న్యూఢిల్లీ : 1975లో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ కాలం భారత దేశ చరిత్రలో మర్చిపోలేని చీకటి రోజులుగా ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించి ప్రజాస్వామ్య విలువల పటిష్టతకు పాటుపడిన సాహస వంతులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని మోడీ ఆదివారం ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈజిప్టు పర్యటనలో ఉన్న మోడీ ఆనాడు ఎమర్జెన్సీ విధించి 48 ఏళ్లు అయిన సందర్భంగా ఆనాటి పరిస్థితిని ఉదహరించారు. రెండేళ్ల ఎమర్జెన్సీ కాలంలో అసమ్మతిని అణచివేయడానికి అనేక మంది విపక్ష నేతలను జైళ్లలో పెట్టారని, పౌరహక్కులకు తీవ్ర విఘాతం కలిగించారని, పత్రికలపై సెన్సార్ విధించారని తీవ్రంగా విమర్శించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఎమర్జెన్సీ విధింపు స్వార్థపూరిత అధికార పోరుకు సంకేతంగా విమర్శించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఎమర్జెన్సీ రోజులు తనతరం వారికి రాజకీయ అనుభాలకు నిర్వచనమని, జీవిత గుణపాఠమని వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పత్రికలపైన, భావస్వేచ్ఛపైన జరిగిన పోరాటానికి సంబంధించి న పత్రికల క్లిప్పింగ్‌లను ట్వీట్ చేశారు. ఆనాటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి సహనంతో చిత్రహింసలు భరించిన దేశభక్తులకు తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని బీజేపీ చీఫ్ జెపి నడ్డా పేర్కొన్నారు.