న్యూఢిల్లీ : అమృతసర్ నుంచి వస్తున్న ఇండిగో విమానం ఆదివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగినప్పుడు నిష్క్రమణ ట్యాక్సీవేను మిస్ అయిందని, ఫలితంగా ఒక రన్‌వేపై 15 నిమిషాల సేపు అవరోధం ఏర్పడిందని విమానాశ్రయ వర్గాలు తెలియజేశాయి. ఢిల్లీకి అమృతసర్ నుంచి వస్తున్న విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తరువాత తక్కువ పారదర్శకత కారణంగా నిష్క్రమణ ట్యాక్సీవేను చేరుకోలేకపోయిందని ఇండిగో సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
6ఇ2221 సర్వీసుగా నడుస్తున్న ఎ320 విమానం నిర్దేశిత ట్యాక్సీవేను మిస్ అయిన తరువాత ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే 28/10 చివరికి వెళ్లిందని ఆ వర్గాలు తెలిపాయి. విమానం ఉదయం సుమారు 8.30 గంటలకు న్‌వే 28/10పై దిగిందని, కానీ నిర్దేశిత ట్యాక్సీవే దిశగా వెళ్లలేకపోయిందని, ఫలితంగా పావు గంటపై పైగా ఆ రన్‌వేపై అవరోధం ఏర్పడిందని ఆ వర్గాలు వివరించాయి. ఒక టోయింగ్ ట్రాక్టర్ ఆ విమానాన్ని పార్కింగ్ బే వరకు తీసుకువెళ్లిందని, ఆ తరువాత ఆ రన్‌వేపై మామూలుగా విమాన సర్వీసులు నడిచాయని ఆ వర్గాలు తెలిపాయి.