ఒకే రోజు రెండు ఘటనలు
న్యూఢిల్లీ : భారత దేశానికి చెందిన విమానాలు ఇటీవల తరచుగా సాంకేతిక లోపాలను ఎదుర్కొంటున్నాయి. యూఏఈ లోని షార్జా నగరం నుంచి హైదరాబాద్‌కు రావలసిన షార్జాహైదరాబాద్ ఇండిగో విమానం( 6 ఇ1406 ) ఇంజిన్‌లో సాంకేతిక లోపాలను పైలట్లు గుర్తించి, వెంటనే కరాచీలో దించేశారు. భారత్‌కు చెందిన ఓ విమానం ఇలా పాక్‌లో ల్యాండ్ కావడం గత రెండు వారాల్లో ఇది రెండోసారి. ఈ విమానం లోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు మరో విమానాన్ని పంపించారు. ఇది జరిగిన గంట వ్యవధి లోనే ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యను ఎదుర్కొంది.
కాలికట్ దుబాయ్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 737 క్యాబిన్‌లో కాలిన వాసన రావడంతో దాన్ని అత్యవసరంగా ఒమన్ లోని మస్కట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ ) వెల్లడించింది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్టు తెలిపింది. అదే రోజున ఢిల్లీ నుంచి వడోదర వెళ్తున్న ఇండిగో విమానం ఇంజిన్ కంపించడంతో జైపూర్‌లో అత్యవసరంగా దించేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసిఎ ) వెల్లడించింది. ఈ రెండు సంఘటలపై డిజిసిఎ విచారణ జరుపుతోంది. ఇటీవల దుబాయ్ మధురై స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆలస్యంగా బయలుదేరింది. అడ్డిస్ అబబా నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఇధియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రెజరేషన్ సమస్య ఏర్పడటంతో అత్యవసరంగా కోల్‌కతాలో దిగిందని డిజిసిఎ జులై 16న ప్రకటించింది.