రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో చాలా మార్పు
ప్రపంచమే ఆశ్చర్యపోయింది: ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్
జైపూర్ : భారత్ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో ఎంతో మారిపోయిందని, దేశం పురోగమిస్తున్న వేగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిందని ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ మంగళవారం చెప్పారు. జైపూర్‌లో 16వ రాజస్థాన్ శాసనసభ సభ్యుల కోసం నిర్వహించిన ఒక శిక్షణ కార్యక్రమంలో ధన్‌ఖడ్ ప్రసంగిస్తూ, ‘భారత్ ఎంతగానో మారిపోయింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల పరంగా మార్పు చాలా చోటు చేసుకుంది. మనం ప్రపంచంలో ప్రముఖ స్థానంలో ఉన్నాం. మనం ఇక ఏ ఇతర దేశంపైనా ఆధారపడడం లేదు’ అని చెప్పారు.
ఆర్థిక పరంగా ప్రపంచంలో ఐదవ సూపర్ పవర్ కావడం తక్కువ ఏమీ కాదు. ఇప్పుడు భారత్ ప్రపంచంలో ఐదవ ఆర్థిక అగ్ర రాజ్యంగా ఉన్నది. మనం కెనడా, ఫ్రాన్స్‌లను వెనుకకు నెట్టాం. శతాబ్దాల పాటు మనల్ని పాలించిన వారిని వెనుకకు నెట్టాం. రానున్న రెండు మూడు సంవత్సరాలలో జపాన్, జర్మనీ దేశాలను వెనుకకు నెట్టి భారత్ మూడవ అగ్ర రాజ్యం కాగలదు’ అని ఆయన అన్నారు. ఎంఎల్‌ఎలను ఉద్దేశించి ధన్‌ఖడ్ మాట్లాడుతూ, ‘ఇందులో మీ కృషి భారీగా ఉంది.
నాయకత్వం, విధానాలు, సామాన్యుని తోడ్పాటు కూడా ఉంది. మీ ముందు మరిన్ని సవాళ్లు ఉన్నాయి. భారత్ పురోగమిస్తున్న వేగానికి ప్రపంచం ఆశ్చర్యపోతున్నది. భారత్ ఇటువంటి దశను చేరుకుంటుందని ప్రపంచం ఊహించను కూడా లేదు’ అని చెప్పారు. అంతకు ముందక ధన్‌ఖడ్‌కు అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవ్‌నాని, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్వాగతం పలికారు.