సబ్‌మెరైన్‌ను సముద్రయాన్ మత్స 6000గా వ్యవహరిస్తున్నారు. సముద్ర జీవ వైవిధ్యాన్ని పరిశీలించేందుకు ఈ మానవయుత జలాంతర్గామి ప్రయాణం వల్ల వీలేర్పడుతుందని మంత్రి చెప్పారు. ప్రధాని మోడీ నిర్థేశిత బ్లూ ఎకానమి విజన్‌కు ఈ సముద్రయాన్ అద్దం పడుతుందని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News