న్యూఢిల్లీ: పార్లమెంట్ కొత్త భవనంలో భారత్ ప్రయాణం ప్రారంభమైంది. మంగళవారం పార్లమెంట్ పాత భవనం లోని సెంట్రల్ హాల్‌లో జరిగిన ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయసభ సభ్యులు కొత్త పార్లమెంట్‌కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోడీ ముందు నడవగా, మంత్రులు, ఎంపీలు ‘భారత్ మాతాకీ జై’ అంటూ ఆయనను అనుసరించారు. అలాగే సెంట్రల్ హాల్ లోని రాజ్యాంగ పుస్తకాన్ని నూతన భవనం లోకి తరలించారు. లోపలికి వెళ్లిన ప్రధాని కొత్త భవనాన్ని తరచి చూశారు.
ప్రారంభమైన పార్లమెంట్ కార్యకలాపాలు
సభ లోకి వెళ్లిన వెంటనే జాతీయ గీతం ఆలపించారు. ఆ తర్వాత సభ్యులు వారి సీట్లలో కూర్చున్నారు. అనంతరం పార్లమెంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ మాట్లాడిన తర్వాత , ప్రధాని మోడీ తొలి ప్రసంగం చేశారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు కొత్త భవనం ప్రారంభించుకోవడం శుభసూచకం.
ఆజాదీ అమృత కాలంలో ఇది ఉషోదయ కాలం. కొత్త భవనం లోకి కొత్త సంకల్పం తీసుకొని వెళ్లాలి. చంద్రయాన్ 3 విజయం దేశ వాసులను గర్వపడేలా చేసింది. జీ 20 సమావేశాల సమర్థ నిర్వహణ భారత ప్రతిష్ఠను పెంచింది. ప్రాచీన ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆధునిక భారతీయ తత్వాలకు కలబోత ఈ కొత్త భవనం’ అని ఈ సందర్భంగా మోడీ వెల్లడించారు.