Thursday, January 9, 2025

వృద్ధి పెరిగినా తగ్గని నిరుద్యోగం

- Advertisement -
- Advertisement -

భారత్‌కు కలసి వచ్చిన కాలం పేదలకు తోడ్పడుతోందా?’ అంటూ మార్చినెల రెండవ తేదీన బ్రిటన్‌కు చెందిన ఎకానమిస్ట్ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. “ భారత నరేంద్రమోడీ సమస్య : అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ ” మార్చినెల 19వ తేదీ ఆదివారం నాడు లండన్ నుంచి వెలువడే మరో పత్రిక ఫైనాన్సియల్ టైవ్‌‌సు తన విశ్లేషణకు పెట్టిన శీర్షిక.“ ఏడాది కాలంగా వారానికి మూడువేల కోట్లు కోల్పోతున్న గౌతవ్‌ు అదానీ, గరిష్ట స్థాయి నుంచి 60శాతం పడిన సంపద ” అని ఎకనమిక్ టైవ్‌‌సు మార్చి 22న ఒక విశ్లేషణను పాఠకులకు అందించింది. జాతీయవాదం పేరుతో తెలిసో తెలియకో ఊగిపోతున్నవారికి, మోడీ ఏలుబడిలో అచ్చేదిన్, అమృత కాలం అని నిజంగా నమ్ముతున్నవారికి లండన్ పత్రికల విశ్లేషణలు రుచిస్తాయా ? ఎవరేమి రాశారు ఎందుకు రాశారు అన్నది కాసేపు పక్కన పెట్టి నిజానిజాల గురించి లేవనెత్తిన అంశాల గురించి ఉద్రేకానికి లోనుకాకుండా ఆలోచించాలి.
“కష్టాల్లో కూరుకుపోయిన శతకోటీశ్వరుడు గౌతవ్‌ు అదానీకి గత ఏడాది కాలంగా వారానికి మూడువేల కోట్ల రూపాయలమేర దెబ్బతగిలింది. అతని సంపద 53 బిలియన్ డాలర్లకు పడిపోయిందని (మార్చి 22న విడుదల చేసిన) ఎం3ఎం హరూన్ గ్లోబల్ రిచ్ జాబితా 2023లో చూపారు ” అంటూ టైవ్‌‌సు ఆఫ్ ఇండియా విశ్లేషకుడు ఒకరు విశ్లేషణను ప్రారంభించారు. ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. ఎన్ని రోజులైనా పార్లమెంటు జరగకపోయినా సరే అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద పార్లమెంటరీ కమిటీ విచారణకు అంగీకరించేది లేదంటూ భీష్మించుకున్న ప్రధాని నరేంద్రమోడీ పట్టుదల పట్టుదల ఒకవైపు. ఎలాగైతేనేం ఎంత డబ్బు సంపాదించారనేదే ముఖ్యం అన్నట్లుగా ఆలోచిస్తున్న సమాజం మరొక వైపు కనిపిస్తున్నపుడు తరిగిపోతున్న అదానీ సంపదల గురించి గుండెలు బాదుకోక ఏమి చేస్తారు.
2022 సెప్టెంబరు చివరి వారంలో ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హరూన్ ఇండియా రిచ్ జాబితా వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో అదానీ కుటుంబం రోజుకు రు.1,612 కోట్లు, ముకేష్ అంబానీ రు.210 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నది. ఒక దశలో అదానీ కంటే అంబానీ సంపద రు. రెండు లక్షల కోట్లు ఎక్కువ, అలాంటిది ఏడాది కాలంలోనే అంబానీని వెనక్కు నెట్టి అదానీ మూడులక్షల కోట్లు ఎక్కువ, అంటే ఏడాదిలో ఐదులక్షల కోట్లు సంపాదించాడు. అబ్రకదబ్ర, మాయలు మంత్రాలు చేసే గంధర్వులకు, మిత్రమా ఏమి నీ కోరిక, తథాస్తు అనే పైవారు ఉంటే తప్ప మానవ మాత్రులకు సాధ్యమా ? 2012లో అంబానీ సంపదతో పోలిస్తే అదానీ దగ్గర ఆరోవంతు మాత్రమే ఉంది. 2014లో కేవలం ఎనిమిది బిలియన్ డాలర్ల సంపద ఉన్న అదానీ 2022 నాటికి 137 బి.డాలర్లకు ఎదిగారు. వందల సంవత్సరాలుగా ఆ రంగంలో ఉన్నవారికి సాధ్యం కానిది ఇంత స్వల్పకాలంలో అదానీకి ఎలా వచ్చింది, ఇతరులకు ఎందుకు రాలేదు అన్నది ఎప్పుడైనా టైవ్‌‌సు ఆఫ్ ఇండియా విశ్లేషించిందా ? మిగతా పత్రికల తీరుతెన్నులు కూడా అవే. బ్లూవ్‌ుబెర్గ్ తాజా బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ ఏడాది జనవరి 24న 119 బి.డాలర్ల సంపద ఉన్న అదానీ ఇప్పుడు 57.2 బి.డాలర్లకు దిగజారారు.హరూన్ సంస్థ అంచనా 53బి.డాలర్లుగా ఉంది. ముకేష్ అంబానీ 82బి.డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు.
దేశం వృద్ది చెందటం లేదని ఎవరూ చెప్పరు. దాని ఫలాలు ఎవరికి దక్కుతున్నాయన్నదే చర్చ. వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగాలు పెరుగుతున్నది కొన్నే. పోనీ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు చెబుతున్న ఊటసిద్దాంతం ప్రకారం పెరిగిన సంపదలు దిగువ వారికి చేరుతున్నాయా అంటే చివరికి అచ్చేదిన్, తాజాగా అమృత కాలం అని చెప్పిన నరేంద్రమోడీ తొమ్మిదేండ్ల పాలన తరువాత మన్‌కీ బాత్‌లో కూడా చెప్పే ధైర్యం చేయలేదు.దేశంలో జనవరిలో 7.14శాతంగా ఉన్న నిరుద్యోగం ఫిబ్రవరిలో 7.45శాతానికి పెరిగిందన్న సిఎంఐఇ సమాచారాన్ని ఫైనాన్సియల్ టైవ్‌‌సు ఉటంకించింది. నైపుణ్య శిక్షణ పథకాన్ని మన్మోహన్ సింగ్ కాలంలోనే ప్రారంభించారు. దానికి ఒక మంత్రిని, కేటాయింపులను పెంచి అసలు దానికి ఆద్యుణ్ణి తానే అన్నట్లుగా నరేంద్రమోడీ ప్రచారం చేసుకున్నారు.

నిజం ఏమిటి ? “ మనది ప్రధానంగా కార్పొరేట్ వృద్ది మాత్రమే. ఒక యూనిట్ ఉత్పాదనకు భారత కార్పొరేట్లు ఎక్కువ మంది జనాలను నియమించటం లేదు.ఒక వైపు యువతకు ఉద్యోగాలు రావటం లేదు. మరోవైపు తమకు నిపుణులైన జనాలు దొరకటం లేదని కంపెనీలు ఫిర్యాదు చేస్తున్నాయి. జీవితకాల ఉపాధికి ప్రభుత్వ ఉద్యోగం అవసరమని ఆకాంక్షిస్తున్నారు, నూటనలభై కోట్ల మంది జనాభాతో పోలిస్తే అవి చాలా తక్కువ.” అని ప్రణాళికా సంఘ మాజీ ప్రధాన సలహాదారు ప్రణబ్ సేన్ చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది. “ నైపుణ్యాలు దొరకటం మరొక సమస్య. అనేక కంపెనీలు ఇప్పటికే డిమాండ్ ఉన్న నైపుణ్యాలను వృద్ధి చేసుకున్న వారిని తీసుకుంటున్నాయి.భారత్‌లో ఫైనాన్స్, బీమా, రియలెస్టేట్, పొరుగుసేవలు, టెలికాం, ఐటి రంగాలలో ఎక్కువ వృద్ది ఉంది. కానీ ఇవి ఉపాధిని సృష్టించేవి కాదు ” అని అజీవ్‌ు ప్రేవ్‌ుజీ విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర ఫ్రొఫెసర్ అమిత్ భోసలే చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది.
భారత్‌లో ఉపాధి సమ్య పరిష్కారం కావాలంటే ఇరవై సంవత్సరాల పాటు వార్షిక వృద్ది రేటు పద్దెనిమిది శాతం ఉండాలని ఐదేండ్ల క్రితం ప్రపంచబాంకు అంచనా వేసింది. చిత్రం ఏమిటంటే తన విధానాలతో ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా జిడిపి వృద్ది రేటును తమ ప్రభుత్వం సాధిస్తున్నట్లు మోడీ సర్కార్ చెప్పుకుంటున్నది. మోడీ అధికారానికి వచ్చిన తొలి సంవత్సరాల్లో ఐదుశాతానికి అటూ ఇటూగా ఉన్న నిరుద్యోగ రేటు ప్రస్తుత 78శాతం మధ్య ఉంటున్నది. శ్రామిక శక్తి భాగస్వామ్య అంశంలో రెండు వందల దేశాల సమాచారాన్ని గ్లోబల్ ఎకానమీ డాట్‌కావ్‌ు విశ్లేషించింది. దాని ప్రకారం 2021లో 87.3శాతంతో కతార్ ఒకటవ స్థానంలో ఉంది.

మన దేశంతో సమంగా జనాభా ఉన్న చైనా 68.6శాతంతో 42వది కాగా మన దేశం 45.57 శాతంతో 159వ స్థానంలో ఉంది. కరోనా కాలంలో 40శాతంలోపుకు పడిపోయింది. ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు వారిలో 2022 అక్టోబరులో పట్టణ నిరుద్యోగం 42శాతం ఉండగా అదే చైనాలో 1624 తరగతిలో 18శాతమే ఉంది. ప్రస్తుతం దేశంలో 30 ఏండ్ల లోపు వారు సగం మంది ఉన్నారు. అంటే ఉపాధి అవసరం ఎంత ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడున్న ధోరణుల ప్రకారం 2040నాటికి 59 ఏండ్లు పైబడిన వారు దేశంలో ఎక్కువ మంది ఉంటారని అంచనా.2024లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది చివరి నాటికి పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తామని కేంద్ర ప్రకటించింది. ఇవన్నీ సంవత్సరాల తరబడి నింపకుండా ఉంచిన ఖాళీలు.మెకెన్సీ సంస్థ అంచనా ప్రకారం 2030 నాటికి దేశంలో తొమ్మిది కోట్ల మేరకు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.
దేశంలో ఉపాధి రహిత వృద్ది ఆందోళన కలిగిస్తోందని, వృద్ధికి అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహీంద్రా కూడా చెప్పారు. అమెరికాలో కార్మిక శక్తి భాగస్వామ్యం 62శాతం కాగా మన దేశంలో 40శాతమని(2022) చెప్పారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2020 ఆర్థిక సర్వేలో 2025 నాటికి మంచి వేతనాలు ఉండే ఉద్యోగాలను నాలుగు కోట్లు, 2030నాటికి ఎనిమిది కోట్లు కల్పించగలమని, చైనా తరహా వృద్ది విధానాన్ని అనుసరించాలని కూడా దానిలో పేర్కొన్నారు. దేశంలోని పెద్ద పట్టణాల్లో స్విగ్గి, జొమాటో వంటి కాలక్షేప ఉద్యోగాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.గ్రామాల్లో అలాంటి అవకాశాలు కూడా ఉండటం లేదు.వృద్ధికి అనుగుణంగా ఉపాధి లేదు, ఉన్న ఉపాధికి పొందుతున్న వేతనం కూడా నామమాత్రంగా ఉంది. తగినంత వేతనం లేకుండా కొనుగోలు శక్తి పెరగదు. స్థానిక కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగానే ఎగుమతి మార్కెట్లో తేడాలు వచ్చినా చైనా తట్టుకోగలుగుతోంది. మన దేశంలో ఆ పరిస్థితి ఉందా ?

ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అమెరికాలోని యుబిఎస్ సంస్థ ప్రపంచంలో ధరలు, రాబడి గురించి విశ్లేషణ వెల్లడిస్తుంది. న్యూయార్క్ నగరాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రపంచంలోని ఇతర నగరాల్లో పరిస్థితిని అది పోలుస్తుంది. దాని తాజా నివేదిక ప్రకారం కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.నగదు డాలర్లని, కార్‌మెకానిక్, భవన నిర్మాణ కార్మికుల మొత్తాలను వార్షిక వేతనంగానూ, బ్రాకెట్లలో ఉన్న అంకెలు వారంలో పనిగంటలుగా గమనించాలి. న్యూయార్క్‌లో వంద డాలర్ల వేతనం ఉంది అనుకుంటే చైనాలోని షాంఘైలో 20.9, బీజింగ్‌లో 17, ముంబైలో 8.5, ఢిల్లీలో ఏడుగా ఉంది.ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే చైనాలో వేతనాలు పెరుగుతున్న కారణంగా అక్కడి నుంచి కొన్ని విదేశీ కంపెనీలు వెళుతున్నాయని కొన్ని వార్తలు.చైనా నుంచి వెలుపలికి వెళ్లే కంపెనీలు అవి ఎన్నైనా ఇతర దేశాలకు వెళుతున్నాయి

తప్ప మన ప్రభుత్వం ఎగుమతి ప్రోత్సాహక పథకాల ఆశ చూపినా మన వైపు చూడటం లేదు. కంపెనీలకు ఎక్కడ వేతనాలు తక్కువగా ఉంటే అక్కడకు వెళతాయని వేరే చెప్పనవసరం లేదు. కానీ మన దేశానికి ఆ మేరకు రావటం లేదు, వచ్చిన దాఖల్లాలేవు.ఎందుకు రావటం లేదో, అనేక కంపెనీలు మన దేశం నుంచి ఎందుకు తరలిపోతున్నాయో ఆలోచించుకోవాలి. భారత అధిక వృద్ది రేటు, ఉద్యోగాలు తక్కువ నరేంద్రమోడీ సమస్య కాదు. కార్పొరేట్లకు అమృతకాలం, అచ్చేదిన్, దేశ యువత భవిష్యత్‌కు ముప్పు. కాంగ్రెస్ 50 సంవత్సరాల్లో చేయలేని వాటిని తాను ఐదు సంవత్సరాల్లోనే చేసినట్లు 2019 ఎన్నికల్లో నరేంద్రమోడీ చెప్పుకున్నారు. దిశ, దశ తెలుసుకొనేందుకు తొమ్మిదేండ్లు తక్కువ కాదు.

దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారో, ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలోకి నెట్టారు. ఎన్నికల వాతావరణం ఏర్పడింది కనుక దీని గురించి మోడీ భక్తులు ఎలా స్పందిస్తారో చెప్పనవసరం లేదు. నిజానికి ఇది నరేంద్రమోడీ వ్యక్తిగత సమస్య కాదు. తమది కాంగ్రెస్‌కు భిన్నమైన పార్టీ అని జనాన్ని నమ్మించేందుకు చేసిన ప్రచారం తప్ప వాజ్‌పాయి ఏలుబడిలో గానీ ఇప్పుడు నరేంద్రమోడీ పాలనలో అనుసరిస్తున్న దివాళాకోరు విధానాలు గానీ గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టినవే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచ బాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) మన దేశం మీద రుద్దిన విధానాలకు భారతీయ ముద్ర వేసి అమలు జరుపుతున్న ఫలితమే. మరి కాంగ్రెస్‌కు బిజెపికి తేడా లేదా అంటే ఉంది. ఆర్థిక విధానాల వైఫల్యాలకు తోడు గోబెల్స్ సమాచారాన్ని జనాలకు అందించే వాట్సాప్ విశ్వవిద్యాలయం, మత విద్వేషాన్ని బిజెపి బోనస్‌గా ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News